రైతు వ్యధ పట్టని బాబు
రుణాలు రద్దు చేసే సత్తా లేనప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత హామీ ఎందుకు ఇచ్చినట్టు..ఏరుదాటి తెప్ప తగలేసేందుకా..దేశానికి పట్టెడన్నం పెట్టే రైతులను అవమానించేందుకా..వ్యవసాయాన్ని ఎగతాళి చేసేందుకా.. సీఎం గా చంద్రబాబు తొలి సంతకం చేసిన నాటి నుంచి రుణమాఫీ కోసం ఎదురు చూడని రైతూ లేడు..ఎదురు చూడని కుటుంబం లేదు.. పాలనా పగ్గాలు చేపట్టి 150 రోజులు గడిచినా హామీ ఇచ్చిన రూ.1.50 లక్షల రుణం మాఫీ అమలు కాకపోగా సవాలక్ష సందేహాలు రైతుల బుర్రలు తొలుస్తున్నాయి.
సత్తెనపల్లి: జిల్లాలో రైతు రుణమాఫీపై స్పష్టత కొరవడింది. ఎవరి రుణాలు మాఫీ చేస్తారు, ఎవరి పేర్లు తొలగిస్తారు అనే విషయాలు రైతులకు బోధపడడం లేదు. రెండు రోజుల కిందట ప్రభుత్వం రుణమాఫీ అర్హుల జాబితా విడుదల చేసినా క్షేత్ర స్థాయిలో వివరాలు తెలియడం లేదు.
శనివారం గ్రామ రెవెన్యూ అధికారుల వద్దకు జాబితాలు వచ్చాయి. ఆ జాబితాల్లో ఉన్న రైతులు రుణమాఫీకి అర్హులా, అనర్హులా పరిశీలించి పంపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు వీఆర్వోలు గ్రామాల్లో పరిశీలన చేస్తున్నారు. రైతుల నుంచి రేషన్, ఆధార్ కార్డు కాపీలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమపేర్లు జాబితాలో ఉన్నాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న అందరి రైతుల పేర్లు ఈ జాబితాల్లో ఉన్నాయా, బ్యాంకుల్లో సరైన ఆధారాలు అందించనివారివా మాత్రమే ఉన్నాయా అనేది స్పష్టత లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వివరాల కోసం రైతులు బ్యాంకుల వద్దకు వెళితే జాబితాలు తహశీల్దారుల వద్దకు వచ్చాయని చెబుతూ, గ్రామాలకు రెవెన్యూ అధికారులు వస్తున్నారని చెబుతున్నారు.
ఒకవేళ జాబితాలో పేర్లు లేనివారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా, ఇటు రెవెన్యూ అధికారులు, అటు బ్యాంకర్లు చెప్పలేకపోతున్నారు. రుణమాఫీ కటాఫ్ తేదీ ప్రకటించకపోవడంతో రైతుల్లో అనేక అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి. 2013 డిసెంబరు 31వ తేదీనా, లేక 2014 మార్చి 31వ తేదీనా అనేది జాబితా పరిశీలనకు వచ్చిన అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు.
రెండు రోజుల నుంచి రైతులు పనులు మానుకుని తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతు న్నారు. సరైన పత్రాలు లేకపోతే అక్కడే అందించేందుకు పత్రాలు చేతపట్టుకుని వెళుతున్నారు. ఇప్పటికైనా రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.