జన్మభూమి కమిటీలకే అధికారం
డమ్మీలుగా మారుతున్న అధికారులు
స్మార్ట్‌కార్డు తరహాలో రేషన్‌కార్డులు
మార్గదర్శకాలు జారీ
మొన్న రుణాలు.. నిన్న గ్యాస్ కనెక్షన్లు.. నేడు పింఛన్లు.. రేపు రేషన్ కార్డులు.. ఇలా ప్రతి పథకంలో జన్మభూమి కమిటీలకే పెత్తనం కట్టబెడుతుండడంపై అధికార వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నెలలో మంజూరు చేయనున్న కొత్తరేషన్ కార్డుల కోసం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఏఎస్‌వో, తహశీల్దార్లకు అప్పగించినా, చివరకు ఆ జాబితాలను జన్మభూమి కమిటీలు ఆమోదముద్ర వేశాకే కొత్తకార్డులివ్వాలని సర్కార్ మెలిక పెట్టడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది.
విశాఖపట్నం: ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారుల ఎంపిక బాధ్యత అంతా గతంలో అధికారులే చేపట్టేవారు. 50 శాతం వరకు ప్రజాప్రతినిధుల సిఫార్సులకు తలలూపినా.. మరో 50 శాతమైనా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు దక్కేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ముందెన్నడూ లేని వింత సంస్కృతికి టీడీపీ సర్కార్ తెరలేపింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో అధికారులను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తూ పెత్తనం పూర్తిగా జన్మభూమి కమిటీలకు అప్పగించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సిఫార్సుల మేరకు జాబితాలు తయారుచేస్తూ వసూళ్లలో వారివాటాలను వారికి ముట్టజెబుతూ ఈ కమిటీలు అందినకాడకి దండుకుంటున్నాయి.
ప్రస్తుతం జిల్లాలో 10,45,838 తెలుపు, 75,889 ఏఏవై, 1035 అన్నపూర్ణ కార్డులున్నాయి. మరో 2,10,378 గుబాబీ కార్డులున్నాయి. కొత్త కార్డుల జారీ కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరు మార్గదర్శకాలను జారీచేసింది. తెల్లకార్డుల కోసం దారిద్య్ర రేఖకు దిగువనున్న వారిని గుర్తించేందుకు నిర్దేశించిన అర్హతలు కాస్త కఠినంగానే ఉన్నాయి. ఈ నిబంధనలను ఇప్పటికే మనుగడలో ఉన్న కార్డులకు కూడా దశలవారీగా వర్తింపచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదే కనుక జరిగితే భారీ సంఖ్యలో తెలుపుకార్డులపై కోతపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మండలాల్లో కొత్తకార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులను గుర్తించి అప్‌లోడ్ చేసే బాధ్యతను రెవెన్యూ, సివిల్ సప్లయీస్ అధికారులకు అప్పగించారు. కొత్తగా మంజూరు చేయనున్న రేషన్‌కార్డులను స్మార్ట్ కార్డుల తరహాలో జారీ చేయాలని నిర్ణయించారు.
కొత్తకార్డుల కోసం 64 వేల మంది ఎదురుచూపు
గతేడాది అక్టోబర్-నవంబర్‌లలో రెండు విడతల్లో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన అర్జీల్లో అత్యధికం పింఛన్లు.. ఆ తర్వాత రేషన్‌కార్డుల కోసమే వచ్చాయి. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 39,638 మంది, జీవీఎంసీతో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లో 25,007 చొప్పున మొత్తం 64,645దరఖాస్తులొచ్చాయి. ప్రాథమికంగా వీటి అర్హతను నిర్ధారించే బాధ్యతను అసిస్టెంట్ సివిల్ సప్లయిస్ అధికారులు, తహశీల్దార్లకు అప్పగించారు.
వయసు నిర్ధారణ, రెసిడెన్సీ, ఆధార్ కార్డులను ఈ దరఖాస్తులతో అప్‌లోడ్ చేసి అర్హత ఉందా లేదా అని వీరిద్దరూ నిర్ణయిస్తారు. ఎక్సల్‌షీట్‌లో అ ర్హులైన వారి జాబితాలను తయారు చేసి జన్మభూమి కమిటీలకు అప్పగిస్తారు. వారు క్షేత్ర స్థాయిలో పరిశీలించి స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సు మేరకు అర్హులైన వారితో తుదిజాబితాను తయారుచేసి ప్రభుత్వానికి పంపిస్తారు. అర్హుల జాబితాను అధికారులు తయారుచేసిన తర్వాత వాటిపై జన్మభూమి కమిటీ ఆమోదం ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. అలాంటప్పుడు మాతో ఎందుకు పరిశీలన చేయిస్తున్నారని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
మార్గదర్శకాల ప్రకారం అర్హతలివే..
గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు. వితంతువులకు,మహిళాధారిత కుటుంబాలు.మానసిక శారీరక వైకల్యం ఉన్న కుటుంబాలు. సొంత ఇల్లు, వ్యవసాయ భూమి లేని కుటుంబాలు. ఉపాధి హామీ పథకంలో చురుగ్గా పనిచేసిన జాబ్‌కార్డుదారులు. ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీల్లో నివసించే వారు అర్హులు
వీరు అనర్హులు..
ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న కుటుంబాలకు వర్తించదు. ఇంటి విద్యుత్ బిల్లు రూ.500 కంటే ఎక్కువగా చెల్లిస్తే అనర్హులు. 2.5 ఎకరాల మగాణీ లేదా 5 ఎకరాల పైబడి మెట్ట భూములుంటే అనర్హులు.
పట్టణ ప్రాంతాల్లో..
500 చదరపు అడుగుల లోపు విస్తీర్ణం ఉన్న ఇంటిలో నివసించాలి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. నెలకు చెల్లించే విద్యుత్ బిల్లు రూ. వెయ్యి లోపు ఉండాలి. వితంతు, మహిళాధారిత, శారీరక, మానసిక వికలాంగులు ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యం
అనర్హులెవరంటే..?
ఆదాయ పన్ను చెల్లించే కుటుంబాలు. క్రెడిట్‌కార్డులున్న కుటుంబాలు. 100 సీసీ కంటే అధిక సామర్థ్యం ఉన్న ద్విచక్రవాహనాలున్న కుటుంబాలు. 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో సొంత గృహం ఉన్న కుటుంబాలు.