కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : గ్రామపంచాయతీ నిధులపై పూర్తి ఆజమాయిషీని సర్పంచ్‌లకే కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేశారు. ఇప్పటివరకు పంచాయతీ కార్యదర్శితో కలిసి సర్పం చ్‌కు జాయింట్ చెక్‌పవర్ ఉండగా, సర్పంచ్‌ల సంఘం, బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి మేరకు 30 ఉత్తర్వు, 20.01.1995లోని 40వ నియమం ప్రకారం సర్పంచ్‌లకు సొంతంగా చెక్‌పవర్‌ను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీని ప్రకారం పంచాయతీకి సంబంధిం చిన సాధారణ నిధుల చెక్కులు విడిపించడానికి సర్పంచ్‌కు పూర్తిస్థాయి హక్కును కల్పించారు. ప్రత్యేక నిధులు అంటే 13వ ఆర్థిక సంఘం నిధులు, స్టేట్ ఫైనాన్స్ కమిటీ(ఎస్‌ఎఫ్‌సీ), వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు(బీఆర్‌జీఎఫ్)పై మాత్రం సర్పంచ్, కార్యదర్శులకు జాయింట్ చెక్‌పవర్ ఉంటుంది. దీనిపై సర్పంచ్‌ల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చెక్‌పవర్ ఇచ్చినట్లే ఇచ్చి పరిమితులు విధించడం సరికాదంటోంది.
ఆర్థిక ఆజమాయిషీపై మార్గదర్శకాలివి
పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం పంచాయతీల ద్వారా చెల్లించవలసిన ప్రతి బిల్లుకు తప్పకుండా పంచాయతీ తీర్మానం ఆమోదం పొందాలి. పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ నియమాల ప్రకారం పరిశీలించి ముందుంచి తేనే సర్పంచ్ బిల్లు పాస్ చేయాలి. బిల్లు పాసైన అనంతరం సంబంధిత నగదు పుస్తకంతో సహా అకౌంటింగ్ రిజిస్టర్‌లో పొందుపరిచిన అనంతరమే చెక్కును సర్పంచ్‌కు అందచేయాలి. గ్రామపంచాయతీ ద్వారా తీర్మానం ఆమోదింపబడకుండా, గ్రామపంచాయతీ పనులు నిర్వహిస్తే పరిపాలనా అనుమతి, సాంకేతిక అనుమతి, మేజర్‌మెంట్ బుక్, చెక్ మేజర్‌మెంట్‌లు లేకుండా చెల్లింపులు చేయరాదు. సామగ్రి కొనుగోళ్లపై ఫైనాన్షియల్ కోడ్‌లో నిర్ధేశింపబడిన నియమాలను పాటించాలి.
కాంట్రాక్ట్, పార్ట్‌టైం ఉద్యోగుల వేతనాల చెల్లింపులో పంచాయతీ బడ్జెట్ నియమావళిని అనుసరించాలి. గ్రామపంచాయతీ బడ్జెట్ ప్రొవిజన్ ప్రకారం ఆదా యం మేరకు ఖర్చులు చేసుకోవచ్చు. ప్రత్యేక అవసరం అయితే తప్ప పార్టీ పేరుతోనే చెక్కు లు జారీ చేయాలి, సొంతంగా డ్రా చేయరాదు. లెక్కలు, పనుల రిజిస్టర్లు, చెక్కు, పాసుపుస్తకం కచ్చితంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి ఆధీనంలో ఉండాలి. అవసరమైనపుడు సర్పంచ్ సమీక్షించొచ్చు. రశీదుల ద్వారా వసూలు చేయబడిన నగదు నుంచి నేరుగా ఎలాంటి చెల్లింపులు చేయొద్దు. ట్రెజరీలోని గ్రామపంచాయతీ నిధికి జమ చేయాలి.
పూర్తి అధికారం ఇవ్వాలి
- అంతటి అన్నయ్యగౌడ్,
సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు
సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇచ్చినట్లే ఇచ్చి, కొన్ని నిధులపై జాయింట్ పవర్‌ను కొనసాగించడం సరికాదు. జాయింట్ చెక్‌పవర్‌ను పూర్తిగా రద్దుచేయాలి. సర్పంచ్‌ల అధికారాలపై పరిమితులు తొలగించాలి. బీఆర్‌జీఎఫ్, ఎస్‌జీఎఫ్, 13వ ఆర్థిక సంఘం నిధులపై సర్పంచ్‌కే చెక్‌పవర్ అప్పగించాలి. సీనరేజి నిధులు, స్టాంప్‌డ్యూటీ జనరల్ ఫండ్‌కు వెంటనే జమచేయాలి.
సర్పంచ్‌లకే చెక్‌పవర్
Published Wed, Dec 11 2013 3:11 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement