- రెండుమార్లు వివరాలు అందజేసినా అందని రుణ మాఫీ సొమ్ము
- మరోమారు అధికారులకు పత్రాలు సమర్పించేందుకు వస్తున్న రైతులు
- ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి
సాక్షి, కడప : రుణ మాఫీ దక్కని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ వద్ద రైతులు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రుణ మాఫీ కాని రైతులు దరఖాస్తు చేసుకునేందుకు అనువుగా ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినప్పటికీ టోకన్ల కోసం వారు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. వివరాలు సమర్పించడానికి ఉదయం ఒకసారి మాత్రమే టోకన్లు ఇస్తుండటంతో ఆ తర్వాత వచ్చిన రైతులు గంటలకొద్దీ ఎదురు చూడాల్సి వస్తోంది. వృద్ధులైన పలువురు రైతులు ఇదేం ఖర్మ అనుకుంటూ వేదనతో వెనుదిరుగుతున్నారు.
ఎన్నిమార్లు పత్రాలు సమర్పించినా ఏదో ఒక కొర్రీ వేస్తూ రైతులను సతాయిస్తున్నారు. జిల్లాలో 4,95,008 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. తొలి విడతలో 2,78,070 మందికి వర్తించజేయగా, రెండవ విడతలో 1,33,048 మందికి వర్తింపజేశారు. ఇందుకు రూ.450 కోట్లు కేటాయించారు. అయితే చాలా మంది రైతులు బ్యాంకులకు వెళ్లి రుణమాఫీ అయిన సొమ్ము ఇవ్వాలని అడగడం లేదు. ఎందుకంటే ఇప్పటికే వడ్డీ భారం బాగా పెరిగిపోయింది. గత ఏడాది, ఈ ఏడాది కలుపుకుని లక్షకు దాదాపు రూ. 25 వేల పైచిలుకు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలుగుదేశం సర్కార్ మాత్రం రుణమాఫీ పేరుతో రూ. లక్ష ఉన్న రైతుకు రూ. 20 వేలు మాత్రమే ప్రస్తుతానికి మాఫీ చేసింది. రైతు బ్యాంకుకు వెళ్లి మాఫీ సొమ్ము అడిగితే రెన్యూవల్ చేయాలని అధికారులు అడుగుతున్నారు. రెన్యూవల్ చేసుకోవాలంటే అదనంగా రైతు కొంత మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మాఫీ అయిన సొమ్మును తెచ్చుకోలేక కొంతమంది రైతులు ఇబ్బంది పడుతుంటే మరో పక్క మాఫీ కాక మరి కొంతమంది అవస్థలు పడుతున్నారు. మాఫీ కాని రైతులు దాదాపు 83 వేల మంది ఉన్నట్లు అంచనా. ఇటీవలే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రుణమాఫీ సెల్‌కు రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పత్రాలు సమర్పిస్తున్నారు. ఇక్కడ ఆధార్, రేషన్ కార్డును పరిశీలించి పొరపాట్లు సరిచేస్తున్నారు.
ఇదేం ఖర్మ బాబూ..
Published Tue, May 5 2015 5:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement