సాక్షి ప్రతినిధి, కర్నూలు : ‘ఈ అడవీ నాదే.. వేటా నాదే’ అని ఓ సినిమాలో డైలాగ్. జిల్లాలోని టీడీపీ శ్రేణులు అచ్చం ఇలాగే వ్యవహరిస్తున్నాయి. ‘అధికారం మాదే.. పదవులూ మావే’ అన్న చందంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పావులు కదుపుతున్నారు. అవకాశం లేకపోయినా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి పదవుల కోసం పాకులాడుతున్నారు. ఇటీవలే ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీలు.. ఆలయ పాలకమండళ్లు రద్దు చేసింది. వీటి కోసం తమ్ముళ్లు పోటీ పడుతున్నారు.
పదవి కావాలంటూ ముఖ్య నేతల చుట్టూ చక్కర్ల కొడుతున్నారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే పలు చోట్ల రేషన్ డీలర్లను మార్చు చేయించారు. అలాటే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులపై కన్నేశారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు కావాలంటూ పట్టుబడుతున్నారు. పింఛన్లు, ఉపాధిహామీ పథకం బిల్లులు చెల్లించే సీఎస్‌పీలను తమ వారినే ఎంపిక చేయాలంటూ టీడీపీ నేతలు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎటువంటి ఆరోపణలు లేకపోయినా జిల్లాలో వెయ్యి మంది డీలర్లను తొలగించడం వీరి పదవుల దాహానికి పరాకాష్టగా చెప్పవచ్చు.
మార్కెట్ కమిటీలకు పోటాపోటీ..
జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వాటిని సొంతం చేసుకునేందుకు టీడీపీ నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానిక టీడీపీ ఇన్‌చార్జ్ ఒకరి పేరు సూచిస్తే, ద్వితీయ శ్రేణి నాయకులు మరో పేరు చెబుతున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్‌యార్డు కోసం పోటీ ఎక్కువైంది. కర్నూలులో కేఈ, టీజీ వెంకటేష్ వర్గాలు పోటీ పడుతున్నాయి. తమ వారికే ఇప్పించేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా నంద్యాల మార్కెట్ కమిటీ కోసం శిల్పా మోహన్‌రెడ్డి, ఫరూక్ వర్గాలు పట్టుబడుతున్నాయి.
ఆదోని మార్కెట్ యార్డు చైర్మన్ కోసం మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తమ్ముడితో పాటు మరో ఇద్దరు తమకే ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్నికలకు ముందు మదిర భాస్కరరెడ్డికి మాట ఇచ్చారు. అయితే మీనాక్షినాయుడు ఓటమి పాలవడంతో కనీసం మార్కెట్ కమిటీ చేతిలో ఉంటే బాగుంటుందని కుటుంబీకులు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే మీనాక్షినాయుడు తమ్ముడు ఉమాపతి పేరు తెరపైకి వచ్చింది. ఇదిలా ఉండగా మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న గొల్ల చిన్నరంగయ్య కూడా తనకే మార్కెట్ కమిటీని కట్టబెట్టాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీ విషయానికి వస్తే అనేక మంది పోటీలో ఉన్నారు.
నందవరం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఈరన్నగౌడ్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మాధవరావుదేశాయి, సంజన్నచౌదరి, జగన్నాథరెడ్డి, విక్రమ కుమార్‌గౌడ్, ఉరుకుందయ్యశెట్టి పోటీ పడుతున్నారు. బనగానపల్లె మార్కెట్ కమిటీ కోసం ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కూడా తన అనుచరులకే కట్టబెట్టాలని యత్నిస్తున్నట్లు తెలిసింది. నందికొట్కూరు కమిటీని మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, టీడీపీ నాయకుడు విక్టర్ తమ వారికే ఇవ్వాలని పోటీపడుతున్నారు. మిగిలిన కమిటీల్లో కూడా టీడీపీలోని రెండు వర్గాలు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
పదవుల కోసం పాకులాట!
Published Wed, Aug 6 2014 12:13 AM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM
Advertisement