గుంటూరు నగర శివారుల్లోని కోల్డ్ స్టోరేజీల్లో చేటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు కేవలం భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే జరిగాయని అగ్నిమాపకశాఖ ప్రాంతీయ అధికారి(ఆర్.ఎఫ్.ఓ) వెంకటరమణ పేర్కొన్నారు.
భద్రత లోపంతోనే అగ్నిప్రమాదాలు
Published Tue, Aug 27 2013 3:15 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
గుంటూరు రూరల్, న్యూస్‌లైన్ : గుంటూరు నగర శివారుల్లోని కోల్డ్ స్టోరేజీల్లో చేటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు కేవలం భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే జరిగాయని అగ్నిమాపకశాఖ ప్రాంతీయ అధికారి(ఆర్.ఎఫ్.ఓ) వెంకటరమణ పేర్కొన్నారు. ఆయన సోమవారం అంకిరెడ్డిపాలెం జాతీయ రహదారి సమీపంలోని గుంటూరు కోల్డ్ స్టోరేజ్ వద్దకు వచ్చి అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతు కోల్డ్ స్టోరేజీల్లో భద్రతను రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖలు సమన్వయంతో పర్యవేక్షించాలని సూచించారు. ఇకపై ఈ మూడు శాఖలతో స్టోరేజీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
25 వేల మిర్చి బస్తాలు బుగ్గి..
మూడో రోజు సోమవారం కూడా కోల్డ్ స్టోరేజ్‌లో మంటలు ఎగసి పడటంతో అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖలు కలసి అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఎ-ఛాంబర్‌లో ఉన్న 25 వేల మిర్చి బస్తాలు అగ్నికి ఆహుతి కాగా బి- ఛాంబర్‌లో ఉన్న 25 వేల బస్తాలను జాగ్త్రత్త చేయగలిగారు. ఘటనపై జిల్లా అర్బన్ ఎస్పీ రమణకుమార్ ప్రత్యేక బృందంతో విచారణ చేయిస్తున్నాట్లు సమాచారం. స్టోరేజీ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ బి ఛాంబర్‌లోని మిర్చికి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందన్నారు.
మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాత కాలిపోయిన ప్రదేశాల నుంచి నమూనాలను పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలుగ కుండా విచారణ జరిపి, నివేదికను అందించాల్సిందిగా సౌత్ జోన్ డీఎస్పీ జోసఫ్ రాజ్‌కుమార్, సీఐ మోజెస్‌పాల్‌లను ఆదేశించినట్లు తెలిసింది. అగ్నిమాపకశాఖ అధికారులు నాగేశ్వరరావు, వినయ్‌కుమార్‌లు పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో మంటలు అదుపు చేసేందుకు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రమాదంపై అనుమానాలు..
గుంటూరు కోల్డ్‌స్టోరేజీలో సంభవించిన అగ్ని ప్రమాదంపై రైతుల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పొక్లెయిన్‌తో గోడలు పగులకొట్టి బి-చాంబర్‌లోని మిర్చిని ప్రమాదం జరగకుండా కాపాడినట్టే ముందుగా ఎ-చాంబర్ గోడలను కూడా పగులకొట్టి ఉంటే అందులోని మిర్చిని కూడా కొంతమేర దక్కించుకునే అవకాశం ఉండేదని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
కోల్డ్ స్టోరేజీల్లో ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో అధికభాగం శనివారమే కావడం కూడా సందేహాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా గుంటూరు కోల్డ్ స్టోరేజీ నిర్వాహకులు ప్రమాదం జరిగిన మర్నాడు రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బి చాంబర్‌లో కూడా మూడే వేలకు పైగా బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయని చెప్పడం, ట్రాన్‌సఫార్మర్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందనడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Advertisement
Advertisement