ఆస్తి పంపకానికి అడ్డుగా ఉందని... | Father leaves daughter due to financial problems in Railway station | Sakshi
Sakshi News home page

ఆస్తి పంపకానికి అడ్డుగా ఉందని...

Published Sun, Dec 29 2013 8:49 AM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM

ఆస్తి పంపకానికి అడ్డుగా ఉందని... - Sakshi

ఆస్తి పంపకానికి అడ్డుగా ఉందని...

మహబూబాబాద్: తన సమస్యలన్నిటికీ కూతురే కారణమని ఆగ్రహంతో ఉన్న ఓ తండ్రి ఆమెను వదిలించుకోజూశాడు. రైల్వే ప్లాట్‌ఫాంపై వదిలి రైలెక్కాడు. అయితే, ప్రయాణీకులు అప్రమత్తం కావటంతో విషయం పోలీసుల దాకా వెళ్లింది. ఈ ఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఎన్.విష్ణువర్దన్, శిల్ప దంపతులకు సుస్మిత అనే కూతురు ఉంది. మూడేళ్ల క్రితం శిల్ప అనారోగ్యంతో మృతి చెందగా విష్ణువర్దన్ మరో వివాహం చేసుకున్నాడు.
 
సుస్మిత కొత్తగూడెంలో రెండో తరగతి చదువుతోంది. విష్ణువర్దన్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి సోదరులతో ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఉమ్మడి ఆస్తిని అమ్మి తన వాటా ఇవ్వాలని విష్ణువర్దన్ కోరుతుండగా సోదరులు మాత్రం సుస్మిత కోసం అది అవసర పడుతుందని, అప్పుడే అమ్మేది లేదని అడ్డు చెబుతున్నారు. ఈ నే పథ్యంలో వరంగల్ జిల్లా కురవి మండలం జీ కొత్తూరులో జరిగే ఓ కార్యక్రమానికి విష్ణువర్ధన్ తన కూతురుతో రాగా అతని సోదరులు, బంధువులు కూడా అక్కడ అతనికి కలిశారు. శనివారం తిరుగు ప్రయూణంలో వారంతా మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా అన్నదమ్ముల మధ్య ఆస్తి విషయంలో చిన్న గొడవ జరిగింది.
 
 ఆ సమయంలో ప్యాసింజర్ రైలు స్టేషన్‌కు రాగానే అందరూ రైలు ఎక్కారు. అయితే, ఆగ్రహంతో ఉన్న విష్ణువర్దన్ మాత్రం కూతురును ప్లాట్‌ఫాం పైనే వదిలేసి రైలు ఎక్కాడు. దీంతో ఏడుస్తున్న ఆ బాలికను వెంటనే అదే ఫ్లాట్‌పాంపై ఉండి గమనిస్తున్న హిజ్రాలు ఎత్తుకొని.. కదులుతున్న రైలు వద్దకు పరుగెత్తారు. రైలులో ఉన్న ప్రయాణికులు అది గమనించి చైన్ లాగారు. వెంటనే వారు ఆ బోగీలో ఉన్న తండ్రికి బాలికను అప్పగించారు. కూతుర్ని వదిలేసి వెళ్లడం తగదని అంతా అతనికి హితవు పలికారు. శనివారమే ఆ బాలిక పుట్టిన రోజు కావడం.. ఆ విషయాన్ని ప్రయాణికులందరికీ చెప్పడంతో వారు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్సై రవీందర్ కూతురును, తండ్రిని సబ్‌కంట్రోల్ రూంకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేశారు. ఆ బాలిక ఏడుస్తూ చెప్పిన మాటలకు పోలీసులు చలించిపోయారు. అనంతరం ఎస్సై రవీందర్ కేక్, చాక్లెట్లు తెప్పించి అక్కడే ఆ బాలికతో కేక్ కట్ చేయించి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. అన్నదమ్ముల గొడవలు సాకుగా చూపి ఆ చిన్నారికి ఇబ్బంది కలగనీయవద్దని, స్థోమత లేకపోతే ప్రభుత్వ హాస్టల్‌లో చేర్పించి చదివిస్తామని ఎస్సై ఆ బాలిక తండ్రి విష్ణువర్దన్‌కు చెప్పారు. తన తండ్రితో ఉంటానని ఆ బాలిక చెప్పడంతో అతనికి అప్పగించారు. రెండు గంటల పాటు సాగిన ఆ సంఘటనను వందల మంది ఆసక్తిగా చూశారు. ఆ బాలిక ఆనందంగా తండ్రి వద్దకు చేరి అందరికీ టాటా చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement