సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార బలంతో టీడీపీ నాయకులు హద్దుమీరారు. మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను తమకు అనుకూలంగా మలచుకోవడానికి దౌర్జన్యాలకు దిగారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను తీవ్రంగా బెదిరించారు. పలుచోట్ల కిడ్నాప్‌లకు సైతం పాల్పడ్డారు. హంగ్ ఉన్న స్థానాలకు కైవసం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కారు. పలువురిని రకరకాల ప్రలోభాలు, ఒత్తిళ్లకు గురిచేశారు. జిల్లాలో 53 మండల పరిషత్‌ల అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించగా 27 స్థానాలను టీడీపీ చేజిక్కించుకుంది. ప్రజాబలంతో ప్రజాస్వామ్యయుతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 24 మండల పరిషత్‌లను కైవసం చేసుకొని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రాయలసీమ పోరాట సమితి(ఆర్‌పీఎస్) ఒక స్థానంతో సరిపెట్టుకొంది. కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక పెండింగ్ పడింది.
కిడ్నాప్‌లు.. బెదిరింపులు
ప్యాపిలి మండల పరిషత్ పీఠాన్ని టీడీపీ దౌర్జన్యంతో లాక్కుంది. ఇక్కడ మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలు ఉంటే వైఎస్సార్‌సీపీ 12 (ఒకరు మృతి), టీడీపీ 9 స్థానాలు దక్కించుకున్నాయి. వైఎస్సార్‌సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా టీడీపీ నాయకులు ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేశారు. ప్యాపిలి- 3 ఎంపీటీసీ పెద్దిరాజు, జక్కసానిగుంట్ల ఎంపీటీసీ సభ్యురాలు రమాదేవి భర్తను రహస్య ప్రాంతానికి తరలించారని వారి బంధువులు
ఆరోపిస్తున్నారు. శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో పెద్దిరాజు హాజరుకాలేదు.
జక్కసానిగుంట్ల ఎంపీటీసీ సభ్యురాలు రమాదేవి భర్తను టీడీపీ నాయకులు వారి వద్ద ఉంచుకుని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలి చేత టీడీపీకి ఓటేయించుకున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికకు ప్యాపిలి మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లిన డోన్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజారెడ్డిని సైతం టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పెద్దఎత్తున మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆగడాలకు దిగారు. పోలీసులు వారించినా లెక్కపెట్టలేదు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు, అధికారుల వత్తాసుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీటీసీ సభ్యులు ఎన్నికను బహిష్కరించారు.
డోన్ మండలంలోనూ టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేసి ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ రెండు పార్టీలు సమానంగా ఎంపీటీసీ స్థానాలను దక్కించుకున్నాయి. టాస్ వేస్తే వైఎస్సార్‌సీపీకి వస్తుందనే భయంతో ఉడుములపాడు ఎంపీటీసీ సభ్యురాలు జయలక్ష్మిని ఎన్నికకు రాకుండా చేసి ఎంపీపీ పీఠాన్ని టీడీపీ నాయకులు కైవసం చేసుకున్నారు.
హాజరుకాకుండా అడ్డుకొని..
ఆలూరు, వెల్తుర్తి మండలాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను ఎంపీపీ ఎన్నికకు హాజరుకాకుండా చేశారు. ఇక్కడ పోటాపోటీ ఉండటంతో టీడీపీ నాయకులు బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. టీడీపీకి ఎవరూ పోటీలేకుండా చేసుకుని ఆలూరు, వెల్దుర్తి ఎంపీపీ పీఠాలను దక్కించుకున్నారని వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆదోని మండలంలో వైఎస్సార్‌సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా.. టీడీపీ నేతలు పది రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు రంగమ్మ, ఆమె భర్తను బలవంతంగా తమ క్యాంపునకు తీసుకెళ్లారు.
శుక్రవారం ఎన్నికకు రంగమ్మ హాజరుకావటంతో ఆమె అవ్వ బయటకు తీసుకొచ్చారు. తాను తప్పుచేశానని గ్రహించుకున్న రంగమ్మ వైఎస్సార్‌సీపీ ర్యాలీలో పాల్గొనటంతో టీడీపీ నేతలు అడ్డుకొని అవమానించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మనస్తాపానికి చెందిన రంగమ్మ కంటతడి పెట్టింది. ఆదోని మండలంలో టీడీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ఎంపీపీకి పీఠాన్ని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది.
ఎమ్మిగనూరు ఎమ్మెల్యేకు చేదు అనుభవం
ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని గోనెగండ్ల ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురి చేయాలని చూశారు. అయితే ఎవరూ లొంగకపోవడంతో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. కోవెలకుంట్ల మండలంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను బనగానపల్లె ఎమ్మెల్యే అనుచరులు ప్రలోభాలకు గురిచేసి తమ వైపునకు తిప్పుకున్నారు.
అయితే ఎంపీపీగా ఎన్నికైన క్రిష్ణమ్మ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందటం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్యే ఒత్తిడితోనే క్రిష్ణమ్మ ఆ పార్టీలో చేరారని ఆమె బంధువులు చెప్పారు. సి. బెళగల్‌లో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కుకావడంతో అక్కడ ఎంపీపీ పదవిని టీడీపీ దక్కించుకుంది. గడివేముల మండల పరిషత్‌కు టీడీపీ అభ్యర్థులు ఇద్దరు పోటీ పడ్డారు. ఇక్కడ వైఎస్సార్‌సీపీ పీఠాన్ని దక్కించుకుంది. బండిఆత్మకూరు, వెలుగోడు మండల పరిషత్‌లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టాస్ ద్వారా కైవసం చేసుకొంది. కోడుమూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను రకరకాల ప్రలోభాలు, భయభ్రాంతులకు గురిచేసినా ప్రయోజనం లేకపోయింది. ఇక్కడ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడు కోట్ల వంశీధర్‌రెడ్డి ఎంపీపీగా ఎన్నికయ్యారు.
దౌర్జన్యకాండ
Published Sat, Jul 5 2014 4:56 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement