టికెట్లపై చంద్రబాబు మౌనం
సాక్షి, కర్నూలు: వలస నేతల రాజకీయ భవిష్యత్ సుడిగుండంలో చిక్కుకుంది. రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీలో మనుగడ లేదని స్పష్టం కావడంతో పార్టీ మారారు. వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేసినా తలుపులు తెరుచుకోకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో టీడీపీ వైపు అడుగులేశారు. ఆది నుంచి కాంగ్రెస్‌తో లోపాయికారి ఒప్పందం నెరుపుతున్న ‘పచ్చ’ పార్టీ కండువా కప్పుకున్నారు.
ఆ పార్టీ తరఫున అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్న నేతలకు నెల రోజులు గడవక మునుపే చుక్కెదురవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ద్వంద్వ నీతి.. రెబల్స్ బెడదతో పార్టీ టికెట్ వస్తుందో రాదో తెలియని తికమక నెలకొంది. ఈ పరిస్థితుల్లో కష్టమైనా.. నష్టమైనా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోదామని పార్టీ మారిన నేతలు కొందరు ఆలోచనలో పడినట్లు సమాచారం.
మాజీ మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి, లబ్బి వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి ఇటీవల టీడీపీలో చేరడం తెలిసిందే. వీరిలో చల్లా విధిలేకనే టీడీపీలో చేరినట్లు బహిరంగంగానే ప్రకటించగా.. తక్కిన నేతలు ప్రజలు చీదరించుకుంటున్న కాంగ్రెస్‌లో ఉండలేక టీడీపీ గొడుగు కిందకు చేరారు. మొదట్లో టికెట్ల హామీతో వీరిని పార్టీలోకి చేర్చుకున్న చంద్రబాబు.. ఇప్పుడేమో వేచి చూసే ధోరణి అవలంబిస్తుండటం గమనార్హం.
రోజుకో మలుపు తిరుగుతున్న టికెట్ల వ్యవహారంతో ఈ నేతలకు టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతోంది. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి ఆదే స్థానం నుంచి పోటీ చేసే ఉద్దేశంతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ ఆ స్థానంపై పట్టుబట్టడంతో ఈయన త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవేళ నంద్యాలను బీజేపీకి ఇచ్చేస్తే శిల్పా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ బెర్త్ ఇప్పటికీ ఖాళీగా ఉండటంతో తిరిగి అదే పార్టీ నుంచి పోటీ చేస్తే ఎలాగుంటుందనే విషయంపైనా ఆయన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. శ్రీశైలం శాసనసభ్యుడు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి భవితవ్యంతోనూ బాబు చెలగాటమాడుతున్నారు.
నియోజకవర్గ ప్రజ లకు అందుబాటులో ఉండరనే ప్రచారం నేపథ్యంలో ఆయన బంధువర్గం అధికంగా ఉన్న పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో టీడీపీ పంచన చేరారు. ఈ స్థానంపైనా బీజేపీ కన్నేయడం.. ఇది వరకే చంద్రబాబు హామీతో నియోజకవర్గంలో రియల్టర్ కేజే రెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఏరాసుకు టికెట్ దక్కడం అనుమానంగా మారింది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూడా ఇప్పటికీ టీడీపీ తలుపులు తడుతూనే ఉన్నారు.
ఒకవేళ అక్కడి నుంచి అవకాశం లేకపోతే బీజేపీ తరఫున.. సాధ్యం కాకపోతే స్వతంత్రంగానైనా బరిలో నిలవనున్నట్లు సమాచారం. దీంతో ఏరాసు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకోవడం మంచిదనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆ మేరకు ఆయన ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో మంతనాలు సాగిస్తున్నట్లు చర్చ కొనసాగుతోంది.
నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. అధినేత హామీతో అక్క డ విక్టర్ ప్రచారం చేసుకుంటుండగా.. ఊహించని విధంగా లబ్బి టీడీపీలో చేరడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగంగానే ఆయనపై పత్రికాముఖంగా విరుచుకుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి లబ్బి పోటీ చేసినా విక్టర్ పక్కలో బల్లెంగా మారడం ఖాయం.
ఈయన కూడా సొంత గూటికి వెళ్తే ఏ గొడవా ఉండదనే ఆలోచనలో పడినట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇలా కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన నాయకుల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకల్లా తయారైంది. అక్కడ ఉండలేక.. తిరిగి కాంగ్రెస్‌లో చేరలేక.. రాజకీయాలకు స్వస్తి చెప్పలేక.. మారుతున్న రాజకీయ పరిణామాలను గుడ్లప్పగించి చూస్తున్నారు.
అయ్యయ్యో..
Published Mon, Apr 14 2014 3:21 AM | Last Updated on Mon, Sep 17 2018 5:17 PM
Advertisement