సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 (కరోనా వైరస్) తొలి పాజిటివ్ కేసు నమోదైంది. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరుకు చెందిన ఓ యువకుడు కరోనా వైరస్ బారిన పడినట్లు నిర్ధారించారు. బాధితుడు ఈనెల 6వ తేదీన ఇటలీ నుంచి చెన్నై వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు చేరుకున్నాడు. వైరస్ లక్షణాలు కనిపించడంతో మరుసటి రోజు నెల్లూరు బోధనాసుపత్రిలో చేరాడు. గత ఐదు రోజులుగా వైద్యుల పరిశీలనలో ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఆ యువకుడు కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాడని, 14 రోజుల తర్వాత డిశ్చార్జి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
►కరోనా బాధితుడి రిపోర్టులు, వీడియోలను ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్)కి పంపగా వైరస్ సోకినట్లు గురువారం నిర్ధారించారు.
►బాధితుడి తల్లిదండ్రులతోపాటు కారు డ్రైవర్, పనిమనిషి, ఆమె భర్తకు కూడా వైరస్ సోకి ఉండవచ్చనే అనుమానంతో నెల్లూరు బోధనాస్పత్రిలో ప్రత్యేక వార్డుకు తరలించారు.
►నెల్లూరులో ముందు జాగ్రత్తగా సుమారు 15 వేల ఇళ్లలో ఇంటింటి సర్వే నిర్వహించారు.
►కరోనా బాధితులకు చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పడకలను సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ మినహాయింపు
కరోనా వైరస్‌పై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కొద్ది రోజుల పాటు బయోమెట్రిక్ నుంచి మినహాయింపునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులంతా రిజిస్టర్‌లో సంతకాలు చేసి యథావిధిగా విధులు చేపట్టాలి. ఈ ఆదేశాలు నేటినుంచే అమల్లోకి రానున్నాయి.
ఆందోళన చెందొద్దు..
‘కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైనంత మాత్రాన ఆందోళన అక్కర్లేదు. బాధితుడికి వైద్యం అందుతోంది. ఆరోగ్యంగా ఉన్నాడు. రాష్ట్రంలో వైద్యులందరినీ అప్రమత్తం చేశాం. సమన్వయంతో ముందుకెళుతున్నాం’
–డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి (వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి)
Comments
Please login to add a commentAdd a comment