చంద్రబాబుతో ‘జై తెలంగాణ’ అనిపించండి: జోగు రామన్న
నాడు డీలర్ దయూకర్, నేడు డాలర్ దయూకర్: వినయ్‌భాస్కర్
శవాలపై చందాలు వసూలు చేసే పార్టీ టీఆర్‌ఎస్: ఎర్రబెల్లి
శ్రీకాంతాచారి మృతికి ఆ పార్టీయే కారణం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో టీఆర్‌ఎస్, తెలుగుదేశం తెలంగాణ నేతలు మరోసారి మాటల యుద్ధానికి దిగారు. విభజన బిల్లుపై శుక్రవారం చర్చలో పాల్గొన్న టీఆర్‌ఎస్ సభ్యులు జోగు రామన్న, దాస్యం వినయ్ భాస్కర్ చంద్రబాబు, టీడీపీల వైఖరిపై విరుచుకుపడ్డారు. దీంతో టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోడియంలోకి వచ్చి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ శనివారానికి సభను వాయిదా వేయాల్సివచ్చింది. ఆగ్రహించిన దయాకర్‌రావు ఇయర్ ఫోన్‌లను విసిరికొట్టారు. ఎవరేమన్నారు?
జోగు రామన్న: ఆదిలాబాద్‌కు వచ్చిన సమయంలో చంద్రబాబును అక్కడి నేతలు ‘జై తెలంగాణ’ అనమని కోరినా పట్టించుకోలేదు. ఆయన వైఖరికి విసిగి నేను ఆ పార్టీకి రాజీనామా చేశా. ఆ పార్టీ తెలంగాణ నేతలు ఇప్పటికైనా బాబుతో ‘జై తెలంగాణ’ అనిపించాలి.
దయాకర్‌రావు: శ్రీకాంతాచారి ఆత్మహత్యాయత్నం సమయంలో చంద్రబాబు అతనితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. దానికి నేనే సాక్షి. ఆయన వైద్య ఖర్చులను మేమే భరించాం. అప్పుడు టీఆర్‌ఎస్ నేతలు ఎక్కడ పడుకున్నారు?
దాస్యం వినయ్ భాస్కర్: వరంగల్ జిల్లాలో బలిదానం చేసుకున్న యువకులు ‘దయాకర్‌రావు ద్రోహి’ అని లేఖల్లో రాశారు. డీలర్ దయాకర్‌రావు డాలర్ దయాకర్‌రావుగా ఎదిగారు. మా అన్న దాస్యం ప్రణయ్‌భాస్కర్ ఎన్‌కౌంటర్ల గురించి మాట్లాడుతూ తెలంగాణ పదాన్ని ఉచ్చరిస్తే.. స్పీకర్ స్థానంలో ఉన్న యనమల రామకృష్ణుడు ఆ పదాన్ని వాడొద్దని నిషేధించారు. కేసీఆర్ ఉద్యమంతోనే మాట్లాడే అవకాశం కలిగింది.
దయాకర్‌రావు: టీఆర్‌ఎస్ శవాలపై చందాలు వసూలు చేసే పార్టీ. దొంగదీక్ష చేసిన కేసీఆర్, ఒంటిపై కిరోసిన్‌పోసుకుని డ్రామా ఆడిన హరీష్‌రావుల వల్లనే వెయ్యిమంది విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడపెట్టారు. వారిలా నేను ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని బతకలేదు. నేను జిల్లా డీలర్‌ల సంఘానికి అధ్యక్షునిగా చేశా. మా నాన్న 1964లోనే పంచాయతీ సమితి అధ్యక్షునిగా పోటీ చేశారు. ఎల్‌ఎంబీ చైర్మన్‌గా ఉన్నారు.
టీడీపీ, టీఆర్‌ఎస్ వాగ్వాదం
Published Sat, Jan 25 2014 2:45 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement
Advertisement