సమ్మె విజయవంతం | stricke sucees | Sakshi
Sakshi News home page

సమ్మె విజయవంతం

Published Sat, Sep 3 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

సమ్మె విజయవంతం

సమ్మె విజయవంతం

– కదంతొక్కిన కార్మికులు
– మూతపడిన బ్యాంకులు, పోస్టల్‌ కార్యాలయాలు, ఇన్సూరెన్స్‌ కార్యాలయాలు
– నడవని ఆర్టీసీ బస్సులు, ఆటోలు


కర్నూలు సిటీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు శుక్రవారం చేపట్టిన దేశ వ్యాప్త సమ్మె జిల్లాలో విజయవంతమైంది. ఉదయం ఆరు గంటలకే మండల కేంద్రాల్లో కార్మిక సంఘాల నాయకులు, ఆటో వర్కర్స్‌ యూనియన్, హమాలీ, అంగన్‌వాడీ వర్కర్స్, ఏఐటీయూసీ, సీఐటీయూ.. వీటి అనుబంధ సంఘాల కార్మికులు రోడ్లపైకి చేరుకుని నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్సులను, ఆటోలను, ఇతర వాహనాలను నిలిపి వేసి సమ్మెకు సహకరించాలని కోరారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న కార్మికుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, హక్కులను అమలు చేయాల్సిన పాలకులు కాలరాసే విధంగా చట్టాలను మార్పులు చేస్తున్నారని ఆయా కార్మిక సంఘాల నాయకులు విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగు దేశం ప్రభుత్వాలు అభివద్ధి ముసుగులో కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్నారు. రోడ్డు రవాణా భద్రత బిల్లును రద్దు చేయాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. సమ్మె చేసేందుకు ముందు కేంద్ర ప్రభుత్వానికి 12 ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని 9 కేంద్ర కార్మిక సంఘాలు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. జిల్లాలోని గుర్తింపు ఉన్న అన్ని ట్రేడ్‌ యూనియన్లు సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నాయి. బ్యాంకులు, పోస్టల్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాయాలు, ప్రభుత్వ, ప్రై వేటు పాఠశాలలు మూతపడ్డాయి.
 
సమ్మెకు వైఎస్‌ఆర్‌సీపీ, వామపక్ష పార్టీల మద్దతు
కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన దేశ వ్యాప్త సమ్మెకు వైఎస్‌ఆర్‌సీపీ, వామ పక్ష పార్టీలు మద్దతు ఇచ్చాయి. కార్మికులకు అండగా వైఆర్‌సీపీ పోరాటం చేస్తుందని కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ హఫీజ్‌ఖాన్‌ తెలిపారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్, ఏటీయూసీ రాష్ట్ర నాయకులు పి.దామోదరరావు, సీఐటీయూ నాయకులు రాధాకష్ణ, ఏపీ ఎన్జీవో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంగళరెడ్డి, ఐఎన్‌టీయూసీ రమణ, మున్సిపల్‌ కార్మికులు, బ్యాంకు ఉద్యోగులు, పోస్టల్‌ ఉద్యోగులు, మెడికల్‌ రెప్స్‌ సంఘం, ఏపీటీఎఫ్‌ సంఘం, ఐఎన్‌టీయూసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఘం, రైతు సంఘం నాయకులు, పలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఐద్వా, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

స్తంభించిన సేవలు
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం బ్యాంకింగ్‌ వ్యవహారాలు స్తంభించిపోయాయి. భారతీయ స్టేట్‌బ్యాంకు, ఏపీజీబీ మినహా జిల్లాలోని అన్ని బ్యాంకులు సమ్మెలో భాగంగా బంద్‌ అయ్యాయి. ఆయా బ్యాంకుల ఉద్యోగులు కూడా సార్వత్రిక సమ్మె ర్యాలీ తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్రబ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు, జిల్లా సహకార కేంద్రబ్యాంకు తదితర బ్యాంకులు మూత పడటంతో కోట్లాది రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. బీమా సంస్థలు మూత పడ్డాయి. అన్ని జీవిత బీమా కార్యాలయాల అధికారులు, సిబ్బంది సమ్మెలో పాల్గొనడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు దాదాపుగా పనిచేయలేదు. జిల్లా కలెక్టరేట్‌లోని అన్ని శాఖల కార్యాలయాలు సిబ్బంది లేక వెలవెలపోయాయి. ముఖ్యంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఒక్కరు కూడా కనిపించలేదు. వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, ఆడిట్‌ కార్యాలయం, జిల్లా ప్రణాళిక విభాగం, జిల్లా ట్రెజరీ, ఐసీడీఎస్, సహకార శాఖ తదితర కార్యాలయాలు ఖాళీ అయ్యాయి. జిల్లా నాన్‌ గజిటెyŠ  అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్‌ వెంగళరెడ్డి, జవహార్‌లాల్‌ ఇతర జిల్లా నాయకులు కూడా సమ్మెకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు.   

ఆర్టీసీకి రూ.25లక్షల నష్టం
సార్వత్రిక సమ్మె ప్రభావం ఆర్టీసీపై పడింది. ఆందోళన కారులు బస్సులను అడ్డుకోవడంతో రూ.25లక్షల వరకు కర్నూలు రీజియన్‌ ఆదాయాన్ని కోల్పోయింది. జిల్లాలో మొత్తం 1016 బస్సులున్నాయి. వీటిలో శుక్రవారం సాయంత్రం 6గంటల సమయానికి 709 బస్సులు నడపాల్సి ఉండగా కేవలం 538 సర్వీసులు మాత్రమే డిపోల నుంచి బయటకు వెళ్లాయి. మిగిలిన 171 సర్వీసులు రద్దయ్యాయి. దీంతో సంస్థకు రూ.25 లక్షల మేరకు ఆదాయం కోల్పోయిందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement