కవిటి, న్యూస్‌లైన్: నాలుగు నెలల పాటు నివేదికను నానబెట్టారు.. తీరా ఇప్పుడు బయటపెట్టారనుకుంటే.. అందులో అన్నీ తప్పులతడకలే.. నష్టపరిహారానికి సంబంధించిన కీలకమైన జాబితా తయారీలో ఇంత నిర్లక్ష్యమా?.. తుపానులో సర్వం కోల్పోయిన తమను ఆదుకుంటారనుకుంటే.. మరింత కుంగదీస్తారా??.. అంటూ రైతులు ఆగ్రహోదగ్రులయ్యారు. అధికారులను దిగ్బంధించారు. గదిలో పెట్టి తాళం వేశారు. ఆన్‌లైన్ జాబితా ప్రతులను తమ ఆగ్రహ మంటల్లో దహనం చేశారు.
కలెక్టర్ వచ్చి సంజాయిషీ ఇస్తే తప్ప అధికారులను విడిచిపెట్టేది లేదని భీష్మించుకున్నారు. చివరికి ఈ నెల 23లోగా కొత్త జాబితా తయారు చేస్తామన్న హామీని అధికారుల నుంచి తీసుకున్న తర్వాతే శాంతించారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఈ పరిణామాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఆలస్యంతో సహనానికి పరీక్ష
అధికారులు ఆన్‌లైన్‌లో పెట్టిన బాధితుల జాబితాలో గల్లంతైన వారి పేర్ల నమోదుకు గురువారం వచ్చిన మండల ఉద్యానశాఖాధికారి జి.సోనీని స్థానిక రైతులు అడ్డుకొని జిల్లా అధికారి వస్తేగానీ ఈ ప్రక్రియ కొనసాగనివ్వబోమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దాంతో తాను శుక్రవారం వస్తానని ఆ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్(ఏడీ) ఎల్.శ్రీనివాసన్ చెప్పారు. ఆ మేరకు రైతులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని ఎదురు చూశారు. ఉదయం 10 గంటలకు వస్తామని చెప్పిన ఏడీ ఎంతకూ రాకపోవడంతో అసహనానికి లోనయ్యారు. ఎట్టకేలకు 12 గంటలకు వచ్చిన ఏడీ రైతులతో మాట్లాడటం ప్రారంభించగానే గందరగోళం మొదలైంది. ఈ నివేదిక ఎవరు తయారు చేశారు, మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల వివరాలు ఉన్నాయా, ఎన్ని హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందో తేల్చారా.. అన్న రైతుల ప్రశ్నల పరంపరతో ఏడీ ఉక్కిరిబిక్కిరయ్యారు. వారి ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండానే తన వద్ద ఉన్న జాబితాలోని వివరాలు చదవడం ప్రారంభించారు. 1,21,755 చెట్లు వేళ్లతో సహా నెలకొరిగాయని, 49,293 చెట్ల మొవ్వు విరిగిందని, 2,27,972 చెట్ల మొవ్వు పాక్షికంగా విరిగిందని, 4,829 చెట్లు వాలి పోయాయని జాబితాలో నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ వివరాలపై రైతులు పెదవి విరిచారు. కొండంత నష్టం వాటిల్లితే జాబితాలో గోరంత నమోదు చేశారని ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది చాలదన్నట్లు విస్తీర్ణం, బ్యాంకు ఖాతా నెంబర్లలో తప్పులు.. ఇలా జాబితా మొత్తం లోపభూయిష్టంగా ఉందని ధ్వజమెత్తారు.
కొత్త జాబితా తయారీకి అంగీకారం
నాలుగు నెలలపాటు తొక్కిపెట్టి, చివరికి నాలుగు రోజుల క్రితం ఆన్‌లైన్‌లో పెట్టిన జాబితాను తప్పుల తడకలతో నింపేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఉద్యానవన శాఖ అధికారులిద్దరినీ సమావేశ గదిలో పెట్టి బయట తాళం వేశారు. దాంతో మధ్యాహ్నం 2.30 గంటల వరకు వారు గదిలోనే ఉండిపోయారు. కలెక్టర్‌తో మాట్లాడి తమకు న్యాయం చేస్తామని హామీ ఇప్పించాలని రైతులు పట్టుబట్టారు. అయితే ఉపాధి హామీ కేంద్ర బృందం పర్యటనలో కలెక్టర్ బిజీగా ఉండటంతో ఆయన నుంచి తగిన స్పందన లభించలేదు. సమయం గడుస్తున్న కొద్దీ రైతుల్లో ఆగ్రహం పెరిగింది. కొందరు ఆన్‌లైన్ జాబితా ప్రతులను గది బయట తగులబెట్టారు. ఇంతలో తహశీల్దార్ జల్లేపల్లి గోపాలరావు వచ్చి నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
దాంతో కలెక్టర్ సీసీ ద్వారా ఫోన్‌లో కలెక్టర్‌ను సంప్రదించి పరిస్థితి తీవ్రతను తెలియజేశారు. ఆయన స్పందిస్తూ సర్పంచులు, వీఆర్వోలు, హెచవోలు రూపొందించిన ప్రాథమిక నివేదిక ప్రతులను ఆయా గ్రామాల సర్పంచులకు అందజేసి ఈ నెల 27 లోగా కొత్త జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ ఫోన్‌లోనే ఆదేశించారు. అయితే ఈ నెల 23 నాటికే కొత్త జాబితా సిద్ధం చేయాలని రైతులు పట్టుబట్టారు. అది కుదరదని ఏడీ అనడంతో మళ్లీ గందరగోళం చెలరేగింది. దీంతో అధికారులు దిగి వచ్చి 23 నాటికే కొత్త జాబితా సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో రైతులు శాంతించారు.
రగిలిన రైతన్న
Published Sat, Jan 18 2014 4:19 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement