టీడీపీ, బీజేపీల వైఖరేంటో తేలుతుంది
► ప్రత్యేక హోదాపై ఎన్డీయే సర్కారువి కుంటిసాకులు
► వర్షాకాల సమావేశాల్లోనే కేవీపీ బిల్లు
► ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ బీజేపీ, టీడీపీలకు అగ్ని పరీక్షలాంటిదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. ఆయన గురువారం ఢిల్లీలో కేవీపీ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ బిల్లుపై ఓటింగ్ సమయంలో బీజేపీ, టీడీపీల వైఖరి తేటతెల్లమవుతుందన్నారు. ఆ పార్టీలు నిజంగా ఏపీ అభివృద్ధిని కోరుకుంటే.. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతివ్వాలని అన్నారు.ఈ చరిత్రాత్మక బిల్లుకు సభ ఆమోదం లభిస్తుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉందన్నారు.
రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీ, అప్పట్లో కేంద్ర కేబినెట్ చేసిన నిర్ణయం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. విభజన చట్టంలో నిబంధన లేదని ఎన్డీయే ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని విమర్శించారు. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా కల్పించిన సమయంలోనూ ఈ అంశం చట్టంలో లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రత్యేక హోదా కల్పించారని దిగ్విజయ్ గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదన్న వాదనలో పస లేదని తేల్చిచెప్పారు.
టీడీపీపై మాకు భరోసా లేదు
ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే కేబినెట్ నిర్ణయం ద్వారా ఇవ్వొచ్చని దిగ్విజయ్‌సింగ్ సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని యూపీఏ ప్రభుత్వ మంత్రివర్గం నిర్ణయించిందని, ఇప్పుడు దాన్ని అమలు చేయాలన్నారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం సభ నుంచి రిటైర్ అవుతున్న సభ్యుల వీడ్కోలుకు సమయాన్ని కేటాయించాలని రాజ్యసభ సభా వ్యవహారాల కమిటీ నిర్ణయించిందని చెప్పారు. అందువల్ల ప్రైవేట్ మెంబర్ బిల్లును వర్షాకాల సమావేశాల్లో చేపడతారని తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. పార్టీ సభ్యులకు మూడు లైన్ల విప్‌ను జారీ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందన్నారు. బిల్లుకు టీడీపీ మద్దతిస్తుందన్న భరోసా ఉందా? అన్న ప్రశ్నకు... ‘టీడీపీపై ఎవరికైనా భరోసా ఉంటుందా, మాకు భరోసా లేదు. ఒకవేళ మద్దతిస్తే ఆ పార్టీ విశ్వసనీయత పెరుగుతుంది’’అని దిగ్విజయ్ బదులిచ్చారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు టి.సుబ్బరామిరెడ్డి, జేడీ శీలం పాల్గొన్నారు.
ఓటింగ్‌కు రాకుండా బీజేపీ కుట్ర: కేవీపీ
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం ఓటింగ్‌కు రాకుండా బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం అడ్డుకున్నప్పటికీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బిల్లుకు ఆమోదం అభిస్తుందని ఆయన అన్నారు.
రాజద్రోహం: రఘువీరారెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే, పదేళ్లు ఇస్తామని బీజేపీ నేతలు, 15 ఏళ్లు కావాలని టీడీపీ నేతలు చెప్పారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గుర్తుచేశారు. రెండేళ్ల కాలయాపన తర్వాత హోదా ఇవ్వబోమని ఎన్డీయే ప్రభుత్వం నిస్సిగ్గుగా తేల్చిందని విమర్శించారు. బిల్లు శుక్రవారం ఓటింగ్‌కు రాకుండా బీజేపీ, టీడీపీ రాజద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు.