మార్కెట్లకు ఇదేమి రోగం! | markets | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు ఇదేమి రోగం!

Published Thu, Mar 5 2015 1:47 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM

markets

సాక్షి, కర్నూలు : క్రయవిక్రయాల కోసం మార్కెట్ యార్డులకు వచ్చే రైతులకు అవసరమైన సమయంలో సరైన వైద్యం అందడంలేదు. దీంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. జిల్లాలో కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, ఆలూరు, పత్తికొండలలో వ్యవసాయ మార్కెట్ యార్డులున్నాయి. 12 మార్కెట్లలోనూ ప్రాథమిక వైద్య సేవలందక ప్రతి రోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్‌కు వచ్చిన రైతుల్లో ఏదో ఒక సందర్భంలో గాయాలకు గురవుతున్నారు. వైద్యం అందక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంంది. ప్రభుత్వానికి రూ. కోట్ల ఆదాయం సమకూర్చుతున్న రైతులను పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 ప్రాథమిక చికిత్సా.. కరువే..!
 జిల్లాలోని రెండో అతి పెద్ద మార్కెట్‌గా పేరొందిన కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో అన్నదాతకు కనీసం ప్రాథమిక వైద్యం కూడా అందుబాటులో లేదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని వ్యవసాయ మార్కెట్లలో కొన్నిచోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పని చేస్తున్నాయి. మన జిల్లాలోనూ ఆదోని మార్కెట్ యార్డులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నడుస్తోంది. కర్నూలులో వైద్య కేంద్రం ఊసేలేదు. పక్క జిల్లాలతోపాటు నలుమూలల నుంచి తమ పంట ఉత్పత్తులను తీసుకొచ్చే రైతుల సంఖ్య నిత్యం నాలుగైదు వేల మధ్య ఉంటుంది. వీరు కాకుండా మార్కెట్ ఆధారిత పనులు చేసే వారి సంఖ్య మరో రెండు మూడు వేలు ఉంటుంది. సగటున ఎనిమిది వేల మంది కర్నూలు ప్రధాన మార్కెట్‌కు వస్తుంటారని అధికారుల అంచనా. వీరిలో ఎవరైనా ఆనారోగ్యానికి గురైనా, ప్రమాదాల బారిన పడినా కనీస ప్రాథమిక చికిత్స అందించే పరిస్థితి లేని దుస్థితి మార్కెట్ శాఖది.
 
 రైతులు, సిబ్బందికి ఆరోగ్య సమస్యలు..
 మార్కెట్లలో కాలుష్యం పడక చాలామంది రైతులకు జర్వం, వాంతులు, తలనొప్పి, దగ్గు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, తలతిరగడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఉల్లి, మిర్చి యార్డులలో విపరీతమైన ఘాటు వస్తుంది. చాలామంది రైతులు దీన్ని తట్టుకోలేకపోతుంటారు. మహిళా రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అక్కడ్నుంచి వెళ్లాలంటే సరుకు చోరీ ముఠాల బెడద వారిని వేధిస్తోంది. ఈ సమయంలో ఆకస్మాత్తుగా తిరగబెట్టే వ్యాధులు, తలెత్తే అనారోగ్య సమస్యలకు కనీస ప్రాథమిక చికిత్స చేయించుకోవాలంటే మార్కెట్లలో ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రులు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో నిత్యం ఇబ్బందులు పడుతూనే రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకుంటున్నారు.
 
 ఉన్న ఆసుపత్రి మూసివేత..
 కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో రెండేళ్ల కిందటి వరకు రైతుల కోసం అప్పటి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి ప్రత్యేకంగా ఓ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. కాంట్రాక్టు పద్ధతిపై వైద్యుడిని నియమించారు. ప్రభుత్వం ఈ ఆసుపత్రికి ఉచితంగా ఔషధాలు సరఫరా చేసింది. వైద్యుడికి మార్కెట్ వేతనం చెల్లించింది.
 
  తెలుగుదేశం ప్రభుత్వం ఆధికారంలోకి రాగానే చైర్మన్ బాధ్యతల్నుంచి తప్పుకోవడంతో ఆసుపత్రిని శాశ్వతంగా మూసివేశారు. అతిపెద్ద మార్కెట్ అయిన ఇక్కడ నిత్యం వచ్చే రైతులకు ప్రత్యేకంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అవసరం ఎంతో ఉంది. రైతులతోపాటు హమాలీలు, ఇతర అధికారులు, సిబ్బంది పని చేస్తుంటారు. వీరంతా మార్కెట్ పరిసరాల్లోనే ఎక్కువసేపు ఉంటారు. ఇప్పటికైనా మార్కెటింగ్ శాఖ రైతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తిరిగి ప్రారంభించాలని, ఒక డాక్టరును, కాంపౌండర్‌ను నియమించాలని రైతులు కోరుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement