యర్రగొండపాలెం టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 80 శాతం విత్తనాలను రైతులే సేకరించుకోవాలని జేడీఏ జే మురళీకృష్ణ తెలిపారు. వ్యవసాయశాఖ ద్వారా 20 శాతం విత్తనాలను మాత్రమే సబ్సిడీపై సరఫరా చేయనున్నట్లు చెప్పారు. గురువారం యర్రగొండపాలెం ఏడీఏ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు.
వ్యవసాయాధికారులు, విస్తరణాధికారులు, ఆత్మా సిబ్బంది పనితీరుపై సమీక్షించారు. వ్యవసాయాధికారులు, సిబ్బంది గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విత్తనాల సబ్సిడీ, పంటల సాగు, తదితర విషయాలపై రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం విలేకర్లతో జేడీఏ మాట్లాడుతూ జిల్లాలో సాధారణ సాగువిస్తీర్ణం 2,26,161 హెక్టార్లు కాగా, గతేడాది 45,908 హెక్టార్లు అదనంగా 2,72,069 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేసినట్లు తెలిపారు.
అందులో ప్రధానంగా 57,219 హెక్టార్లలో కంది, 56,167 హెక్టార్లలో పత్తి, 39,363 హెక్టార్లలో వరి, 17,508 హెక్టార్లలో సజ్జ, 12,251 హెక్టార్లలో నువ్వుల పంటలు సాగుచేసినట్లు వివరించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో కూడా కంది, పత్తి, వరి, సజ్జ, నువ్వుల పంటలు అధికంగా సాగయ్యే అవకాశముందన్నారు. మొత్తం విత్తనాల్లో 20 శాతం విత్తనాలను మాత్రమే వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తుందన్నారు. పెసర, మినుము, కందులు, వేరుశనగ విత్తనాలకు 33 శాతం సబ్సిడీ, పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించిన జీలుగ, పిల్లిపెసర, జనుము విత్తనాలకు 50 శాతం సబ్సిడీ ఉంటుందని పేర్కొన్నారు.
సజ్జ, ఆముదం, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు విత్తనాలకు కేజీకి 25 రూపాయల సబ్సిడీ ఉంటుందన్నారు. జిల్లాకు 90 క్వింటాళ్ల సజ్జ విత్తనాలు కేటాయించగా ప్రస్తుతం 50 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నట్లు జేడీఏ తెలిపారు. అదేవిధంగా 220 క్వింటాళ్ల పెసర అందుబాటులో ఉన్నాయన్నారు. నువ్వులు 100 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని, వీటికి సబ్సిడీ లేదని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఏ ఎం.ప్రభాకరరావు, వై.పాలెం, పుల్లలచెరువు, దోర్నాల, త్రిపురాంతకం మండలాల వ్యవసాయాధికారులు బీ శ్రీనివాసరావునాయక్, టీ అబ్రహంలింకన్, జ్యోత్స్నాదేవి పాల్గొన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు...
విత్తన విక్రయ దుకాణాల డీలర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే రైతులకు విత్తనాలు విక్రయించాలని, నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని జేడీఏ మురళీకృష్ణ హెచ్చరించారు. వై.పాలెం వ్యవసాయాధికారి కార్యాలయంలో విత్తన, విక్రయ దుకాణాల డీలర్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు వెంటనే రసీదులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వై.పాలెం ఏడీఏ ఎం.ప్రభాకరరావు, ఏవో శ్రీనివాసరావునాయక్ పాల్గొన్నారు.
80 శాతం విత్తనాలను రైతులే సేకరించుకోవాలి
Published Fri, Jun 6 2014 3:01 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement