stalled services
-
నిలిచిన వందేభారత్
బాపట్ల టౌన్: వర్షాల కారణంగా ట్రాక్ దెబ్బతినడంతో బాపట్ల ప్రాంతంలో వందేభారత్ రైలు సుమారు గంటన్నరకుపైగా నిలిచిపోయింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందేభారత్ రైలు సోమవారం సాయంత్రం 6.12 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరింది. 7.45 గంటలకు గుంటూరు చేరుకోవాల్సి ఉంది.7 గంటలకు పొన్నూరు మండలం మాచవరం రైల్వేస్టేషన్ ప్రాంతానికి చేరుకునే సమయానికి మాచవరం సమీపంలో ట్రాక్ దెబ్బతిన్న సమాచారం అందుకున్న లోకో పైలట్ రైలు నిలిపేశాడు. ట్రాక్ ఏ ప్రాంతంలో దెబ్బతిందో.. ఎంతమేర దెబ్బతిందనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైలును మాచవరం నుంచి అప్పికట్ల రైల్వేస్టేషన్ వరకు వెనక్కి తీసుకొచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ట్రాక్ మరమ్మతు చేయడంతో రైలు యధావిధిగా గుంటూరు వైపు ప్రయాణించింది. -
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతతో తీవ్ర ఇబ్బందులు
తలకొండపల్లి మండలానికి చెందిన మల్లయ్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో కుటుంబీకులు మంగళవారం నగర శివారులోని ఓ ప్రైవేటు (నెట్వర్క్) ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఆరోగ్యశ్రీ కార్డు సహాయంతో సదరు ఆస్పత్రికి వెళ్లిన మల్లయ్యకు.. చికిత్స చేసేందుకు ఆస్పత్రి వర్గాలు తిరస్కరించాయి. ఇదేమని అడగగా.. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని, అందుకే సేవలు నిలిపివేశామని తేల్చిచెప్పారు. పరిస్థితి సీరియస్‌గా ఉందని, ఎలాగైనా ఆదుకోవాలని కుటుంబీకులు బతిమాలినా ఆస్పత్రి యాజమాన్యం మెట్టు దిగలేదు. సుమారు అరగంటపాటు అక్కడే ఉన్నా కనికరించలేదు. దీంతో చేసేది లేక హుటాహుటిన హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇది మల్లయ్య ఒక్కడికే ఎదురైన అనుభవం కాదు.. ఇలాంటి రోగులు చాలామంది నిత్యం తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రైవేటు ఆస్పత్రుల్లో పేదలకు వైద్య సేవలు నిలిచిపోవడంతో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. తమ వద్ద డబ్బులు లేకున్నా కార్పొరేట్ వైద్యం అందుతుందన్న నమ్మకంతో ఆస్పత్రుల మెట్లెక్కుతున్న రోగుల గుండె బరువెక్కుతోంది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో వైద్యసేవలను నిలిపివేశామని తేల్చిచెబుతుండడంతో రోగులకు రోదనే దిక్కవుతోంది. అలాగే, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్ఎస్) కింద చికిత్స పొందాలనుకుంటున్న ఉద్యోగులు, జర్నలిస్టులకు కూడా ఇదే చేదు అనుభవం ఎదురవుతోంది. ఇటు ప్రభుత్వ వైఖరి.. అటు బకాయిల విడుదలపై ప్రైవేటు ఆస్పత్రుల పట్టు విడువని ధోరణి.. ఫలితంగా రోగులు సమిధలుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఐదు రోజులుగా ఆస్పత్రులు ఆందోళనపథంలో ఉండడంతో.. బాధితుల దుస్థితి వర్ణణాతీతంగా మారింది. బకాయిలు రూ.317 కోట్లు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ బకాయిలు పేరుకుపోవడంతో పేదలతోపాటు ఉద్యోగులు, పాత్రికేయులకు అందించే వైద్య సేవలను ప్రైవేటు ఆస్పత్రులకు నిలిపివేశాయి. కొన్ని ఏళ్లుగా బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆందోళన బాటపట్టాయి. మరోవైపు త్వరలో నిధులు వస్తాయని సేవలు కొనసాగించాలని ఆస్పత్రుల యాజమాన్యాలను ప్రభుత్వం కోరుతున్నా మెట్టుదిగడం లేదు. బకాయిలు విడుదల చేస్తారని ఏళ్లుగా నిరీక్షిస్తున్నామని, అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ పేర్కొంటోంది. వందల కోట్ల రూపాయలు అందకపోవడంతో తమకు ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. బకాయిలు విడుదల చేస్తేనేగాని సేవలను పునరుద్ధరించలేమని ఆస్పత్రుల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో చోటుచేసుకుంటున్న జాప్యంపై మండిపడుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 550 ప్రైవేటు ఆస్పత్రులు ఉండగా.. వీటిలో 79 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ , ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ కింద వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆరు మెడికల్ కాలేజీలు ఉండగా.. వీటిలో మాత్రమే ఆరోగ్యశ్రీ , ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ కింద సేవలు రోగులకు అందుతున్నాయి. మిగిలిన ఆస్పత్రులు ఆందోళన పథాన్ని పట్టాయి. ఈ ఆస్పత్రులకు సుమారు రూ. 317 కోట్లను ప్రభుత్వం బకాయి పడినట్లు తెలుస్తోంది. దాదాపుగా రెండు మూడేళ్లుగా సక్రమంగా నిధులు విడుదల చేయకపోవడంతో సేవల నిలిపివేతే శరణ్యమని భావించిన ఆస్పత్రుల యాజమాన్యాలు ఆందోళనను కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి స్పందన వస్తే తప్పా సమ్మె విరమించబోమంటున్నారు. ‘సేవల బంద్’ బోర్డులు బకాయిలు పేరుకుపోవడంతో వైద్యసేవలు అందించలేమని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు బోర్డులు పెడుతున్నాయి. మరికొన్ని ఆస్పత్రులు బహిర్గతంగా బోర్డులు ఏర్పాటు చేయకున్నా.. సేవలకు దూరంగా ఉంటున్నాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వెళ్తున్న రోగులను యాజమాన్యాలు తిప్పి పంపిస్తున్నారు. కాళ్లావేళ్లా పడి ప్రాదేయపడినా కనికరించడం లేదు. ఆరోగ్యశ్రీ ఉందని చేతుల్లో డబ్బులు లేకున్నా కొండంత ధైర్యంతో ఆస్పత్రుల బాట పడుతున్న రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. డయాలసిస్ చేసుకుంటున్న కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్థులు, క్యాన్సర్ తదితర వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నవారి పరిస్థితి వర్ణనాతీతం. ఇక రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారు, ఇతర అత్యవసర అనారోగ్య సమస్యలు వారు కచ్చితంగా డబ్బులు పెట్టుకుని వైద్యసేవలు పొందుతున్నారు. ఆస్పత్రులు సేవలను నిలిపివేసిన నేపథ్యంలో ప్రభుత్వం యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నా ఫలించడం లేదు. పెండింగ్‌లో ఉన్న నిధులన్నింటినీ విడుదల చేస్తేనే సేవలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేస్తున్నాయి. మెడికల్ కాలేజీల్లో సేవలు..కొన్ని ఆస్పత్రులు మాత్రమే ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలను నిలిపివేశాయి. ఇలా ఇబ్బంది పడుతున్న రోగులను మెడికల్ కాలేజీలకు, ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నాం. ధర్నా కొనసాగిస్తున్న ఆస్పత్రుల వివరాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిస్తున్నాం. ఏయే ఆస్పత్రులు.. రోజువారీగా ఎంతమందికి వైద్యం అందిస్తున్నాయనే విషయాన్ని తెలియజేస్తున్నాం. – డాక్టర్ రఘునాథ్ రెడ్డి, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త -
‘మీ–సేవ’లెక్కడ...?
సాక్షి, హైదరాబాద్ : పౌర సేవలను సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మీ–సేవలు రాష్ట్రంలో నిలిచిపోయాయి. రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు రావడం, దానికి తోడు దరఖాస్తులు పరిశీలించే అధికారులు కొర్రీలు వేస్తుండటంతో మీ సేవా దరఖాస్తులు పరిష్కారం కాకుండా గుట్టలుగా పేరుకుపోయాయి. ఈ సేవల రాకతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలకు బ్రేక్ పడినప్పటికీ, తాజాగా యంత్రాంగం పెట్టే మడత పేచీలతో ఇబ్బందులు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో జనవరి ఒకటో తేదీ నుంచి మే 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,94,305 అర్జీలు పెండింగ్‌లు ఉన్నాయి. సేవల జాప్యానికి వరుస ఎన్నికలు, దరఖాస్తుతోపాటు మాన్యువల్ కాపీలను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాలని ఆంక్షలు విధించడం కూడా ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ రెండింటితో అర్జీల పెండింగ్ సంఖ్య పెరిగేందుకు దారితీస్తోంది. ఎన్నికల నిర్వహణతో బిజీ బిజీ ఈ ఏడాది జనవరిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఆ ప్రభావం మీ సేవలపై దాదాపు ఫిబ్రవరి రెండో వారం వరకు పడింది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు, అనంతరం మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలతో ప్రభుత్వ యంత్రాంగం బిజీ అయ్యింది. ఈ తంతు మీ సేవ దరఖాస్తుల పరిష్కారంపై తీవ్ర ప్రభావం చూపాయి. అధికార యంత్రాంగమంతా ఎన్నికల నిర్వహణలో తలమునకలు కావడంతో పరిపాలనా వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది. దీంతో మీ సేవల ఆర్జీల వైపు కన్నెత్తి చూసే నాథుడే లేకుండాపోయారు. అపరిష్కృత దరఖాస్తుల్లో అత్యధికంగా రెవెన్యూ సంబంధిత అంశాలే ఉన్నాయి. వీటిలో అగ్రభాగం మ్యూటేషన్లకు సంబంధించినవే. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం జరిగిన క్రయ విక్రయాలు ఇతరత్రా రెవెన్యూ డాక్యుమెంట్ల అప్డేషన్ కోసం మీ సేవలోనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించిన సంగతి తెలిసిందే. రెండోస్థానం కుల ధ్రువీకరణ దరఖాస్తులు. ప్రస్తుతం విద్యా సంస్థల్లో ప్రవేశాల సీజన్ కావడంతో కుల, ఆధాయ ధ్రువీకరణ దరఖాస్తుల సంఖ్య అమాంతం పెరిగే అవకాశం ఉంది. స్టేషనరీ నిధులు స్వాహా... మీ సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు చేరిన అర్జీలను ప్రింట్ అవుట్ తీసుకోవడం, వాటిని పరిశీలించి పరిష్కరించే క్రమంలో అవసరమైన స్టేషనరీ నిధులు ప్రభుత్వం ఆయా శాఖలకు విడుదల చేస్తోంది. ఒక్కో పేపర్ ప్రింట్ అవుట్‌కు రూ.2 వరకు చెల్లిస్తోంది. కానీ అర్జీదారుల నుంచి మాన్యువల్ పద్ధతిలో దరఖాస్తులను స్వీకరిస్తున్న అధికారులు స్టేషనరీ నిధులను స్వాహా చేస్తున్నారు. -
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్
-
ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో నిన్నటి(మంగళవారం) నుంచి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు వైద్య సేవలను నిలపివేశాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం 550 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో 3 నెలలుగా ఆశా ప్రతినిధులు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దాదాపు 80వేల రోగుల క్లెయిమ్‌లను పెండింగ్‌లో పెట్టింది. ఆరోగ్యశ్రీ బిల్లులను నెల రోజుల్లో చెల్లిస్తామని చెప్పిన మంత్రులు, అధికారులు పట్టించుకోవడం మానేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన నెట్వర్క్ ఆస్పత్రులు వైద్యం కోసం వచ్చినవారిని వెనక్కి పంపిస్తున్నాయి. బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. -
సమ్మె విజయవంతం
– కదంతొక్కిన కార్మికులు – మూతపడిన బ్యాంకులు, పోస్టల్ కార్యాలయాలు, ఇన్సూరెన్స్ కార్యాలయాలు – నడవని ఆర్టీసీ బస్సులు, ఆటోలు కర్నూలు సిటీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు శుక్రవారం చేపట్టిన దేశ వ్యాప్త సమ్మె జిల్లాలో విజయవంతమైంది. ఉదయం ఆరు గంటలకే మండల కేంద్రాల్లో కార్మిక సంఘాల నాయకులు, ఆటో వర్కర్స్ యూనియన్, హమాలీ, అంగన్వాడీ వర్కర్స్, ఏఐటీయూసీ, సీఐటీయూ.. వీటి అనుబంధ సంఘాల కార్మికులు రోడ్లపైకి చేరుకుని నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్సులను, ఆటోలను, ఇతర వాహనాలను నిలిపి వేసి సమ్మెకు సహకరించాలని కోరారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న కార్మికుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, హక్కులను అమలు చేయాల్సిన పాలకులు కాలరాసే విధంగా చట్టాలను మార్పులు చేస్తున్నారని ఆయా కార్మిక సంఘాల నాయకులు విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగు దేశం ప్రభుత్వాలు అభివద్ధి ముసుగులో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్నారు. రోడ్డు రవాణా భద్రత బిల్లును రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. సమ్మె చేసేందుకు ముందు కేంద్ర ప్రభుత్వానికి 12 ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని 9 కేంద్ర కార్మిక సంఘాలు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. జిల్లాలోని గుర్తింపు ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నాయి. బ్యాంకులు, పోస్టల్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాయాలు, ప్రభుత్వ, ప్రై వేటు పాఠశాలలు మూతపడ్డాయి. సమ్మెకు వైఎస్ఆర్సీపీ, వామపక్ష పార్టీల మద్దతు కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన దేశ వ్యాప్త సమ్మెకు వైఎస్ఆర్సీపీ, వామ పక్ష పార్టీలు మద్దతు ఇచ్చాయి. కార్మికులకు అండగా వైఆర్సీపీ పోరాటం చేస్తుందని కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ హఫీజ్‌ఖాన్ తెలిపారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్, ఏటీయూసీ రాష్ట్ర నాయకులు పి.దామోదరరావు, సీఐటీయూ నాయకులు రాధాకష్ణ, ఏపీ ఎన్జీవో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంగళరెడ్డి, ఐఎన్టీయూసీ రమణ, మున్సిపల్ కార్మికులు, బ్యాంకు ఉద్యోగులు, పోస్టల్ ఉద్యోగులు, మెడికల్ రెప్స్ సంఘం, ఏపీటీఎఫ్ సంఘం, ఐఎన్టీయూసీ, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం, రైతు సంఘం నాయకులు, పలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఐద్వా, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. స్తంభించిన సేవలు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం బ్యాంకింగ్ వ్యవహారాలు స్తంభించిపోయాయి. భారతీయ స్టేట్‌బ్యాంకు, ఏపీజీబీ మినహా జిల్లాలోని అన్ని బ్యాంకులు సమ్మెలో భాగంగా బంద్ అయ్యాయి. ఆయా బ్యాంకుల ఉద్యోగులు కూడా సార్వత్రిక సమ్మె ర్యాలీ తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్రబ్యాంకు, సిండికేట్ బ్యాంకు, జిల్లా సహకార కేంద్రబ్యాంకు తదితర బ్యాంకులు మూత పడటంతో కోట్లాది రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. బీమా సంస్థలు మూత పడ్డాయి. అన్ని జీవిత బీమా కార్యాలయాల అధికారులు, సిబ్బంది సమ్మెలో పాల్గొనడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు దాదాపుగా పనిచేయలేదు. జిల్లా కలెక్టరేట్లోని అన్ని శాఖల కార్యాలయాలు సిబ్బంది లేక వెలవెలపోయాయి. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక్కరు కూడా కనిపించలేదు. వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, ఆడిట్ కార్యాలయం, జిల్లా ప్రణాళిక విభాగం, జిల్లా ట్రెజరీ, ఐసీడీఎస్, సహకార శాఖ తదితర కార్యాలయాలు ఖాళీ అయ్యాయి. జిల్లా నాన్ గజిటెyŠ అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్ వెంగళరెడ్డి, జవహార్‌లాల్ ఇతర జిల్లా నాయకులు కూడా సమ్మెకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్టీసీకి రూ.25లక్షల నష్టం సార్వత్రిక సమ్మె ప్రభావం ఆర్టీసీపై పడింది. ఆందోళన కారులు బస్సులను అడ్డుకోవడంతో రూ.25లక్షల వరకు కర్నూలు రీజియన్ ఆదాయాన్ని కోల్పోయింది. జిల్లాలో మొత్తం 1016 బస్సులున్నాయి. వీటిలో శుక్రవారం సాయంత్రం 6గంటల సమయానికి 709 బస్సులు నడపాల్సి ఉండగా కేవలం 538 సర్వీసులు మాత్రమే డిపోల నుంచి బయటకు వెళ్లాయి. మిగిలిన 171 సర్వీసులు రద్దయ్యాయి. దీంతో సంస్థకు రూ.25 లక్షల మేరకు ఆదాయం కోల్పోయిందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.