(తాడిపత్రి నుంచి శివారెడ్డి, సాక్షిటీవీ)
అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్బీఐ మేనేజర్ మంజులను దూషించిన సంఘటనపై టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో ఎస్బీఐ బ్యాంకుల ముట్టడికి జేసీ అనుచరులు యత్నించటంతో పోలీసులు భారీగా బలగాలను రప్పించారు. ఈ సందర్భంగా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వివరాల్లోకి వెళితే... నాలుగు రోజుల క్రితం తాడిపత్రిలో ఎస్బీఐ ఏటీఎం వైపుగా వెళుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి...ఏటీఎం గదిలో నగదు డ్రా చేసుకున్న సందర్భంగా వచ్చిన రసీదులు, కాగితాలను గమనించారు. దాంతో ఏటీఎం సెంటర్ పరిశ్రుభంగా లేదంటూ ఎస్బీఐ మేనేజర్కు ఫోన్ చేశారు. అయితే ఆమె ఆ సమయంలో ఫోన్ లిప్ట్ చేయలేదు. మరోసారి కాల్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి.... మేనేజర్ పట్ల దురుసుగా మాట్లాడినట్లు సమాచారం. దీనిపై జేసీ, మేనేజర్ మంజల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
దాంతో ఆమె.... జేసీ ప్రభాకర్ రెడ్డి తనపట్ల దుసురుగా మాట్లాడటమే కాకుండా, దుర్భాషలాడరంటూ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ...ఇరువురు మధ్య రాజీ కుదర్చేందుకు ప్రయత్నించారు. అయితే అందుకు ఎస్బీఐ మేనేజర్ అంగీకరించకపోవటంతో మూడు రోజులుగా తాత్సారం చేసిన పోలీసులు ఎట్టకేలకు సోమవారం రాత్రి జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ చర్యను నిరసిస్తూ జేసీ అనుచరులు తాడిపత్రిలోని రెండు ఎస్బీఐ బ్రాంచ్లను ముట్టడికి యత్నించారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ ముట్టడించి జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, జేసీ అనుచరుల మధ్య వాగ్వివాదం జరిగింది.