సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్): జీవనాధారమైన భూములు కోల్పోయి.. పైసా పరిహారం రాక.. కుటుంబాలు గడవక తల్లడిల్లుతున్న రైతుల బాధలు చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదనేందుకు ఈ సంఘటనే నిదర్శనం. 2015లో నిప్పులవాగు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులు నాలుగేళ్లుగా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ‘పునరావాసం మాట దేవుడెరుగు.. కనీసం పరిహారం అయినా చెల్లించి ఆదుకోండి’ అంటూ గుండెలు బాధుకుంటున్నా పాలకుల హృదయం కరగడం లేదు.
‘భూములు కోల్పోయాం.. పరిహారం అతీగతీ లేదు. ఎలా బతకాలో అర్థం కావడం లేదు’ ఇదీ నిప్పులవాగు విస్తరణలో భూములు కోల్పోయిన రైతుల ఆక్రందన. నాలుగేళ్లయినా ఇప్పటికీ పైసా పరిహారం అందక, కుటుంబాలు గడవక రైతులు తీవ్ర వేదన పడుతున్నారు. నిప్పులవాగు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు పంపారు.
అలాగే పరిహారం విడుదల చేయాలని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పోస్టు, మెయిల్ ద్వారా వినతి పత్రం పంపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. 2015లో నిప్పులవాగు విస్తరణలో భాగంగా వెలుగోడు మండలం వేల్పనూరు, అబ్దుల్లాపురం గ్రామాలకు చెందిన 37 మంది రైతుల నుంచి దాదాపు 100 ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించింది. వీరికి రూ.91.70 లక్షల పరిహారం చెల్లించడంతో పాటు పునరావాసం కల్పించాల్సి ఉంది.
పునరావాసం సంగతి దేవుడెరుగు.. పరిహారం ఇవ్వండంటూ కోరుతున్నా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదంటూ రైతులు మండిపడుతున్నారు. 2016 జనవరిలో అవార్డు ద్వారా నీటిపారుదల శాఖ అధికారులు భూములు స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన భూములకు పరిహారం విడుదల చేసేందుకు కర్నూలు ఆర్‌డీఓ 2018 నవంబరు 30న బిల్లులను పే అండ్ అకౌంట్స్ అధికారికి సమర్పించారు. మరుసటి రోజునే పీఏఓ బిల్ ఐడీ నంబరు 904684 ద్వారా సీఎఫ్‌ఎంఎస్ విధానంలో ఆర్‌బీఐకి పంపారు.
అంటే మూడున్నర నెలలుగడచినా రైతుల భూసేకరణ బిల్లులను ప్రభుత్వం పట్టించుకోలేదంటే వీరిపై ఏ పాటి ప్రేమ ఉందో స్పష్టమవుతోంది. ఈ భూసేకరణ బిల్లులను ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పెండింగ్‌లో ఉంచినట్లు స్పష్టమవుతోంది. సీఎఫ్‌ఎంఎస్ విధానంలో ముందు వెళ్లిన బిల్లులకు ముందుగా నగదు వారి ఖాతాలకు జమచేయాలి. కానీ, బిల్లులు వెళ్లిన తర్వాత పీఏఓ నుంచి వెళ్లిన కాంట్రాక్టర్ల చెల్లింపు బిల్లులు ఆమోదం పొందాయి తప్ప రైతుల గురించి పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ప్రభుత్వానికి రైతులపై ఉన్న ప్రేమ ఇదేనా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. భూములు కోల్పోయిన వారందరూ సన్న, చిన్న కారు రైతులే. వీరు భూములు కోల్పోయి ప్రభుత్వ దయ కోసం ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment