‘ఫోరైడ్’ విషానికి విరుగుడు ! | Fluoride poision to be easily remove from water | Sakshi
Sakshi News home page

‘ఫోరైడ్’ విషానికి విరుగుడు !

Published Mon, Jan 20 2014 4:01 AM | Last Updated on Tue, Oct 2 2018 7:51 PM

‘ఫోరైడ్’ విషానికి విరుగుడు ! - Sakshi

‘ఫోరైడ్’ విషానికి విరుగుడు !

నీటి నుంచి ‘ఫ్లోరైడ్’ను సులువుగా తొలగించేందుకు రెండు పద్ధతులను అభివృద్ధి చేసిన ఉస్మానియా ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు
 సాక్షి, హైదరాబాద్: ఫ్లోరైడ్.. నల్లగొండ జిల్లాలో వేలాది మందిని జీవచ్ఛవాలను చేస్తున్న మహమ్మారి.. ఆ ఫ్లోరైడ్ మహమ్మారి నుంచి నల్లగొండ జిల్లా వాసులను ఆదుకునేందుకు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు నడుం బిగించారు. ఐదేళ్లపాటు పరిశోధన చేసి.. అత్యంత సులువైన పద్ధతుల్లో నీటిలోంచి ఫ్లోరైడ్‌ను తొలగించే పద్ధతులను అభివృద్ధి చేశారు. ఈ పరిశోధనను గుర్తించిన భారత సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు (సెర్బ్) దానిని అమలుచేసి, చూసేందుకు రూ. 12 లక్షలను మంజూరు చేసింది.
 
 ఈ నిధులతో నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఒక ఫ్లోరైడ్ పీడిత గ్రామాన్ని ఎంచుకుని రెండేళ్లపాటు శుద్ధిచేసిన తాగునీటిని అందించేందుకు వెంకటేశ్వర్లు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఇటీవల నల్లగొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులును కలసి అనుమతి కూడా తీసుకున్నారు. వెంకటేశ్వర్లు ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కళాశాలలో వృక్షశాస్త్రం (బాటనీ) సీనియర్ ప్రొఫెసర్‌గా, పర్యావరణ శాస్త్ర విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు. తాను చేసిన పరిశోధన వివరాలను ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా తెలియచేశారు.
 
 రెండు పద్ధతుల్లో ఫ్లొరైడ్ నీటి శుద్ధి
 నీటిలోంచి ఫ్లోరైడ్‌ను తొలగించేందుకు వెంకటేశ్వర్లు రసాయన, ఎలక్ట్రాలసిస్ విధానాల్లో నీటిని సులువుగా, తక్కువ వ్యయంతో శుద్ధిచేసే రెండు పద్ధతులను అభివృద్ధి చేశారు. ఐదేళ్ల పాటు చేసిన తన పరిశోధన వివరాలను సెర్బ్‌కు తెలియజేసి.. అమలుచేసి పరిశీలించేందుకు రూ. 12 లక్షల నిధులను సమకూర్చుకున్నారు. ఒక గ్రామాన్ని ఎంచుకుని.. నీటిశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ నీటిని తాగిన ప్రజల ఆరోగ్య పరిస్థితిని మూడు లేదా ఆరునెలలకోసారి పరిశీలిస్తారు. వారి మూత్రం, రక్తాన్ని పరిశీలించి, ఫ్లోరైడ్ శాతం ఎంత తగ్గింది? దాని ప్రభావమేమిటి? తదితర అంశాలను పరిశీలిస్తారు.
 
 ఫ్లోరైడ్ రహితంగా మారుస్తా...
 నేను చేపట్టిన ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుంది. ప్రాజెక్టును చేపట్టిన గ్రామంలో ఫలితాల ఆధారంగా.. దాతల సహాయంతో నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఈ నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి.. నల్లగొండను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారుస్తా. నేను రూపొందించిన పద్ధతిలో శుద్ధి చేసిన నీటిని పంట పొలాలకు కూడా ఉపయోగించుకోవచ్చు.ట
 
 ఇవీ పద్ధతులు...  రసాయన విధానం..
 -    బోరు నీటిని ప్లాంటులోని ట్యాంకుల్లో సేకరించి, బేరియం హైడ్రాక్సైడ్ అనే రసాయనాన్ని కలుపుతారు.
 -    నీటిలో కలిపిన బేరియం హైడ్రాక్సైడ్ అందులోని ఫ్లోరైడ్, ఇతర రసాయనాలతో చర్య జరిపి అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది.
 -    దాంతోపాటు నీటిలోని భార లోహ మూలకాలు, బ్యాక్టీరియా, ఫంగస్, నాచును తొలగించే చర్యలు చేపడతారు.
 -    కొంత సమయం అనంతరం వడగట్టడం ద్వారా శుద్ధి అయిన మంచినీరు రూపొందుతుంది.
 
 ఎలక్ట్రాలసిస్ విధానం..
     విద్యుత్తు ద్వారా నీటిని శుద్ధి చేసే ‘ఎలక్ట్రాలసిస్’ విధానం చాలా సులువైనది.
     ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉన్నా.. అధిక విద్యుత్ వినియోగంతో పాటు ఇతర ఇబ్బందులూ ఉన్నాయి.
     వెంకటేశ్వర్లు దీనిని సులువుగా చేసేలా అల్యూమినియం కడ్డీలతో ఈ పరికరాన్ని రూపొందించారు.
     దీనితో ఏమాత్రం నీరు కూడా వృథా కాదు. కేవలం రూ. 500 వ్యయమయ్యే దీనితో ఇంట్లోనే నీటిని శుద్ధి చేసుకోవచ్చు.
     పది లీటర్ల నీటిని శుద్ధి చేయడానికి దాదాపు 10 నిమిషాల సమయం సరిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement