
యాభై ఏళ్ల చిన్నారి..
భీమవరం అర్బన్ : పుట్టుక నుంచి శారీరకంగా, మానసికంగా ఎదుగుదల లేని యాభై ఏళ్ళ వయసు గల తమిరి గంగమ్మ కుటుంబానికి పుట్టెడు కష్టాలు వచ్చిపడ్డాయి. పూట కూడా గడవని పరిస్థితి ఏర్పడింది. ఆమె తల్లితండ్రులకు వయసు మీద పడటంతో ఏ పని చేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు గంగమ్మ ఆలనా పాలనా చూస్తూ వచ్చిన వారిని ఆర్థిక సమస్యలు కుంగదీస్తున్నాయి. అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం ప్రస్తుతం ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది.
భీమవరంలో స్థానిక కోడవల్లి రోడ్డులో నివాసముంటున్న తమిరి నారాయణరావు, వెంకటరత్నం దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారికి ముందుగా గంగమ్మ జన్యులోపంతో పుట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె చిన్నపిల్లలాగానే ఉంది. ఎంతో మంది వైద్యులకు చూపించినా ఎదుగుదల లేదు.. కనీసం మాట్లాడలేదు. కొంత కాలం గోడలు పట్టుకుని నడచినా ప్రస్తుతం అచేతనంగానే ఉండిపోయింది. నారాయణరావు స్వర్ణకారుడిగా పనిచేస్తూ ఇప్పటి వరకు కుటుంబాన్ని నెట్టుకొచ్చారు.
పస్తుతం నారాయణరావు అనారోగ్యానికి గురై ఇంట్లోనే ఉండటంతో వారికి పూట గడవటం కష్టమైంది. గంగమ్మ వైకల్యం కారణంగా వారికి అద్దె ఇల్లు కూడా దొరకని పరిస్థితి. ప్రస్తుతం గంగమ్మకు వృద్ధ దంపతులే సపర్యలు చేస్తున్నారు. తాము ఉండటానికి జాగా కల్పించేలా చూడాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు వీరు వేడుకుంటున్నారు. దాతలు సహృదయంతో ఆదుకోవాలని, సహాయం చేసేవారు సెల్ 90306 78489 నంబర్‌లో సంప్రదించాలని కోరుతున్నారు.