బెజవాడ టీడీపీలో ఆధిపత్య పోరు
మంత్రి దేవినేని ఉమాపై ఎంపీ కేశినేని నాని బహిరంగ విమర్శలు
చాప కింద నీరులా కృష్ణా జిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలు
ఎంపీ, ఎమ్మెల్యేలను అధికారుల బేఖాతరు.. ఫోన్ చేసినా పలకని వైనం
సాక్షి, విజయవాడ బ్యూరో: బెజవాడ టీడీపీ లో చిచ్చు రగులుకుంది. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధుల మధ్య చాప కింద నీరులా పాకుతున్న విభేదాలు శుక్రవారం బహిర్గతమయ్యాయి. ఆటోనగర్‌లో జరిగిన సీవరేజి ప్లాంటు ప్రారంభోత్సవంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. ‘‘జిల్లా మంత్రిగారికి చెబుతున్నా.. మీరే అధికారులతో మాట్లాడుకుని, మీరే నిర్ణయాలు తీసుకుంటే కుదరదు’’ అంటూ ఉమాపై ఆయన సమక్షంలోనే ఘాటుగా స్పందించారు.అప్పుడు మరో మంత్రి నారాయణ కూడా వేదికపైనే ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ వర్గాల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య కొన్నేళ్లుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. జిల్లా పార్టీని గుప్పిట్లో ఉంచుకోవడానికి మంత్రి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో కేశినేని నానికి లోక్‌సభ టికెట్ రాకుండా ఉమా యత్నించారు. దీంతో చంద్రబాబు కూడా పునరాలోచలో పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న నాని అధినేతతో పోరాడి మరీ టికెట్ సాధించుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా నుంచి ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్రలకు మంత్రి పదవులు లభించాయి.
అప్పటి నుంచి జిల్లా పార్టీపై, అధికార యంత్రాంగంపై మరింత పట్టు సాధిం చేందుకు ఉమా యత్నిస్తున్నారు. జిల్లా నుంచి మరో సీనియర్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తే తన అధికారానికి గండి పడుతుందని తొలిసారి ఎమ్మెల్యే అయిన కొల్లు రవీంద్రకు కేబినెట్‌లో చోటు దక్కేలా పావులు కదిపారు. దీంతో సీనియర్ ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావు, వంశీ, మండలి బుద్ధప్రసాద్‌లు ఉమాకు దూరంగా ఉన్నారు. మరో ఎమ్మెల్యే గద్దే రాంమోహన్‌రావు సైతం అలానే ఉంటున్నారు. విజయవాడ నగరానికి సంబంధించిన అధికారిక, పార్టీ వ్యవహారాల్లో కూడా ఎంపీ, ఎమ్మెల్యేలను సంప్రదించకుండానే మంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో అధికారులూ ఎంపీ, ఎమ్మెల్యేలను ఖాతరు చేయడంలేదు.
ఈ నేపథ్యంలోనే ఎంపీ నాని శుక్రవారం అధికారిక కార్యక్రమంలోనే ఉమా మీద, అధికారుల మీద ధ్వజమెత్తారు. అధికారులు తీసుకుంటున్న బఫూన్ చర్యలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు కశ్మీర్‌లో కూడా లేని ఆంక్షలు విజయవాడలో అమలు చేస్తూ, నగరానికి చెడ్డ పేరు తెస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారాలన్నీ సీఎం చంద్రబాబుదృష్టికి వెళ్లాలనే తాను బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఎంపీ నాని చెప్పారు.