అక్రమ కేసుకు ఎస్సై వత్తాసు
- విచారణ జరిపి న్యాయం చేయాలి
- కలెక్టర్‌కు దైవాలరావూరు గ్రామస్తుల వేడుకోలు
ఒంగోలు కలెక్టరేట్ : కొరిశపాడు మండలం దైవాలరావూరులో చిన్న పిల్లల మధ్య జరిగిన గొడవ పెద్దల వరకు వెళ్లి ఘర్షణకు దారితీసిన నేపథ్యంలో ఆ సంఘటనతో సంబంధంలేనివారిపై అక్రమంగా కేసు నమోదు చేశారని, దానికి అక్కడి ఎస్సై వత్తాసు పలుకుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోయారు. ఆదివారం కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి గ్రామంలో చోటుచేసుకున్న పరిస్థితులను వారు వివరించారు. ఈ నెల 4వ తేదీన చిన్నపిల్లల మధ్య జరిగిన గొడవ, పెద్దల ఘర్షణకు బాధ్యులను చేస్తూ 12 మందిపై పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారని, వాస్తవానికి సంఘటనలో లేనివారిపై కూడా కేసులు నమోదు చేశారని తెలిపారు. శేఖర్‌బాబు అనే ఉపాధ్యాయుడిని కూడా ఇందులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సై శివకుమార్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరపకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు పోలీసుస్టేషన్‌కు పిలిపించి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రాత్రి 9గంటలకు ఇళ్లకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమలో ఎక్కువ మంది కూలీనాలీ చేసుకొని జీవించేవారమని, తమను ప్రతిరోజూ విచారణ పేరుతో పోలీసుస్టేషన్‌లో ఉంచడం వల్ల జీవనాధారం కోల్పోతున్నామని వాపోయారు. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. విచారణ జరిపిస్తానని కలెక్టర్ విజయకుమార్ వారికి హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసి గోడు వెళ్లబుచ్చుకున్న వారిలో పార్వతి, లక్ష్మీదేవి, కుమారి, శేఖర్‌బాబుతో పాటు మరికొందరు ఉన్నారు.