సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విలువైన ప్రభుత్వ స్థలాలపై టీడీపీ నేతల కన్నుపడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సర్కారు భూములను ఆక్రమించుకుని సొమ్ముచేసుకుంటున్నారు. పేదలకు రెండు సెంట్ల స్థలం ఇవ్వటానికి రకరకాల నిబంధనల పేరుతో వెనక్కు పంపే రెవెన్యూ అధికారులు అధికారపార్టీ నేతలకు మాత్రం రూ.కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములను అప్పనంగా ధారాదత్తం చేస్తున్నారనే విమర్శలున్నాయి. వివరాల్లోకి వెళితే.. సూళ్లూరుపేట పట్టణంలో రూ.కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న విషయం తెలిసినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు.
ఫలితంగా పట్టణంలోని ప్రభుత్వ స్థలాలు ఒక్కొక్కటిగా పెద్దల పాలిట కల్పతరువుగా మారుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిపోవటంతో జాతీయ రహదారి పక్కన ఉన్న భూములకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. అలాగే సూళ్లూరుపేట పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో పట్టణ పరిసర ప్రాంతాల్లో సుమారు 23 లేఅవుట్లు వెలిశాయి. ఒకటి రెండు లేఅవుట్‌లు మినహా మిగిలిన లేవుట్లలో 25 శాతం పట్టా భూమి ఉంటే.. మిగిలిన 70 శాతం ప్రభుత్వ భూమిని కలుపుకొని ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు.
అందుకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కొందరు భారీ ఎత్తున ముడుపులు తీసుకుని చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు తెలిసింది. సూళ్లూరుపేట చెంగాళమ్మ దేవస్థానం ఎదురుగా కొందరు రియల్టర్లు సుమారు 10 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి కొత్తగా లేవుట్ వేశారు. రియల్ వ్యాపారం కోసం భారీ ఎత్తున గ్రావెల్ తోలి చదును చేశారు. రియల్టర్లు వేసిన వెంచర్‌లో అర ఎకరాకుపైగా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది.
సర్వే నంబర్ 59-16లో 4 సెంట్లు, 59-17లో 13 సెంట్లు, 59-18లో 44 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నట్టు రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. ఈ 61 సెంట్లు ప్రభుత్వభూమి జీఎన్‌టీ రోడ్డును అనుకుని ఉంది. రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ స్థలం విలువ రూ.9.15 కోట్లు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. రియల్టర్లు అంకణం రూ.2.50 లక్షలు చొప్పున విక్రయిస్తున్నట్లు కొనుగోలుదారులు స్పష్టం చేశారు. టీడీపీ నేతలు వేసిన లేవుట్ వద్ద రోడ్డుకు అటువైపు కాళంగి నది.. ఇటువైపు పొర్లకట్టు ఉంది. జీఓ నంబర్ 168 ప్రకారం ఎటువంటి భవన నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉండటం గమనార్హం.
దోబీఘాట్ స్థలమూ ఆక్రమణ
ఇందిరానగర్ సమీపంలో సర్వే నంబర్ 57-1 రజకులకు 1.04 ఎకరాల్లో దోబీఘాట్ నిర్మించి ఇచ్చారు. అది కూడా ఆక్రమార్కుల చెరలో ఉందని సమాచారం. దీని విలువ కూడా కోట్ల రూపాయలు చేస్తుంది. సూళ్లూరుపేట పరిధిలో విలువైన ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకుని టీడీపీ నేతలకు కట్టబెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీకి చెందిన ఈ భూమిని స్వాధీనం చేసుకుని షాపింగ్ కాఫ్లెంక్స్ నిర్మాణం చేస్తే మున్సిపాలిటీకి ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై స్థానిక తహశీల్దార్ ఇరకం మునిలక్ష్మీని వివరణ కోరగా మూడు సర్వేనంబర్లులో 61 సెంట్ల ప్రభుత్వ భూమి ఉన్న విషయం వాస్తమేనన్నారు. సర్వేయర్ అందుబాటులో లేరని, త్వరలో సర్వేచేసి జెండాలు నాటిస్తానని చెప్పారు. అదేవిధంగా మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ అధికారి సుజాతను వివరణ కోరగా ఆ లేఅవుట్‌లో పొర్లకట్టకు వంద అడుగుల దూరం తర్వాత భవన నిర్మాణాలకు అనుమతి ఇస్తామన్నారు. పొర్లకట్ట అంచున భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.
అధికారం మనదే.. వేసేయ్ పాగా..!
Published Mon, Dec 22 2014 2:38 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement