ముంచిన ‘మిర్చి’ | Farmers protest for price of Mirchi crop | Sakshi
Sakshi News home page

ముంచిన ‘మిర్చి’

Published Fri, Mar 30 2018 5:00 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

Farmers protest for price of Mirchi crop - Sakshi

మిర్చిని పారబోస్తున్న రైతులు

అవనిగడ్డ/మోపిదేవి: కృష్ణాజిల్లా దివిసీమలో పచ్చి మిర్చి పంట రైతులకు కన్నీరు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ధర లేకపోవడంతో రైతులు మిర్చిని కోసేసి సమీపంలోని కృష్ణానదిలో పారబోస్తున్నారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని నాగాయతిప్ప, కోసూరువారిపాలెంలో రైతుల వద్ద కిలో మిర్చి కేవలం రూపాయి నుంచి మూడు రూపాయలే పలుకుతుండడంతో రైతులు తమ పంటను గురువారం కృష్ణానదిలో పారబోసి నిరసన తెలియజేశారు. ఈ గ్రామాల పరిధిలోని 15 మంది రైతులు 200 బస్తాల మిర్చి ఇలా నదిలో పారబోశారు. పంటకు ధర లేకపోవడంతో దిక్కులేక ఇలా పారబోస్తున్నామని పలువురు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. 

320 ఎకరాల్లో సాగు
కృష్ణాజిల్లా  మోపిదేవి, అవనిగడ్డ మండలాల్లో గత ఏడాది డిసెంబర్‌లో 320 ఎకరాల్లో సాగుచేశారు. మోపిదేవి మండలంలో అత్యధికంగా 250 ఎకరాల్లో సాగయింది. ఈ ప్రాంతంలో వీఎన్‌ఆర్‌ 145, టొకీటో 006 యూఎస్‌ రకాలను సాగుచేశారు. ఇవి పచ్చిమిర్చికి మాత్రమే పనికొస్తాయి. ఎండుమిర్చికి ఉపయోగపడవు. ధర పడిపోవడంతో చేసేదిలేక కూలీలతో కోయించి పారబోస్తున్నామని, అలాగే వదిలేస్తే మిగిలిన పంట రాదని పలువురు రైతులు చెప్పారు. మరోవైపు.. మిర్చి పంట సాగు చేయడానికి కౌలుతో కలుపుకుని ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.25లక్షలు ఖర్చు చేశారు. రెండేళ్ల క్రితం మిర్చి పంట లాభాలు తెచ్చిపెట్టగా.. ఆదే ఆశతో ఈ ఏడాదీ పెద్దఎత్తున సాగుచేసిన రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది.

పొలం వద్ద కిలో మిర్చి మూడు రూపాయలకు కొంటున్నారు. కానీ, టిక్కీ (70)కిలోల బస్తా కోయడానికి రూ.120లు కూలీ అవుతోంది. గోతాంకు రూ.30, పొలం నుంచి ఊరిలోకి తోలడానికి ఆటోకు రూ.20, అక్కడ నుంచి హైదరాబాద్‌కు బస్తాకు రూ.100తో మొత్తం కలిపి బస్తా మిర్చికి రూ.270 ఖర్చవుతుండగా వచ్చేది మాత్రం 210 రూపాయలే. గతంలో ఉత్తరాది నుంచి ఆర్డర్లు రావడంతో మిర్చికి బాగానే ధర పలికింది. పదిరోజుల నుంచి ఆర్డర్లు లేకపోవడంతో ధర బాగా పడిపోయింది. స్థానికంగా వారపు సంతలు, కూరగాయల దుకాణాల్లో తక్కువకు కొనడం.. ఖర్చులు కూడా రాకపోవడంతో కూలీలతో కోయించి మిర్చిబస్తాలను సమీపంలోని కృష్ణానదిలో పారబోస్తున్నారు. ఇలా రెండు రోజుల నుంచి 200 బస్తాల వరకు రైతులు నదిలో పారబోసి నిరసన తెలిపారు. 

పంటను దున్నేస్తున్నారు..
మరోవైపు.. ధర పడిపోవడం, ఖర్చులు రాకపోవడంతో మోపిదేవి మండల పరిధిలోని నాగాయతిప్పలో రైతులు మిర్చిపంటను రొటేవేటర్‌తో దున్నేస్తున్నారు. గ్రామానికి చెందిన యక్కటి రామకృష్ణ, గజ్జల శేషు, సనకా పెదబాబు, శ్రీనివాసరావు ఏడెకరాల్లోని తమ మిర్చి పంటను దున్నించేశారు. రైతుబజార్, మార్కెట్‌లో కిలో మిర్చి రూ.22 నుంచి రూ.30 అమ్ముతుండగా, రైతుల నుంచి మాత్రం కిలో రూ.3 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. 

దిక్కులేక పారబోస్తున్నాం.. 
రెండేళ్ల క్రితం మిర్చికి బాగా లాభాలు రావడంతో ఈ ఏడాది రైతులు ఎక్కువగా సాగుచేశారు.  ఎకరాకు కౌలు, ఖర్చులు కలిపి రూ.1.25లక్షలు అయ్యాయి. కిలో మిర్చి రూ.3 కూడా కొనడంలేదు. అందుకే నదిలో పారబోస్తున్నాం.
– బళ్లా లక్ష్మణస్వామి, మోపిదేవిలంక, మోపిదేవి మండలం

అప్పుచేసి మిర్చి సాగు చేశాను. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధర పడిపోయింది. చేసేదిలేక పారేస్తున్నాం. కోల్డ్‌ స్టోరేజి నిర్మిస్తే ఇలాంటి సమయంలో భద్రపరచుకుంటాం. 
– ఉప్పల సతీష్‌బాబు (నాని), నాగాయతిప్ప, మోపిదేవి మండలం

కలెక్షన్‌ సెంటర్‌కి ప్రతిపాదనలు పంపాం..
మిర్చి రేటు పడిపోవడంతో రైతులు నదిలో పారబోస్తున్న మాట వాస్తవమే. ఇక్కడి పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేశాను. మోపిదేవిలో కలెక్షన్‌ సెంటర్‌ కోసం ప్రతిపాదనలు పంపించాం. ఇది కార్యరూపం దాలిస్తే రోజుకు 10 టన్నులు ప్రాసెసింగ్‌ చేయవచ్చు. 
– రాజశేఖర్, ఉద్యాన శాఖాధికారి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement