సాక్షి ప్రతినిధి, కర్నూలు : తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకరికి తెలియకుండా మరొకరు అధినేత వద్ద తమ ప్రాబల్యం చాటుకునే ప్రయత్నంలో పోటీపడుతున్నారు. నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన ఇద్దరు నేతల కారణంగా తమ్ముళ్లు విభేదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. చాపకింద నీరులా సాగుతున్న ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
పదేళ్ల తర్వాత అధికార పగ్గాలు చేపట్టబోతున్న టీడీపీని అభద్రతాభావం వెంటాడుతోంది. ఆ కారణంతోనే బలమైన ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ఆర్‌సీపీలోని నేతలను ప్రలోభాలతో తమవైపు తిప్పుకునేందుకు మైండ్‌గేమ్ ఆడుతోంది. అందులో భాగంగానే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి పచ్చ కండువా కప్పి నీచ రాజకీయానికి తెర తీశారు. అదేవిధంగా మరికొందరు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా అధినేత వద్ద మెప్పు పొందేందుకు మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డిలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.
పనిలో పనిగా జిల్లా టీడీపీలో బలమైన నాయకులుగా పేరున్న కేఈ కృష్ణమూర్తి ప్రాబ ల్యాన్ని తగ్గించేందుకు తమ వంతు శ్రమిస్తున్నారు. ఇందుకు ఆ పార్టీ ముఖ్యనేత సీఎం రమేష్ పూర్తి మద్దతిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తికొండ, కోడుమూరుకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులకు టీడీపీ తీర్థం ఇప్పించేందుకు వారిరువురూ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాాటసాని రాంభూపాల్‌రెడ్డి టీడీపీలో చేరకుండా మాజీ మంత్రులు ఇద్దరూ అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఆయన చేరితే తమ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని వారు భావిస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది.
జెడ్పీ పీఠం, ఎమ్మెల్సీ కోసం తమ్ముళ్ల అడ్డదారి
జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఎలాగైనా జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తమ్ముళ్లు అడ్డదారులు తొక్కుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులు లక్ష్యంగా టీడీపీ నేతలు పలు రకాల ప్రలోభాలకు పాల్పడుతున్నారు. బెదిరింపులకూ వెనుకాడటం లేదు. ఐదుగురు జెడ్పీటీసీ సభ్యులను గౌర్హాజరు చేయించి లబ్ధి పొందే కుట్రకు పావులు కదుపుతున్నారు. ఇందుకు సీఎం రమేష్, అనంతపురం జిల్లాకు చెందిన మరికొందరు టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిసింది.
అదేవిధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీపైనా టీడీపీ శ్రేణులు కన్నేశారు. ఈ పదవి కైవసం చేసుకునేందుకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల సహకారం తప్పనిసరి. దీంతో జిల్లాలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై గురిపెట్టారు. పార్టీలోకి వస్తే లక్షల రూపాయలు ఇస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ‘పార్టీ మారినా మీపై అనర్హత వేటు వేసే అవకాశం లేదు’ అని మభ్యపెడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మభ్యపెట్టి పార్టీ ఫిరాయింపునకు ఉసిగొల్పి పదవీచ్యుతులను చేయడమే లక్ష్యంగా టీడీపీ నేతలు పావులు కదుపుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
నువ్వా.. నేనా!
Published Wed, Jun 4 2014 1:49 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement