మచిలీపట్నం టౌన్ : బందరు పోర్టు దాని అనుబంధ పరిశ్రమల పేరుతో రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. భూములు కోల్పోయే రైతులతో స్థానిక పరాసుపేటలోని సువర్ణ కల్యాణ మండపంలో ఆదివారం సమావేశం జరిగింది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చలమలశెట్టి ఆదికిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రఘువీరా మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు మూడు సార్లు మంత్రివర్గ సమావేశంలో బందరు పోర్టు నిర్మాణాన్ని 5,300 ఎకరాల్లో చేపట్టేందుకు నిర్ణయిస్తే దీన్ని వ్యతిరేకించి వెయ్యి ఎకరాలు చాలని అప్పట్లో అసెంబ్లీలో డిమాండ్ చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రికాగానే 33 వేల ఎకరాలు సేకరించేందుకు నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించారు.
2013 భూసేకరణ చట్టం ద్వారా రైతుల భూములను తీసుకునేందుకు రాత్రికిరాత్రే రూ.9 కోట్లు ఖర్చు చేసి జారీ చేసిన నోటిఫికేషన్‌ను తక్షణం రద్దు చేయాలన్నారు. భూ సేకరణ చట్టం ప్రకారం రెండుమూడు పంటలు పండే సాగు భూముల్లో ఒక్క ఎకరం కూడా తీసుకునే అవకాశం లేదని స్పష్టంచేశారు. భూ సేకరణ ప్రాంతంలోని 100 మంది రైతుల్లో 80 మంది అంగీకారం తెలపాల్సి ఉందని పేర్కొన్నారు. సామాజిక తనిఖీ, గ్రామ సభలను నిర్వహించి ప్రజలు అంగీకరిస్తేనే భూమి సేకరించాలని, మార్కెట్ రేటుకు నాలుగు రెట్ల మొత్తాన్ని బాధిత రైతులకు చెల్లించాలని చట్టంలో ఉందన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రాంతంలోని ఎకరం మార్కెట్ ధర రూ.30 లక్షలని, 33 వేల ఎకరాలకు ప్రభుత్వం దాదాపు రూ.4 లక్షల కోట్లు చెల్లించాలని, అంత సీను ప్రభుత్వానికి ఉందా అని రైతులను అడిగారు. దీనికి రైతులు లేదు.. లేదు.. అంటూ బదులిచ్చారు. భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి ఎంపీ, మంత్రులు ల్యాండ్ పూలింగ్ చేస్తామంటూ గ్రామాలు తిరగడం వారి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. పిచ్చొడి చేతిలో రాయి ఎలాగో టీడీపీ చేతికి అధికారం ఇస్తే అలాగే ఉందని ఎద్దేవాచేశారు. కోన గ్రామంలో వెళ్లిన సందర్భంలో అక్కడి రైతులు పార్టీలకు అతీతంగా భూములు తీసుకోవద్దని తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. శనివారం రాత్రి ఇదే గ్రామానికి వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావును గ్రామస్తులను ఊరి పొలిమెర వరకు తరిమితరిమి కొట్టారని, దీన్ని జీర్ణించుకోలేకే తాము ఆ గ్రామం వెళ్లిన సందర్భంగా వారు యువకులను తమ పైకి రెచ్చిగొట్టి ఇసుక వేసేలా చేశారని పేర్కొన్నారు.
టీడీపీకి తమను ఎదుర్కొనే శక్తి ఉంటే నోటిఫికేషన్ ఇచ్చిన ఏ గ్రామానికైనా వచ్చి చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ విజయవాడ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ కోన గ్రామంలో టీడీపీకి చెందిన వ్యక్తులు కాంగ్రెస్ నాయకులపై ఇసుక వేసిన ఘటనను ఖండిం చారు. పోర్టును 5,300 ఎకరాల్లోనే నిర్మించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, డీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, కాంగ్రెస్ నాయకులు కొలనుకొండ శివాజీ, ఆకుల శ్రీనివాసకుమార్, ఎస్.వి.రాజు, మత్తి వెంకటేశ్వరరావు, బుల్లెట్ ధర్మారావు, గుమ్మడి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత పలు గ్రామాల రైతులు తమ ఆవేదనను రఘువీరాకు వివరించారు.
రైతులతో చెలగాటమొద్దు
Published Mon, Sep 14 2015 1:09 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement