తమ్ముళ్ల అధిపత్య పోరు | Fighting dominance of younger | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల అధిపత్య పోరు

Published Sat, Jan 10 2015 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

తమ్ముళ్ల అధిపత్య పోరు

తమ్ముళ్ల అధిపత్య పోరు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు ఫ్లెమింగో ఫెస్టివల్‌కు శాపంగా మారింది. పక్షుల పండగను నియోజకవర్గ అభివృద్ధికి వేదిక చేసుకోవాల్సిన తమ్ముళ్లు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఫెస్టివల్‌కు ఉన్న ప్రాధాన్యతన తగ్గించారనే ప్రచారం జరుగుతోంది. సూళ్లూరుపేటలో శుక్రవారం ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రులు నారాయణ, పీతల సుజాత, పల్లె రఘునాథరెడ్డి ముఖ్య అతిథిదులుగా హాజరయ్యారు.

అట్టహాసంగా ప్రారంభం కావాల్సిన ఈ వేడుకలు తమ్ముళ్ల మధ్య విభేదాల కారణంగా ‘తుస్సు’ మంది. ఫ్లెమింగో ఫెస్టివల్ ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. తమ్ముళ్ల మధ్య విభేదాలతో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. అప్పటివరకు విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సి వచ్చింది. తీరా మంత్రులు వేదికపైకి చేరుకునేసరికి ప్రాంగణంలో ఉన్న వారంతా వెళ్లిపోయారు. దీంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఏటా జరిగే ఈ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున జనం తరలివస్తారు.

అయితే తమ్ముళ్ల విభేదాలను తెలుసుకున్న జనం ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలకు రావటానికి ఆసక్తిచూపలేదని తెలిసింది. అందుకు జనం లేక వెలవెలబోయిన ప్రాంగణమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే... ప్రారంభోత్సవ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో మాజీ ఎమ్మెల్యే పరసారత్నం, మరికొందరు టీడీపీ నేతలకు చురకలంటించారు.

వార్డు కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిఫల్‌చైర్మన్ల పేర్లు చెప్పిన ఎమ్మెల్సీ వాకాటి స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు వేనాటి రామచంద్రారెడ్డి పేరు చెప్పలేదు. ఆయన పేరును కూడా చెప్పమని వేదికమీద ఉన్న కొందరు గుర్తుచేసినా.. ‘నాకు తెలుస య్యా.. ప్రత్యేకంగా చెబుతాను’ అని చెప్పి చివర్లో చెప్పకుండానే తన ప్రసంగాన్ని ముగించారు.
 
ఫ్లెక్సీల ఏర్పాట్లలో ముదిరిన వివాదం...
ఫ్లెమింగో ఫెస్టివల్‌ల్లో తమ్ముళ్లు తమ ప్రాభవాన్ని పెంచుకునేందుకు పోటీపడుతున్నారు. అందులోభాగంగా సూళ్లూరుపేట మొత్తం ఎటువైపు చూసినా టీడీపీ నేతలు పోటాపోటీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలోనే ఎమ్మెల్సీ వాకాటి, జెడ్పీటీసీ సభ్యుడు వేనాటి మధ్య వివాదం తలెత్తిందనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా పోటాపోటీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలను కలిపేసుకున్నారు.

అదేవిధంగా కలెక్టర్ జానకి, ఇటీవల బదిలీ అయిన రేఖారాణి జేసీగా ఫోటోలు ముద్రించి ఉండటం గమనార్హం. వేడుకలు నిర్వహిస్తున్న ప్రాంగణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో ఇరువర్గాలు పోటీపడ్డారు. పండగకు మూడురోజుల ముందు నుంచి ఈ వివాదం నడుస్తుండగా.. గురువారం రాత్రి వారి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే పనిలో పండగ నిర్వహణను గాలికొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిలో ఓ వర్గానికి ప్రముఖ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ మద్దతు పలుకుతున్నారు.

ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి నారాయణ తొలుత గంగాప్రసాద్ అతిథిగృహానికి వెళ్లటం వేనాటి వర్గం జీర్ణించుకోలేకపోయింది. మంత్రు లు నేరుగా ప్రభుత్వ అతిథిగృహానికి చేరుకుంటారని జెడ్పీటీసీ సభ్యుడు వేనాటి తన అనుచరులతో భారీ స్వాగతం ఏర్పాటు చేశారు. అయితే మంత్రి నారాయణ ముందుగా గంగాప్రసాద్‌ను కలిసి ప్రభుత్వ అతిథిగృహానికి రావటంతో వేనాటి వర్గం నిరుత్సాహానికి గురయ్యారు.
 
వేనాటి వర్గానికి మంత్రి వార్నింగ్
ఫ్లెక్సీ ఏర్పాట్లలో వేనాటి వర్గం ఎక్కువ చేస్తుందని మరోవర్గం వారు మంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో మంత్రి నారాయణ జెడ్పీటీసీ సభ్యుడు వేనాటి కుమారుడు సుమంత్‌రెడ్డిని పిలిపించుకుని కారులో కూర్చొబెట్టి తీవ్రంగా హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. ‘పార్టీలో ఉండాలనుకునే వారు ఉండండి.. లేదంటే వెళ్లిపొండి’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడినట్లు టీడీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే టీడీపీ నేతల మధ్య వివాదాలు ఫ్లెమింగో ఫెస్టివల్‌కు శాపంగా మారిందని విహం గ వీక్షకులు తిట్టుకుంటూ వెళ్లటం కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement