తలకొండపల్లి మండలానికి చెందిన మల్లయ్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో కుటుంబీకులు మంగళవారం నగర శివారులోని ఓ ప్రైవేటు (నెట్‌వర్క్) ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఆరోగ్యశ్రీ కార్డు సహాయంతో సదరు ఆస్పత్రికి వెళ్లిన మల్లయ్యకు.. చికిత్స చేసేందుకు ఆస్పత్రి వర్గాలు తిరస్కరించాయి. ఇదేమని అడగగా.. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని, అందుకే సేవలు నిలిపివేశామని తేల్చిచెప్పారు. పరిస్థితి సీరియస్‌గా ఉందని, ఎలాగైనా ఆదుకోవాలని కుటుంబీకులు బతిమాలినా ఆస్పత్రి యాజమాన్యం మెట్టు దిగలేదు. సుమారు అరగంటపాటు అక్కడే ఉన్నా కనికరించలేదు. దీంతో చేసేది లేక హుటాహుటిన హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇది మల్లయ్య ఒక్కడికే ఎదురైన అనుభవం కాదు.. ఇలాంటి రోగులు చాలామంది నిత్యం తీవ్ర అవస్థలు పడుతున్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రైవేటు ఆస్పత్రుల్లో పేదలకు వైద్య సేవలు నిలిచిపోవడంతో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. తమ వద్ద డబ్బులు లేకున్నా కార్పొరేట్ వైద్యం అందుతుందన్న నమ్మకంతో ఆస్పత్రుల మెట్లెక్కుతున్న రోగుల గుండె బరువెక్కుతోంది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో వైద్యసేవలను నిలిపివేశామని తేల్చిచెబుతుండడంతో రోగులకు రోదనే దిక్కవుతోంది. అలాగే, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్‌ఎస్) కింద చికిత్స పొందాలనుకుంటున్న ఉద్యోగులు, జర్నలిస్టులకు కూడా ఇదే చేదు అనుభవం ఎదురవుతోంది. ఇటు ప్రభుత్వ వైఖరి.. అటు బకాయిల విడుదలపై ప్రైవేటు ఆస్పత్రుల పట్టు విడువని ధోరణి.. ఫలితంగా రోగులు సమిధలుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఐదు రోజులుగా ఆస్పత్రులు ఆందోళనపథంలో ఉండడంతో.. బాధితుల దుస్థితి వర్ణణాతీతంగా మారింది.
బకాయిలు రూ.317 కోట్లు
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ బకాయిలు పేరుకుపోవడంతో పేదలతోపాటు ఉద్యోగులు, పాత్రికేయులకు అందించే వైద్య సేవలను ప్రైవేటు ఆస్పత్రులకు నిలిపివేశాయి. కొన్ని ఏళ్లుగా బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆందోళన బాటపట్టాయి. మరోవైపు త్వరలో నిధులు వస్తాయని సేవలు కొనసాగించాలని ఆస్పత్రుల యాజమాన్యాలను ప్రభుత్వం కోరుతున్నా మెట్టుదిగడం లేదు. బకాయిలు విడుదల చేస్తారని ఏళ్లుగా నిరీక్షిస్తున్నామని, అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ పేర్కొంటోంది. వందల కోట్ల రూపాయలు అందకపోవడంతో తమకు ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. బకాయిలు విడుదల చేస్తేనేగాని సేవలను పునరుద్ధరించలేమని ఆస్పత్రుల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి.
బిల్లుల చెల్లింపుల్లో చోటుచేసుకుంటున్న జాప్యంపై మండిపడుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 550 ప్రైవేటు ఆస్పత్రులు ఉండగా.. వీటిలో 79 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ , ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ కింద వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆరు మెడికల్ కాలేజీలు ఉండగా.. వీటిలో మాత్రమే ఆరోగ్యశ్రీ , ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ కింద సేవలు రోగులకు అందుతున్నాయి. మిగిలిన ఆస్పత్రులు ఆందోళన పథాన్ని పట్టాయి. ఈ ఆస్పత్రులకు సుమారు రూ. 317 కోట్లను ప్రభుత్వం బకాయి పడినట్లు తెలుస్తోంది. దాదాపుగా రెండు మూడేళ్లుగా సక్రమంగా నిధులు విడుదల చేయకపోవడంతో సేవల నిలిపివేతే శరణ్యమని భావించిన ఆస్పత్రుల యాజమాన్యాలు ఆందోళనను కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి స్పందన వస్తే తప్పా సమ్మె విరమించబోమంటున్నారు.
‘సేవల బంద్’ బోర్డులు
బకాయిలు పేరుకుపోవడంతో వైద్యసేవలు అందించలేమని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు బోర్డులు పెడుతున్నాయి. మరికొన్ని ఆస్పత్రులు బహిర్గతంగా బోర్డులు ఏర్పాటు చేయకున్నా.. సేవలకు దూరంగా ఉంటున్నాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వెళ్తున్న రోగులను యాజమాన్యాలు తిప్పి పంపిస్తున్నారు. కాళ్లావేళ్లా పడి ప్రాదేయపడినా కనికరించడం లేదు. ఆరోగ్యశ్రీ ఉందని చేతుల్లో డబ్బులు లేకున్నా కొండంత ధైర్యంతో ఆస్పత్రుల బాట పడుతున్న రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. డయాలసిస్ చేసుకుంటున్న కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్థులు, క్యాన్సర్ తదితర వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నవారి పరిస్థితి వర్ణనాతీతం. ఇక రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారు, ఇతర అత్యవసర అనారోగ్య సమస్యలు వారు కచ్చితంగా డబ్బులు పెట్టుకుని వైద్యసేవలు పొందుతున్నారు. ఆస్పత్రులు సేవలను నిలిపివేసిన నేపథ్యంలో ప్రభుత్వం యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నా ఫలించడం లేదు. పెండింగ్‌లో ఉన్న నిధులన్నింటినీ విడుదల చేస్తేనే సేవలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేస్తున్నాయి.
మెడికల్ కాలేజీల్లో సేవలు..కొన్ని ఆస్పత్రులు మాత్రమే ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలను నిలిపివేశాయి. ఇలా ఇబ్బంది పడుతున్న రోగులను మెడికల్ కాలేజీలకు, ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నాం. ధర్నా కొనసాగిస్తున్న ఆస్పత్రుల వివరాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిస్తున్నాం. ఏయే ఆస్పత్రులు.. రోజువారీగా ఎంతమందికి వైద్యం అందిస్తున్నాయనే విషయాన్ని తెలియజేస్తున్నాం. – డాక్టర్ రఘునాథ్ రెడ్డి, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త
Comments
Please login to add a commentAdd a comment