రూ.100కే ఐదు పండ్ల కిట్‌ | Five Different Fruits only For 100 rs in Krishna | Sakshi
Sakshi News home page

రూ.100కే ఐదు పండ్ల కిట్‌

Published Wed, Apr 22 2020 12:58 PM | Last Updated on Wed, Apr 22 2020 12:58 PM

Five Different Fruits only For 100 rs in Krishna - Sakshi

రూ.250లకే అందజేయనున్న నాణ్యమైన బంగినమామిడి పండ్ల కిట్‌

సాక్షి, మచిలీపట్నం: కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ ప్రభావంతో విలవిల్లాడుతున్న ఉద్యాన రైతుకు ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. ఇప్పటికే కోతల దగ్గర నుంచి ఎగుమతి వరకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం తాజాగా మరో అడుగుముందుకేసి స్థానిక మార్కెట్లలో పండ్ల అమ్మకాలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టింది.

ప్రస్తుతం నెలకొన్న పరిíస్థ్ధితుల్లో ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు రైతుకు కాసింత లాభదాయకంగా ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకోసం గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుకు–వినియోగ దారునికి మధ్యఉద్యానవన శాఖ వారధిలా వ్యవహరిస్తోంది. ­రూ.252లకు పైగా విలువైన పండ్లను కేవలం రూ.100లకే వినియోగదారులకు అందించే ఏర్పాట్లు చేసింది. కిలో రూ.50– 60ల విలువైన రెండు కిలోల బంగినపల్లి మామిడి పండ్లు, కిలో రూ.40ల విలువైన రెండు కిలోల బొప్పాయి పండ్లు, కిలో రూ.20ల విలువైన జామ, కిలో 8లు పలికే కేజీన్నర అరటితో కిలో రూ.40ల విలువైన నిమ్మకాయలు కలిపి మొత్తం ఏడున్నర కిలోల పండ్ల కిట్‌ను కేవలం రూ.100లకే అందజేయనున్నారు. అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాంతాలతో పాటు ఉన్నత, ఎగువ మధ్య తరగతి ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో డిమాండ్‌ను బట్టి ఈ కిట్‌లను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రూ.250లకే ఐదు కిలో బంగినపల్లి
మేలురకమైన బంగినపల్లి మామిడి పండ్లు ఐదు కిలోలు కేవలం రూ.250లకే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో పండు కనీసం 300 గ్రాముల సైజులో ఉండే నెంబర్‌ వన్‌ ఎక్స్‌పోర్ట్‌ క్వాలిటీ కల్గిన మామిడి పండ్లను నేరుగా వినియోగదారునికి అందజేయనున్నారు.
రైతు వద్ద సేకరించి నూజివీడులోని ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హోంలోని రైబనింగ్‌ చాంబర్‌లో సహజ సిద్ధంగా మూడురోజుల పాటు మగ్గపెట్టిన మామిడిపండ్లను ప్యాకింగ్‌ చేసి రెడీ టూ ఈట్‌ పద్ధ్దతిలో అందజేస్తారు. తొలుత విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ తదితర పట్టణ ప్రాంతాల్లో అపార్టుమెంట్లు ఎక్కుగా ఉన్న చోట ఈ కిట్‌లను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానికంగా ఉండే ఉద్యాన శాఖ సిబ్బంది జిల్లాలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని అపార్టుమెంట్లు, విల్లాలు, గేటెడ్‌కమ్యూనిటీ ప్రాంతాలున్న చోటకు వెళ్లి ఈ కిట్‌ల కోసం వివరిస్తారు. అక్కడ నివాసితుల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి వాటిని నేరుగా వారి ఇళ్లకే సరఫరా చేస్తారు.

ఉద్యాన రైతులను ఆదుకునేందుకే...
ఎగుమతుల్లేక ఇబ్బందిపడుతున్న ఉద్యాన రైతులను ఆదుకునే లక్ష్యంతో ప్రభుత్వాదేశాలతో ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. మధ్యలో ఎలాంటి దళారీలకు ఆస్కారం లేకుండా రైతు నుంచి నేరుగా వినియోగదారునికి నాణ్యమైన పండ్లను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టాం. సోమవారం నుంచి విజయవాడతో పాటు ప్రధాన పట్టణాల్లో కనీసం 100కిట్‌ల చొప్పున అందుబాటులో ఉంచుతున్నాం.ఆసక్తి గల వారు నూజివీడు హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ఎం.    రత్నమాల 7995086891ను ఫోన్‌లో సంప్రదిస్తే చాలు కావాల్సిన కిట్‌లు నేరుగా పంపిణీ చేస్తాం. దయాకరబాబు, ఏడీ, ఉద్యానవన శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement