అందరూ ఆశావహులే...
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా వ్యవధి ఉండటంతో మంత్రి పదవులకోసం పోటీ ఎక్కువైంది. జిల్లాలో ఆశావహుల సంఖ్య బాగానే ఉంది. సీనియారిటీ, సిన్సియారిటీ అంటూ కొంతమంది నేతలు చెబుతుంటే మరికొంత మంది మాత్రం సామాజిక వర్గాన్ని నమ్ముకుంటున్నారు. గ్రూపులుగా విడిపోయిన దేశం ఎమ్మెల్యేలు మంత్రి పదవి తనదంటే తనదేనని అనుయాయుల వద్ద చెబుతున్నారు.
సాక్షిప్రతినిధి, గుంటూరు: జిల్లాలో 17 శాసనసభ స్థానాలకూ 12 స్థానాలను దక్కించుకుని పట్టు సాధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు మంత్రి పదవులకోసం పట్టుపడుతున్నారు. సీనియారిటీ... సామాజికవర్గాలవారీగా తమకు అనుకూలమైన సమీకరణలు సృష్టించుకుని అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. అవసరాన్ని బట్టి పైరవీలూ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా జిల్లా నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్(తెనాలి), ధూళిపాళ్ల నరేంద్ర(పొన్నూరు), ప్రత్తిపాటి పుల్లారావు(చిలకలూరిపేట), యరపతినేని శ్రీనివాసరావు(గురజాల),కోడెలశివప్రసాదరావు(సత్తెనపల్లి),జి.వి.ఆంజనేయులు(వినుకొండ), మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి(గుంటూరువెస్ట్), నక్కా ఆనంద్‌బాబు(వేమూరు) మంత్రి పదవులను ఆశిస్తున్నవారిలో ఉన్నారు.
అయితే వీరిలో మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నక్కా ఆనందబాబు తప్ప మిగిలిన వారంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. వీరిలో ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుంద న్న ధీమాలో ధూళిపాళ్ల నరేంద్ర ఉండగా, మాజీ మంత్రులైన ఆలపాటి రాజేంద్రప్రసాద్, కోడెల శివప్రసాద్‌లు అనుభవమున్న తమకు తప్పకుండా మంత్రిపదవి వస్తుందని భావిస్తున్నారు. అదేసమయంలో జిల్లా పార్టీ అధ్యక్షునిగా పదేళ్ల పాటు పార్టీకి సేవలందించిన తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ప్రత్తిపాటి పుల్లారావు అధిష్టానం వద్ద ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఇక సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఎవరూ చంద్రబాబునాయుడు పర్యటనకు ముందుకు రాలేదని, ఆ సమయంలో తన నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనను ఏర్పాటు చేసి విజయవంతం చేశానని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెబుతున్నారు. అలాగే వినుకొండ నుంచి రెండుసార్లు ఎక్కువ మెజార్టీతో గెలిపించిన తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కొంతమంది అధిష్టానానికి దగ్గరగా ఉండే నేతలతో వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు సిఫార్సులు చేయిస్తున్నారు.
మాకు రాకున్నా... ఆయనకు రాకూడదు
జిల్లాలో తమలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్లేదు కాని కోడెలకు మాత్రం మంత్రి పదవి ఇవ్వవద్దంటూ కొంతమంది నాయకులు చంద్రబాబునాయుడును కోరినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే కోడెలకు బీజేపీ అగ్రనాయకుడైన వెంకయ్యనాయుడుతో మంచి సంబంధాలు ఉండటంతో ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవచ్చనే అనుమానాలను సైతం వారు వ్యక్తం చేస్తున్నారు. గ్రూపులుగా విడిపోయిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులకోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇక నరసరావుపేట ఎంపీగా పోటీచేసే అవకాశమివ్వాలని కోరిన వేణుగోపాలరెడ్డిని గుంటూరు పశ్చిమనుంచి పోటీచేసి గెలిచి వస్తే మంత్రి పదవి ఇస్తానంటూ బాబు హామీ ఇచ్చారనీ, దాని ప్రకారం తనకు అవకాశం తప్పక దక్కుతుందని ఆయన అనుయాయుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అదెంతవరకు నిలబెట్టుకుంటారన్నది వేచి చూడాలి. వేమూరు నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన నక్కా ఆనందబాబుకు ఎస్సీ కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆయన అనుయాయులు ఆశపడుతున్నారు. అయితే ఇందులో మరో చిన్న తిరకాసును సైతం వారు చెబుతున్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు మంత్రి పదవి ఇస్తే ఆయన శిష్యుడైన నక్కా ఆనందబాబుకు మంత్రి పదవి దక్కకపోవచ్చని చెబుతున్నారు.
పైరవీల జోరు.. టీడీపీలో చక్రం తిప్పుతున్న సుజనాచౌదరి, సీఎం రమేష్‌తో కొంతమంది నాయకులు సంప్రదింపులు జరుపుతుండగా మరికొంతమంది మాత్రం బీజేపీలోని జాతీయ నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను నమ్ముకుంటున్నారు. ఏది ఏమైనా జూన్2న కొత్త రాష్ట్రం అవతరించిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గం కూర్పు పెద్ద సవాల్ కాకతప్పదని భావిస్తున్నారు.