కరువు, వరదల సమయంలో సరఫరా..
మిగతా సమయాల్లో లాభనష్టాలు లేని ధరకు అమ్మకాలు..
పశుసంవర్ధక శాఖ వినూత్న ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం..
దశల వారీగా జిల్లాకో పశుగ్రాస బ్యాంక్ ఏర్పాటు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిఏటా కొన్ని చోట్ల వరదలు.. మరి కొన్ని చోట్ల కరువు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పశువులకు మేత దొరకని పరిస్థితి. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం, రైతులు పశువులను కబేళాలకు అమ్ముకోవడం పరిపాటి అవుతోంది. కరువు ప్రాంతాలకు పశుగ్రాసాన్ని తరలించాలంటే పశుగ్రాస ఖరీదు కన్నా మూడింతలు రవాణాకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత చేసినా ఆ ఎండుగడ్డిలో ఎలాంటి పోషకాలూ ఉండవు. ఈ సమస్యలకు పరిష్కారంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ‘ఫాడర్(పశుగ్రాస) బ్యాంక్’ అన్న వినూత్న పథకాన్ని అమలు చేయనుంది.
ఈ కొత్త ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్రం రూ.2.10కోట్ల నిధులు కూడా మంజూరు చేసినట్లు సమాచారం. పైలట్ ప్రాజెక్టుగా పులివెందులలోని ‘ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసర్చ్ ఆన్ లైవ్‌స్టాక్’(ఐజీకార్ల్) ఆవరణలో ‘ఫాడర్ బ్యాంక్’ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘ఐజీకార్ల్’లో వినియోగంలో లేని నిర్మాణాలు ఉండటం, పశుగ్రాసాన్ని పెంచేందుకు 600 ఎకరాల స్థలం ఉండటం లాంటి అనుకూలతల దృష్ట్యా పైలట్ ప్రాజెక్టుకు పులివెందులను ఎంచుకున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.
పశుగ్రాసాభివృద్ధి పథకం ఉన్నా..
కేంద్ర నిధులతో ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన’(ఆర్‌కేవీవై) ప్రాజెక్ట్ కింద ‘పశుగ్రాసాభివృద్ధి పథకం’(యాగ్జిలరేటెడ్ ఫాడర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) అమలవుతోంది. మేలుజాతి గడ్డి విత్తనాలు, గడ్డిని చిన్న ముక్కలుగా కత్తిరించే ‘ఛాప్ కట్టర్ల’ను సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తున్నారు కానీ వరదలు, కరువులు లాంటి ప్రతికూల పరిస్థితుల్లో పశువులకు మేత అందించే ఏర్పాట్లేమీ ఈ పథకంలో లేవు. ఈ లోటును పూరించే విధంగా పశుసంవర్ధక శాఖ ‘ఫాడర్ బ్యాంక్’ పథకాన్ని రూపొందించింది.
బ్యాంకు పనిచేస్తుందిలా..
ప్రభుత్వం స్థలంలో పశుగ్రాసాన్ని పండించడం, చుట్టుపక్కల రైతుల నుంచి పశుగ్రాసాన్ని కొనుగోలు చేయడం, పశుగ్రాసానికి తగిన పోషకాలను జోడించి అత్యాధునిక యంత్రాల ద్వారా ‘బేళ్లు’గా చేసి గోదాముల్లో నిల్వచేయడం ద్వారా ‘ఫాడర్ బ్యాంక్’ను ఏర్పాటు చేస్తారు. వరికోత యంత్రాలు వచ్చినప్పటి నుంచి మాగాణుల్లో వినియోగంలోకి రాకుండా పోతున్న వరిగడ్డిని సేకరించి, తగిన పోషక లవణాలను జోడించి బేళ్లుగా తయారు చేసి పశుగ్రాస కొరత ఉన్న ప్రాంతాలకు సరఫరా చేస్తారు. పది లారీల్లో పట్టే గడ్డిని బేళ్లుగా తయారు చేస్తే ఒక లారీలోనే రవాణా చేయవచ్చు. అలాగే ఒక టన్ను ధాన్యాన్ని నిలువచేసేందుకు అవసరమైన స్థలంలోనే ఒక టన్ను పశుగ్రాసాన్ని కూడా నిల్వ చేసుకోవచ్చు. గాలి చొరబడకుండా ప్లాస్టిక్ కవర్‌తో ప్యాకింగ్ చేయడం వల్ల ‘మాగుడు గడ్డి’ని రెండేళ్లపాటు నిల్వ చేయవచ్చు. ఇలా పశుగ్రాసాన్ని బేలింగ్, ప్యాకింగ్ చేసే యంత్రాలను ‘ఫాడర్ బ్యాంక్’ పథకం కింద సమకూర్చుకోనున్నారు.
పులివెందులలో పైలట్ ప్రాజక్ట్‌ను ఆరంభించి ఆ తర్వాత ఈ పథకాన్ని మిగతా జిల్లాలకు విస్తరించను న్నారు. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా చదలవాడ, నెల్లూరు జిల్లా చింతల దీవి, అనంతపురం జిల్లా రెడ్డిపల్లి, మెదక్‌జిల్లా గుర్గార్ పల్లి, కర్నూలు జిల్లా బనవాసి, గుంటూరు జిల్లా నకిరేకల్‌లలోని పశుపరిశోధనా స్థానాల్లో ‘ఫాడర బ్యాంక్’లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త పథకం అమలైతే పశువులకు కూడా ఆహార భద్రత ఏర్పరచినట్లవుతుందని పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
త్వరలో పశుగ్రాస బ్యాంకులు
Published Sun, Jan 12 2014 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement
Advertisement