వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని నందిని రెస్టారెంట్ యజమాని నర్సింహులుకు ఎల్ అండ్ టి ఫుడ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తామని మోసగించిన కేసులో కడప చిన్నచౌక్ పోలీసులు మంగళవారం నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 15,50,000 రూపాయల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.
రాజస్థాన్‌కు చెందిన సందీప్‌సింగ్ అనే వ్యక్తి నర్సింహులుకు ఫోన్‌చేసి ఎల్ అండ్‌టీ ఫుడ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మబలికి విడతలవారీగా 23 లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాడు. ఎన్నిరోజులైనా ఫుడ్ కాంట్రాక్ట్ రాకపోవడంతో మోసపోయానని భావించిన నర్సింహులు పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు దుండగులు కర్నూలు జిల్లా నందికొట్కూరులో తలదాచుకున్నట్లు గుర్తించి మంగళవారం ఉదయం ఆ ముఠాలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అసలు నిందితుడు సందీప్ సింగ్ పరారయ్యాడు. అతనికోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.