
శ్రీవారి ఆలయానికి భద్రత కరువు
సాక్షి,తిరుమల: తిరుమల ఆలయంపై గగనతలంలో బుధవారం సాయంత్రం ఓ విమానం వెళ్లింది. తిరుమల ఆలయంపై విమానాల రాకపోకలు నిషేధించాలని గతంలోనే టీటీడీ పౌర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసింది. ఆలయ భద్రతను పరిశీలించేందుకు వచ్చిన పార్లమెంటరీ కమిటీ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. అయితే, తరచూ విమానాలు తిరుమల ఆలయానికి అతి సమీపంలోనే రాకపోకలు సాగిస్తున్నాయి.
బుధవారం సాయంత్రం 6.20 గంటలకు ఓ విమానం ఆకాశమార్గంలో తూర్పు నుంచి పశ్చిమదిశగా సరిగ్గా ఆలయం మీదే ప్రయాణించింది. దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద చర్యల నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు టీటీడీని ఆందోళనకు గురిచేస్తున్నాయి.