Raghuvirareddy
-
విజయవాడ చేరిన రాజీవ్ సద్భావన యాత్ర
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ దేశంలో సాంకేతిక పురోభివృద్ధికి బాటలు వేశారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. తమిళనాడులోని శ్రీపెరందూర్ నుంచి ఢిల్లీ వరకు సాగుతున్న రాజీవ్‌గాంధీ స్మారక సద్భావన యాత్ర బుధవారం విజయవాడ నగరానికి చేరగా కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. రఘువీరా మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం తుదిశ్వాస విడిచే వరకు రాజీవ్‌గాంధీ కృషి చేశారన్నారు. రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన ఆయన యువతకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఎనిమిది బస్సుల్లో 150 మంది పార్టీ కార్యకర్తలతో సద్భావన యాత్ర సాగుతోందన్నారు. యాత్ర నిర్వాహకుడు ఎస్.ఎస్.ప్రకాశంను రఘువీరారెడ్డి సన్మానించారు. రాజీవ్జ్యోతికి ఏపీసీసీ కాంగ్రెస్ జెండాతో వీడ్కోలు పలికారు. శాసనమండలి విపక్షనేత సి.రామచంద్రయ్య, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు, ఆపార్టీ నాయకులు సుంకర పద్మశ్రీ, టి.జె.ఆర్.సుధాకర్‌బాబు, మల్లాది విష్ణు, కొలనుకొండ శివాజీ, ఆకుల శ్రీనివాస్, మీసాల రాజేశ్వరరావు, రాజీవ్త్రన్ పాల్గొన్నారు. -
లోకేష్, చంద్రబాబు జైళ్లకు వెళ్లడం ఖాయం
-పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మడకశిర (అనంతపురం) అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ 2019లో జైళ్లకు వెళ్లడం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. రెండేళ్ల టీడీపీ పాలనలో సీఎం చంద్రబాబు అవినీతికి పాల్పడుతూ దేశంలోనే రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దారని ఆయన ఆరోపించారు. ఆదివారం ఆయన తన స్వగ్రామం అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడుతూ అభివృద్ధిని విస్మరిస్తున్నారన్నారు. హెరిటేజ్ కంపెనీని ప్రోత్సహించేందుకే విజయా డెయిరీ రైతులకు ఇచ్చే పాలధరను తగ్గించి పాడి రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. గోదావరి పుష్కరాల్లో అరకొరగా భక్తులకు సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం రూ.1,600 కోట్లు అవినీతికి పాల్పడి 27 మందిని పొట్టను పెట్టుకుందన్నారు. ఇక కృష్ణా పుష్కరాల్లో కూడా భారీగా అవినీతికి పాల్పడటానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు పోటీ పడి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తూ విదేశీ పర్యటనలు చేయడం వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప, లాభమేమీ ఉండబోదన్నారు. విజయవాడలో దేవాలయాలు కూల్చకూడదంటూ పీఠాధిపతులు, మతాధిపతులు ధర్నాలు చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో అవినీతికి రహస్య ట్రెజరర్‌గా ఉన్న సీఎం కుమారుడు నారా లోకేష్, సీఎం 2019 తర్వాత జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. దేశంలో అవినీతిలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని సర్వేలు చెబుతున్నాయని గుర్తు చేశారు. -
టీడీపీ, బీజేపీల వైఖరేంటో తేలుతుంది
► ప్రత్యేక హోదాపై ఎన్డీయే సర్కారువి కుంటిసాకులు ► వర్షాకాల సమావేశాల్లోనే కేవీపీ బిల్లు ► ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ బీజేపీ, టీడీపీలకు అగ్ని పరీక్షలాంటిదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. ఆయన గురువారం ఢిల్లీలో కేవీపీ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ బిల్లుపై ఓటింగ్ సమయంలో బీజేపీ, టీడీపీల వైఖరి తేటతెల్లమవుతుందన్నారు. ఆ పార్టీలు నిజంగా ఏపీ అభివృద్ధిని కోరుకుంటే.. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతివ్వాలని అన్నారు.ఈ చరిత్రాత్మక బిల్లుకు సభ ఆమోదం లభిస్తుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉందన్నారు. రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీ, అప్పట్లో కేంద్ర కేబినెట్ చేసిన నిర్ణయం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. విభజన చట్టంలో నిబంధన లేదని ఎన్డీయే ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని విమర్శించారు. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా కల్పించిన సమయంలోనూ ఈ అంశం చట్టంలో లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రత్యేక హోదా కల్పించారని దిగ్విజయ్ గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదన్న వాదనలో పస లేదని తేల్చిచెప్పారు. టీడీపీపై మాకు భరోసా లేదు ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే కేబినెట్ నిర్ణయం ద్వారా ఇవ్వొచ్చని దిగ్విజయ్‌సింగ్ సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని యూపీఏ ప్రభుత్వ మంత్రివర్గం నిర్ణయించిందని, ఇప్పుడు దాన్ని అమలు చేయాలన్నారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం సభ నుంచి రిటైర్ అవుతున్న సభ్యుల వీడ్కోలుకు సమయాన్ని కేటాయించాలని రాజ్యసభ సభా వ్యవహారాల కమిటీ నిర్ణయించిందని చెప్పారు. అందువల్ల ప్రైవేట్ మెంబర్ బిల్లును వర్షాకాల సమావేశాల్లో చేపడతారని తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. పార్టీ సభ్యులకు మూడు లైన్ల విప్‌ను జారీ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందన్నారు. బిల్లుకు టీడీపీ మద్దతిస్తుందన్న భరోసా ఉందా? అన్న ప్రశ్నకు... ‘టీడీపీపై ఎవరికైనా భరోసా ఉంటుందా, మాకు భరోసా లేదు. ఒకవేళ మద్దతిస్తే ఆ పార్టీ విశ్వసనీయత పెరుగుతుంది’’అని దిగ్విజయ్ బదులిచ్చారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు టి.సుబ్బరామిరెడ్డి, జేడీ శీలం పాల్గొన్నారు. ఓటింగ్‌కు రాకుండా బీజేపీ కుట్ర: కేవీపీ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం ఓటింగ్‌కు రాకుండా బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం అడ్డుకున్నప్పటికీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బిల్లుకు ఆమోదం అభిస్తుందని ఆయన అన్నారు. రాజద్రోహం: రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే, పదేళ్లు ఇస్తామని బీజేపీ నేతలు, 15 ఏళ్లు కావాలని టీడీపీ నేతలు చెప్పారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గుర్తుచేశారు. రెండేళ్ల కాలయాపన తర్వాత హోదా ఇవ్వబోమని ఎన్డీయే ప్రభుత్వం నిస్సిగ్గుగా తేల్చిందని విమర్శించారు. బిల్లు శుక్రవారం ఓటింగ్‌కు రాకుండా బీజేపీ, టీడీపీ రాజద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు. -
ప్రభుత్వాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించా
తిరుమలలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సాక్షి,తిరుమల: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని కోరుకున్నట్టు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. గురువారం తిరుమలలో ఆయన స్వామివారికి తలనీ లాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, రాయలసీమ, ఉత్తరకోస్తా ప్రత్యేక ప్యాకేజీ సాధన కోసం 12వ తేదీన 300 మంది ముఖ్యనేతలతో కలసి చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. విభజన చట్టంలో పార్లమెంట్ ద్వారా సంక్రమించిన హక్కుల సాధన కోసం మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటూ జాతీయ నేతల్ని కలుస్తామని తెలిపారు. -
రైతులతో చెలగాటమొద్దు
మచిలీపట్నం టౌన్ : బందరు పోర్టు దాని అనుబంధ పరిశ్రమల పేరుతో రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. భూములు కోల్పోయే రైతులతో స్థానిక పరాసుపేటలోని సువర్ణ కల్యాణ మండపంలో ఆదివారం సమావేశం జరిగింది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చలమలశెట్టి ఆదికిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రఘువీరా మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు మూడు సార్లు మంత్రివర్గ సమావేశంలో బందరు పోర్టు నిర్మాణాన్ని 5,300 ఎకరాల్లో చేపట్టేందుకు నిర్ణయిస్తే దీన్ని వ్యతిరేకించి వెయ్యి ఎకరాలు చాలని అప్పట్లో అసెంబ్లీలో డిమాండ్ చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రికాగానే 33 వేల ఎకరాలు సేకరించేందుకు నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టం ద్వారా రైతుల భూములను తీసుకునేందుకు రాత్రికిరాత్రే రూ.9 కోట్లు ఖర్చు చేసి జారీ చేసిన నోటిఫికేషన్‌ను తక్షణం రద్దు చేయాలన్నారు. భూ సేకరణ చట్టం ప్రకారం రెండుమూడు పంటలు పండే సాగు భూముల్లో ఒక్క ఎకరం కూడా తీసుకునే అవకాశం లేదని స్పష్టంచేశారు. భూ సేకరణ ప్రాంతంలోని 100 మంది రైతుల్లో 80 మంది అంగీకారం తెలపాల్సి ఉందని పేర్కొన్నారు. సామాజిక తనిఖీ, గ్రామ సభలను నిర్వహించి ప్రజలు అంగీకరిస్తేనే భూమి సేకరించాలని, మార్కెట్ రేటుకు నాలుగు రెట్ల మొత్తాన్ని బాధిత రైతులకు చెల్లించాలని చట్టంలో ఉందన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రాంతంలోని ఎకరం మార్కెట్ ధర రూ.30 లక్షలని, 33 వేల ఎకరాలకు ప్రభుత్వం దాదాపు రూ.4 లక్షల కోట్లు చెల్లించాలని, అంత సీను ప్రభుత్వానికి ఉందా అని రైతులను అడిగారు. దీనికి రైతులు లేదు.. లేదు.. అంటూ బదులిచ్చారు. భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి ఎంపీ, మంత్రులు ల్యాండ్ పూలింగ్ చేస్తామంటూ గ్రామాలు తిరగడం వారి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. పిచ్చొడి చేతిలో రాయి ఎలాగో టీడీపీ చేతికి అధికారం ఇస్తే అలాగే ఉందని ఎద్దేవాచేశారు. కోన గ్రామంలో వెళ్లిన సందర్భంలో అక్కడి రైతులు పార్టీలకు అతీతంగా భూములు తీసుకోవద్దని తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. శనివారం రాత్రి ఇదే గ్రామానికి వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావును గ్రామస్తులను ఊరి పొలిమెర వరకు తరిమితరిమి కొట్టారని, దీన్ని జీర్ణించుకోలేకే తాము ఆ గ్రామం వెళ్లిన సందర్భంగా వారు యువకులను తమ పైకి రెచ్చిగొట్టి ఇసుక వేసేలా చేశారని పేర్కొన్నారు. టీడీపీకి తమను ఎదుర్కొనే శక్తి ఉంటే నోటిఫికేషన్ ఇచ్చిన ఏ గ్రామానికైనా వచ్చి చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ విజయవాడ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ కోన గ్రామంలో టీడీపీకి చెందిన వ్యక్తులు కాంగ్రెస్ నాయకులపై ఇసుక వేసిన ఘటనను ఖండిం చారు. పోర్టును 5,300 ఎకరాల్లోనే నిర్మించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, డీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, కాంగ్రెస్ నాయకులు కొలనుకొండ శివాజీ, ఆకుల శ్రీనివాసకుమార్, ఎస్.వి.రాజు, మత్తి వెంకటేశ్వరరావు, బుల్లెట్ ధర్మారావు, గుమ్మడి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత పలు గ్రామాల రైతులు తమ ఆవేదనను రఘువీరాకు వివరించారు.