పుట్టకోట ఎన్‌కౌంటర్‌పై పోలీసులు గొంతు నొక్కేస్తున్నారు. ప్రజాప్రతినిధులను మాట్లాడనీయకుం డా బెదిరిస్తున్నారు.
వివరాలు వెల్లడిస్తే మావోయిస్టు సానుభూతిపరులుగా కేసు
ఫోన్లో సీఐల హెచ్చరికతో ప్రెస్‌మీట్‌నుంచి వెనుదిరిగిన సర్పంచ్‌లు
నర్సీపట్నం: పుట్టకోట ఎన్‌కౌంటర్‌పై పోలీసులు గొంతు నొక్కేస్తున్నారు. ప్రజాప్రతినిధులను మాట్లాడనీయకుం డా బెదిరిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై గోడు వినిపించుకునేందుకు శుక్రవారం నర్సీపట్నంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి వచ్చిన ఇద్దరు ఏజెన్సీ ప్రాంత ఇద్దరు సర్పంచ్‌లను పోలీసులు ఫోన్లో హెచ్చరించడంతో ప్రాణభయంతో వెళ్లిపోయారు. కొయ్యూరు మండలం పుట్టకోట ఎన్‌కౌంటర్‌పై తమ గోడును వెల్లబుచ్చేందుకు, పోలీసుల తీరును తెలిపేందుకు నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం కేంద్ర కాఫీ బోర్డు సభ్యుడు లోకుల గాంధీ ఇంటి వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు సీఐలు ఆయా సర్పంచ్‌లకు ఫోన్ చేశారు. ప్రెస్‌మీట్ ఆపి పోలీసుస్టేషన్‌కు రాకపోతే మావోయిస్టు సానుభూతిపరులని కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో వారు అటు పోలీసులకు ఇటు మావోయిస్టులకు మధ్య నలిగిపోతున్నామని, సర్పంచ్‌లకే రక్షణ లేకపోతే పంచాయతీల్లోనున్న మారుమూల శివారు గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చేతులెత్తి నమస్కరించి స్టేషన్‌కు వెళ్లారు.
ఇదిలావుండగా ఎన్‌కౌంటర్‌పై పోలీసులు, గిరిజనుల కథనాలు వేర్వేరుగా ఉన్నాయి. ఎన్‌కౌంటర్ సమయంలో ఒడిశా ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆడవిలోకి వచ్చినట్టు గిరిజనులు చెబుతున్నారు. వీరిని మిలీషియా సభ్యులు అనుకొని పోలీసులు కాల్పులు జరపగా, ఇద్దరు చనిపోగా, ఒకరు తప్పించుకున్నారు. రెండు చేతులు కోల్పోయిన ఇరుముళ్ల అనే వ్యక్తి మఠంభీమవరంలోని చర్చి వద్ద ఏడుస్తూ కనిపించాడు. గ్రామస్తులు ఆరాతీయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఇదే విషయం పత్రికల్లో ప్రచురితం కావడంతో ఎన్‌కౌంటర్ పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఊహించిన పోలీసులు, మావోయిస్టులనుంచి మీకు ముప్పు ఉందంటూ గ్రామానికి చెందిన కొంతమందిని కేడీపేట పోలీసుస్టేషన్‌కు తరలించడం తెలిసిందే. విడుదలైన వారిలో కొందరు నర్సీపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడేందుకు సిద్ధపడ్డారు. పోలీసు హెచ్చరికలతో వెనుదిరిగారు.