
గన్నవరం/విశాఖపట్నం/తిరుపతి అన్నమయ్యసర్కిల్: విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి సోమవారం పునఃప్రారంభం కావాల్సిన దేశీయ విమాన సర్వీస్‌లన్నీ రద్దయ్యాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం విజయవాడ నుంచి న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలకు సోమవారం నుంచి సర్వీస్‌లు ప్రారంభంకావాల్సి ఉంది. ఈ మేరకు ఎయిర్‌పోర్టు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే చివరి నిమిషం వరకూ ప్రయాణికుల విషయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. అలాగే విశాఖ ఎయిర్‌పోర్టుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను క్వారంటైన్‌కు పంపించాలా? లేదా? అనే విషయంపై స్పష్టత లేక సోమవారం ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖకు రావాల్సిన నాలుగు ఇండిగో, ఒక ఎయిర్ ఆసియా విమాన సర్వీసులు నిలిచిపోనున్నట్లు విశాఖ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ రాజా కిశోర్ తెలిపారు. రెండు ఎయిర్‌పోర్టుల నుంచి మంగళవారం నుంచి విమాన సర్వీస్‌లు నడిచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రేణిగుంట నుంచి ఓకే..
రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి పరిమిత సంఖ్యలో దేశీయ విమానాలను నడిపేందుకు కేంద్ర విమానయాన శాఖ ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేసినట్లు డైరెక్టర్ సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు, 8.50 గంటలకు బెంగళూ రు నుంచి ఇక్కడికి ఇండిగో విమానాలు రాకపోకలు సాగిస్తాయని పేర్కొ న్నారు. ప్రతిరోజూ ఉదయం 11.30 గంటలకు, 11.55 గంటలకు రేణి గుంట నుంచి కొల్హాపూర్‌కు రాకపోకలు కొనసాగుతాయని తెలియజేశారు.
హైదరాబాద్ నుంచి 140 విమానాలు
హైదరాబాద్: శంషాబాద్ నుంచి ఆదివారం అర్ధరాత్రి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమవుతున్నాయి. సోమవారం నుంచి జూన్ 30 వరకు విమానాల షెడ్యూల్‌ను ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆదివారం విడుదల చేశారు. దీని ప్రకారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు మొత్తం 140 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment