ఉత్సవ విగ్రహాలు | Festive statues | Sakshi
Sakshi News home page

ఉత్సవ విగ్రహాలు

Published Wed, Aug 7 2013 4:12 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

Festive statues

సాక్షిప్రతినిధి, న ల్లగొండ: సర్పంచ్‌లు ఉసూరుమంటున్నారు. నెలరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వేడి పుట్టించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి ఈ నెల 2వ తేదీన గ్రామ పంచాయతీల్లో సర్పం చ్‌లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లూ గ్రామ కార్యదర్శులు, స్పెషల్ అధికారుల ఇష్టారాజ్యంతో సమస్యల్లో కునారిల్లిన పంచాయతీలను గాడిలో పెట్టాల్సిన బాధ్యత సహజంగానే కొత్త సర్పంచ్‌లపై పడింది. అయితే, బాధ్యతలు చేపట్టిన రోజునే వీరి చేతికి అందాల్సిన పంచాయతీల రికార్డులు ఇంతవరకూ వారికి అప్పజెప్పలేదు.
 
 అసలు పంచాయతీ జనరల్ ఫండ్‌లో నిధులు ఎన్ని ఉన్నాయి..? ప్రభుత్వం నుంచి అందిన నిధులెన్ని..? ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన మొత్తం ఎంత..? ఏఏ పనులకు ఎంతెంత ఖర్చు పెట్టారు..? ఎవరెవరికి ఎంతెంత చెల్లించాల్సి ఉంది..? మిగులుబాటా.. లేక తగులుబాటా..?వంటి ప్రశ్నలకు కొత్త సర్పంచ్‌లకు సమాధానం దొరకడం లేదు. ఇక, ఆయా పంచాయతీల్లో తక్షణం చేపట్టాల్సిన పనులకు నిధుల ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాలి అన్న అంశంలో స్పష్టత లేదు. ఇన్నాళ్లూ తిమ్మిని బమ్మిని చేసిన వారు లెక్కలు బయట పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు అందలేదన్న కారణం చూపుతూ రికార్డులు కొత్త సర్పంచులకు ఇవ్వలేదు. ఈ వ్యవహారంలో కొందరు మాజీ సర్పంచ్‌లకూ పాత్ర ఉందని చెబుతున్నారు. చేసిన తప్పులను సరిదిద్దకోవడానికి రికార్డులు తమ వద్దే ఉంచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెక్‌బుక్, ఎంబీ రికార్డులు అప్పగించలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రమాణస్వీకారం రోజున అన్ని కొత్త రికార్డులు రాయాలని ఆదేశించారు.
 
 అయితే ఇప్పటికే కార్యదర్శులు పంచాయతీ పాలనను ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నందున రికార్డులన్నీ వారివద్దే ఉంచుకున్నారు. సర్పంచులతో కూడిన జాయింట్ చెక్‌పవర్ కార్యదర్శులకు ఉంటుందా లేదా అన్నదానిపై ఆదేశాలు రకపోవడంతో కార్యదర్శులు చెక్‌బుక్‌లను వారివద్దే ఉంచున్నారు. దీంతో సర్పంచ్‌లు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. 2011లో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. అప్పటినుంచి ఇప్పటివరకు  రికార్డులు ఉంటే క్యాష్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు ఉంటే రశీదు బుక్కులు లేకుండా పోయాయి. అంతేకాకుండా కార్యదర్శులు బదీలీపై వెళ్లిన పంచాయతీల్లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారికి అన్ని రికార్డులు అప్పగించకుండా, బ్యాంక్ పాస్‌బుక్, రశీదు పుస్తకాలు అప్పగించి క్యాష్ బుక్కులు అప్పగించని ఉదంతాలూ ఉన్నాయి. కొందరు కార్యదర్శులు, 2011లో దిగిపోయే ముందు సర్పంచులే ఈ రికార్డులు అప్పజెప్పలేదని కూడా బుకాయిస్తున్నారు. ఇక, ఆయా మండలాల్లో రెండు రోజుల్లో వీరికి శిక్షణ కార్యక్రమం నిర్వహించి రికార్డులను అప్పగిస్తామని ఎంపీడీఓలు చెబుతున్నారు.
 
 సూర్యాపేట నియోజకవర్గంలో కొంత నయం
 సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూర్.ఎస్, చివ్వెంల, సూర్యాపేట రూరల్ మండలాల్లో  సర్పంచ్‌లకు ప్రమాణ స్వీకారం చేసిన రోజే అధికారులు రికార్డులు అప్పగించారు. సూర్యాపేట మండలం పిల్లలమర్రిలో మాత్రమే రికార్డులు అందజేయలేదు. ఉత్తర్వులు అందని కారణంగానే రికార్డులివ్వలేదని మెజారిటీ అధికారులు చెబుతుండగా, సూర్యాపేట నియోజకవర్గంలో ఎలా వీలయ్యిందన్న ప్రశ్నకు ఉన్నతాధికారులే సమధానం చెప్పాలి. దీనితో సర్పం చ్‌లు ఆయా గ్రామా కార్యదర్శులను రికార్డులు చెక్‌బుక్‌ల విషయమై అడుగగా రేపు.. ఎల్లుండి అని సమాధానం చెబుతున్నారని నూతన సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. మరికొన్ని పంచాయితీలల్లో ఇంతకుముందున్న సర్పంచ్‌లు సర్పంచ్‌గా పోటీపడి ఓడిపోయిన వారు కావాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు రికార్డులను అదించడం లేదని పలువురు కారదర్శులు ఆరోపిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement