పచ్చి మోసం
అనంతపురం అగ్రికల్చర్ : అధికారంలోకి రాగానే రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని పేర్కొన్న సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు పూటకోమాట చెబుతూ నయవంచనకు గురిచేస్తున్నారని రైతులు మండిపడ్డారు. రుణమాఫీని తక్షణం అమలు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా టవర్‌క్లాక్ నుంచి ర్యాలీగా వచ్చిన రైతులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయేందుకు యత్నించారు. పోలీసులు అడ్డగించడంతో రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
ఈ సందర్భంగా రైతులు ‘అసమర్థ సీఎం డౌన్ డౌన్, రుణమాఫీని వెంటనే అమలు చేయాలి’ అంటూ నినాదాలు చేయడంతో కలెక్టరేట్ ఆవరణం దద్దరిల్లింది. చివరకు కొంత మంది రైతు సంఘం నాయకులకు ప్రజావాణిలోకి వెళ్లేందుకు అవకాశం కల్పించడంతో వారు వెళ్లి.. కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వెంటనే రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. ప్రత్యామ్నాయ విత్తనాలను 90 శాతం రాయితీతో ఇవ్వాలన్నారు. జిల్లాను కరువు జిల్లాగా ఆర్‌బీఐ పరిగణించక పోవడం ఏమిటని ప్రశ్నించారు. సరైన సమయంలో ప్రభుత్వం, అధికారులు నివేదిక పంపక పోవడం వల్ల నేడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
కొన్ని సంవత్సరాల నుంచి జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోందని, ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు ప్రభుత్వానికి, అధికారులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వెంటనే జిల్లాను కరువు జిల్లాగా ఆర్‌బీఐ గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. స్వామినాథన్, జయతీ ఘోష్ సిఫారసులు అమలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని, ప్రాజెక్టు అనంత పనులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో రైతులు తాకట్టు పెట్టిన బంగారు నగలను బ్యాంకర్లు వేలం వేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కొత్తరుణాలు ఇవ్వకపోవడంతో పంట సాగు చేయలేని దుస్థితి నెలకొందన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కరువు జిల్లాగా ఆర్‌బీఐ గుర్తించక పోవడంపై ప్రభుత్వానికి లేఖ రాస్తున్నానని తెలిపారు. మరికొద్ది రోజుల పాటు వేలం వేయకూడదని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. కరువు జిల్లా రైతులను అన్ని విధాల ఆదుకోవడానికి తనవంతు కృషి చేస్తానని వివరించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు నాగేష్, హరి, సుబ్బిరెడ్డి, చంద్రశేఖరెడ్డి, అనిల్‌రెడ్డి, రామాంజనేయులు, కదిరప్ప, మాదన్న, రామస్వామి, నారాయణస్వామి, చెన్నారెడ్డి, దస్తగిరి, రాజశేఖర్, వెంకటరెడ్డి, రామన్న, యర్రపరెడ్డి, క్రిష్ణ, నారాయణ, అంజినరెడ్డి, వివిధ మండలాల రైతులు పాల్గొన్నారు.