ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి, సమస్యలను సత్వరం పరిష్కరించడమే రచ్చబండ ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు.
త్రిపురారం/నిడమనూరు, న్యూస్‌లైన్ : ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి, సమస్యలను సత్వరం పరిష్కరించడమే రచ్చబండ ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. త్రిపురారం, నిడమనూరులో గురువారం నిర్వహించిన మూడో విడత రచ్చబండలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గతంలో ఇళ్లు, పింఛన్లు అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు మాత్రమే అందేవని, కాంగ్రెస్ హయాంలో పార్టీ రహితంగా అర్హులకు అందుతున్నాయని తెలిపారు.
ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంతో పాటు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. వలసలను నివారించేందుకు రూ.5వేల కోట్లను ఖర్చు చేసి కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని జిల్లాలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణ రాష్ట్రం ఆగదన్నారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ బిల్లు వస్తుందని, జనవరి నాటికి తెలంగాణ ఏర్పడడం ఖాయమన్నారు. మూడు ప్రాంతాలకు సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రాంతానికి అన్యాయం చేయాలని చూస్తున్నారని, తెలంగాణ ప్రజలు గాజులు తొడుక్కోలేదని అన్నారు.
అనంతరం లబ్ధిదారులకు వివిధ పథకాల ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో కలెక్టర్ చిరంజీవులు, జెడ్పీ సీఈఓ వెంకట్రావ్, డ్వామా పీడీ కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామలింగయ్య యాదవ్, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, త్రిపురారం మండల ప్రత్యేక అధికారి సుధాకర్‌రెడ్డి, ఎంపీడీఓ రమేష్, తహసీల్దార్ రవిశంకర్, పీఆర్ ఏఈ హర్షా, ధన్‌సింగ్ నాయక్, మర్ల చంద్రారెడ్డి, రామచంద్రయ్య, సర్పంచ్ ఆలంపల్లి రమణజానయ్య, సొసైటీ చైర్మన్లు అనుముల నర్సిరెడ్డి, బుసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, భరత్‌రెడ్డి, నరేందర్, గోపగాని శ్రీనివాస్, అనుముల నర్సింహారెడ్డి, రాంచందర్ నాయక్, దామోదర్, ఏపీఓ యాట వెంకటేశ్వర్లు, ఏపీఎం నాగేందర్ పాల్గొన్నారు.