ఐదు మోటార్ సైకిళ్లు దహనం
- పావుగంట వ్యవధిలో
- ఒకదాని తర్వాత ఒకటిగా..
- చిలక లూరిపేటలో అర్ధరాత్రి కలకలం
- పోలీసులకు సవాల్‌గా మారిన ఘటన
చిలకలూరిపేటటౌన్: అర్ధరాత్రి 12 గంటల సమయం.. చిలకలూరిపేట పట్టణ పోలీస్‌స్టేషన్ సమీప ప్రాంతం.. ఇళ్ల ముందు నిలిపిన ఐదు ద్విచక్రవాహనాలు ఒకదాని తర్వాత ఒకటిగా వేర్వేరు చోట్ల దహన మయ్యాయి. ఎవరు చేశారు? ఎందుకోసం చేశారు..? ఒక్కరి పనేనా..? అంతుచిక్కని ఇలాంటి ప్రశ్నలెన్నో.. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ వరుస ఘటనలు పట్టణంలో కలకలం రేపాయి. పోలీసులకు పెను సవాల్‌గా నిలిచాయి.
పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా ఐదు ద్విచక్రవాహనాలను దహనం చేసిన ఘటన ఇళ్లలో పార్కింగ్ అవకాశం లేక వాహనాలు బయట నిలిపేవారి గుండెల్లో గుబులు పుట్టించింది. స్టేషన్ వెనుక వీధిలో ఒక మోటార్‌సైకిల్, వినాయకుడి గుడి వీధిలో రెండు, సౌదాగర్ వీధిలో ఒకటి, గుర్రాల చావిడి సమీపంలోని పాత హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ వద్ద మరో ద్విచక్రవాహనం ఆదివారం రాత్రి అగ్నికి ఆహుతయ్యాయి. వాహనాలను ఒకదాని తరువాత ఒకటి పావుగంట వ్యవధిలో తగలబెట్టినట్లు బాధితులు అందజేసిన సమాచారం బట్టి తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్ వెనుక వాహనం తగలబడుతున్న విషయం గమనించిన వాహనయజమాని భూపతి రాజేశ్వరరావు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందజేశారు.
అగ్నిమాపక వాహనం వచ్చేసరికే బైక్ పూర్తిగా దహన మైంది. వినాయకస్వామి గుడి సమీపంలో, సౌదాగార్ వీధి, పాత గ్యాస్‌గౌడన్ వద్ద తగలబెట్టిన వాహనాలు ఎందుకు పనికిరాని పరిస్థితి. వినాయకస్వామి గుడి వీధిలో తగలబెట్టిన రెండో వాహనం మాత్రం పాక్షికంగా దహనమైంది. బాధితుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలాలకు వెళ్లి సమాచారం సేకరించారు. గుంటూరు నుంచి క్లూస్ టీమ్ ఎస్‌ఐ టి.మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివిధ కోణాల్లో దర్యాప్తు...
ఘటన జరిగిన ప్రాంతాలన్నీ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఉండటం పోలీసులకు సవాలుగా మారింది. మద్యం మత్తులో ఆకతాయిలు చేసిన పనా.. అన్నీ ఒకరే చేశారా.. అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రెండు మూడు చోట్ల వాహనాలపై పెట్రోలు లేదా కిరోసిన్ పోసి తగలబెట్టి ఉండవచ్చుని క్లూస్ టీమ్ అనుమానం వ్యక్తం చేసింది. పాక్షికంగా వాహనం తగలబడిన చోట కేవలం పెట్రోలు ట్యాంకు పైపు లాగి దానికి నిప్పింటించినట్లు భావిస్తున్నారు.