లంకల్లో విషాదం
ఆలమూరు : మండలంలోని గౌతమీ గోదావరి చెంతన ఉన్న లంకల్లో ఐదుగురు గల్లంతయ్యారు. ఆదివారం రాత్రి వేర్వేరు చోట్ల ఈ విషాద ఘటనలు జరిగాయి. గల్లంతైన వారిలో నలుగురు విద్యార్థులే. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. జొన్నాడ గ్రామానికి చెందిన మట్టా వెంకట రమణ (35) సమీపంలోని లంకలో పనికి వెళ్లి తిరిగి వస్తూ గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైయ్యాడు. అతనితోపాటు ఉన్న కుమారుడు వరుసైన మట్టా సురేంద్ర (15) కూడా గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. దాదాపు ఇదే సమయంలో బడుగువాని లంక వద్ద జరిగిన మరో ఘటనలో ముగ్గురు బాలలు గల్లంతయ్యారు. బడుగు వాని లంక గ్రామానికి చెందిన పెంటపాటి సిందుశ్రీ (9), ఆమె తమ్ముడు అనుదీప్ (7)తో పాటు కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన నేల వెంకట పవన్ (13) ఒకేచోట గోదావరి ఊబిలో చిక్కుకున్నారు. వారు వేసవి సెలవులకు బడుగువాని లంకలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చి సరదాగా గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు.
ఘటనా స్థలంలో హోంమంత్రి, ఎమ్మెల్యే పరిశీలన
లంకల్లోని గోదావరి రేవుల్లో ఐదుగురు గల్లంతైన వార్త దావానంలా వ్యాపించింది. హోం మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలాలకు చేరుకున్నారు. ఘటనల గురించి అధికారులను, స్థానికులను ఆరా తీశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని హమీ ఇచ్చారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం తక్షణం గాలింపు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. గోదావరిలోనీటి ప్రవాహాన్ని తగ్గించినట్లు తెలిపారు. అలాగే అగ్ని మాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపడతారని వివరించారు.
దుళ్లలో విషాదఛాయలు
దుళ్ళ (కడియం) : స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన నేల వెంకటపవన్ (13) బడుగువానిలంక వెళ్లి అక్కడ గోదావరిలో గల్లంతు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో తల్లి ఇందిర, తమ్ముడు ప్రవీణ్‌కుమార్‌తో కలిసి అమ్మగారింటికి వెళ్ళిన పవన్ గల్లంతయ్యాడన్న వార్తను ఇక్కడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆరో తేదీన పవన్‌పుట్టిన రోజు కావడంతో ఆరోజు దుళ్లలో ఏర్పాటు చేసిన ప్రార్థనకు అమ్మమ్మను, ఇతర బంధువులను ఆహ్వానించేందుకు అక్కడకు వెళ్ళిన పవన్ ఇలా గల్లంతుకావడంపై చుట్టుపక్కలవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి పూర్తి చేసిన పవన్ తండ్రి సుదర్శనరావు రైసుమిల్లు కూలీగా పనిచేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే సుదర్శన్‌తోపాటు, దుళ్ళలోని బంధువులు బడుగువానిలంక తరలివెళ్లారు.