నరకయాతన పడ్డాం !
వాహనాల్లో కుదేసి కర్రలతో దాడి చేశారు టీడీపీ నేతల కిడ్నాప్ చెర నుంచి
బయటపడి కన్నీటిపర్యంతమైన మహిళా ఎంపీటీసీ సభ్యులు
ముప్పాళ్ల/సత్తెనపల్లి రూరల్: ‘‘ఇంతటి అరాచకం ఎన్నడూ చూడలేదు. పదేళ్ల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నాం. మహిళలమని చూడకుండా కర్రలతో దాడి చేశారు. జుట్టు పట్టి ఈడ్చుకుంటూ వాహనాల్లో పడేశారు. అడవుల్లో తిప్పారు. తరచూ వాహనాలు మార్చారు. అరిస్తే చంపేస్తామన్నారు. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు వాహనాల్లో తిప్పుతూ భయానక వాతావరణం సృష్టించారు. నరకాన్ని ప్రత్యక్షంగా చూపించారు.’’
ఆదివారం ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు వెళుతున్న వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను టీడీపీ నాయకులు మేడికొండూరు వద్ద ఉదయం ఎనిమిది గంటలకు కిడ్నాప్ చేశారు. ఆ తరువాత వారి చెర నుంచి విడుదలైన ముగ్గురు మహిళా ఎంపీటీసీ సభ్యులు సోమవారం ‘సాక్షి’ వద్ద కన్నీటిపర్యంతమై చెప్పిన వివరాలివి.
సినీ ఫక్కీలో కిడ్నాప్ ... ముందుగా మేడికొండూరులోని వాగు వద్ద జరిగిన దాడిలో ముప్పాళ్లకు చెందిన నలుగురు ఎంపీటీసీలను బలవంతంగా వాహనాలలో ఎక్కించారు. అక్కడి నుంచి భీమినేనివారిపాలెం మీదుగా అమరావతి, క్రోసూరు తీసుకువెళ్లారు. విప్పర్లలోని ఓ టీడీపీ నాయకుడి ఇంట్లో కూర్చోపెట్టి 10 నిమిషాల పాటు ముప్పాళ్ల ఎంపీటీసీ జి.శివకోటేశ్వరరావుతో చర్చలు జరిపారు. అక్కడి నుంచి క్రోసూరు సంత వద్ద వాహనాలను ఆపి కార్లు మార్చి రూట్లు మార్చుతూ చివరకు నకరికల్లు మీదుగా ముప్పాళ్ల తరలించారు.
మహిళలని చూడకుండా దాడి చేశారు... మహిళలని చూడకుండా తీవ్రంగా దుర్భాషలాడుతూ చేతులు పట్టుకొని కింద పడేశారు. వారు తీసుకువచ్చిన వాహనాలను ఎక్కేందుకు నిరాకరిస్తే కర్రలతో కొట్టి, జుట్టు పట్టుకొని మరీ లాగి కారులో పడేశారు. కారులో నలుగురు మగాళ్ళతోపాటుగా మరో ఎంపీటీసీని కలిపి సాయంత్రం వరకు కారులోనే తిప్పారు. అసలేం చేస్తారోనని భయమేసింది. కారులోనే రేషన్‌షాపు ఇస్తాం, 5 లక్షల డబ్బు లిస్తామంటూ ప్రలోభాలకు గురిచేశారు. కారులోని వారంతా టీడీపీ వారే. ముఖా లకు ఖర్చీఫ్‌లు కట్టుకున్నారు.
- అన్నపురెడ్డి సునీత, చాగంటివారిపాలెం, ఎంపీటీసీ సభ్యురాలు
బతికితే చాలనుకున్నాం.... మేం వచ్చే వాహనంపై రాళ్లతో దాడి చేశారు. అంతా సీట్ల వెనక దాక్కున్నాం. ఆ సమయంలో బయటకు రాకపోతే బస్సుపై పెట్రోల్ పోసి తగలబెడతామంటూ బెదిరించారు. భయంతో బయటకొస్తే లాగి వాళ్ల కారుల్లో కుదేశారు. వారంతా నిమిష నిమిషానికి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుకుంటూ కారును క్రోసూరులో ఆపారు. అక్కడ ఒక్కో ఎంపిటిసిని ఒక్కో వాహనంలో ఎక్కించుకొని ఎటెటో తిప్పారు. మూడు గంటలకు మాత్రం వినుకొండ దగ్గర గుట్టపల్లిలోని ఫామ్‌హౌస్ లో ఉంచారు. - పాలడుగు సరోజిని, నార్నెపాడు ఎంపీటీసీ సభ్యురాలు
దుర్మార్గంగా వ్యవహరించారు..తెలుగుదేశం వారు దుర్మార్గం వ్యవహరించారు. నాతో పాటుగా మా బాబును కూడా కొట్టారు. మమ్మల్ని అడవుల్లో తిప్పుతూ భయానకవాతావరణాన్ని తలపించారు. అంతా నరసరావుపేట అని చెబుతున్నారు. ముఖాలకు గుడ్డలు కట్టుకొని ఉన్నారు. ఏం చేస్తారోననే భయం..భయంగా గడిపాం.
- బద్ధిగం రజనీప్రియ, దమ్మాలపాడు, ఎంపీటీసీ సభ్యురాలు