వారంతా కడు నిరుపేదలు..రేయింబవళ్లు కష్టించి పనిచేసినా కుటుంబాలు గడవడం కష్టమే. పనికి తగిన ప్రతిఫలం వారికి లభించకపోగా అస్వస్థత అదనంగా తోడవుతుంది. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా దశాబ్దాల తరబడి పిడికెడు మెతుకుల కోసం జీవన పోరాటం చేస్తున్న బీడీ కార్మికుల దీన గాథ ఇది.
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్:జిల్లాలో కర్నూలు నగరంతోపాటు వెల్దుర్తి, బేతంచెర్ల, ఆదోని, నంద్యాల తదితర ప్రాంతాల్లో దాదాపు 10 వేల మంది బీడీ కార్మికులు ఉన్నారు. కర్నూలు నగరంలో వీరు 8 వేల మందికి పైగా ఉన్నారు. కొందరు సంఘటిత, మరి కొందరు అసంఘటిత కార్మికులుగా పని చేస్తున్నారు. 2011లో బీడీ కంపెనీల యజమానులు, కార్మిక సంఘాల మధ్య వేతన ఒప్పందం జరిగింది.
ఇందులో భాగంగా వెయ్యి బీడీలు చుడితే రూ.110 ఇవ్వాల్సి ఉంది. అయితే వివిధ రకాల కారణాలు, జరిమానాల పేరుతో బీడీ కంపెనీల యాజమాన్యాలు కార్మికులను శ్రమదోపిడీకి గురి చేస్తున్నాయి. వెయ్యి బీడీలు చుట్టేందుకు కార్మికులకు ఇచ్చిన ఆకుతో వెయ్యి బీడీలు తయారు చేస్తే రూ.70కి మించి ఇవ్వడం లేదని కార్మికులు వాపోతున్నారు. పైగా యజమానులు ఇచ్చినదానిలో పనికిరాని ఆకు ఉండి బీడీలు తక్కువ వస్తే వంద బీడీలకు రూ.2 ప్రకారం జరిమానా విధిస్తూ తమ కూలీలో కోత పెడతారని వారు చెబుతున్నారు. బీడీ కార్మికుల సంక్షేమం కోసం పలు చట్టాలు ఉన్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. కర్నూలు నగరంలో దాదాపు 3 వేల మంది రెగ్యులర్ కార్మికులు ఉన్నారు. వివిధ బ్రాంచీల్లో రోజు వారీ కూలీలుగా దాదాపు 5 వేల మంది పనిచేస్తున్నారు. ఆరు నెలల సర్వీస్ ఉన్న ప్రతి కార్మికునికి పీఎఫ్ వర్తింపజేయాలని నిబంధనలు ఉన్నా.. అవి ఎక్కడా వర్తించడం లేదు. యజమానులు తెలివిగా బ్రాంచీలను ఏర్పాటు చేసి అక్కడ రోజువారీ కూలీపై కార్మికులతో పని చేయించుకుంటున్నారు. పేదరికం కారణంగా తమ చిన్నారులను బీడీ కార్మికులు చదివించలేక పోతున్నారు.
సౌకర్యాలు కల్పించాలి: వి. రవికుమార్, ఏపీ బీడీ, సిగార్ కార్మిక సంఘం
నగర కార్యదర్శి
బీడీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి. పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వారికి ఉచితంగా వైద్య సేవలు అందించాలి. అలాగే గృహాలను యుద్ధప్రాతిపదికన నిర్మించి ఇవ్వాలి. బీడీ కార్మికుల పిల్లలకు ప్రత్యేకంగా ప్రభుత్వం రెసిడెన్సియల్ పాఠశాలను నగరంలో ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వం ఆదుకోవాలి: షెహనాజ్‌బేగం, రోజావీధి
అనేక సంవత్సరాలుగా బీడీలు చుట్టే జీవనం చేస్తున్నాం. కుటుంబం పెద్దది కావడంతో ఆర్థిక ఇబ్బందులతో కష్టాలను అనుభవిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మా దరికి చేరడం లేదు. పక్కా ఇళ్లు, పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలి.
కూలీ రేట్లు పెరగాలి: దేవమ్మ, బుధవారపేట
ప్రస్తుతం ఆయా బీడీ కంపెనీలు ఇస్తున్న కూలీ రేట్లు ఏమాత్రం కడుపు నింపేవిగా లేవు. పగలంతా కష్టపడి వెయ్యి బీడీలు చుట్టినా ఫలితం దక్కడం లేదు. ఖరీదైన వైద్యం చేయించుకోలేక స్థానిక ఆసుపత్రిలో ఇస్తున్న సూదులు, మందులనే వాడుతున్నాం. మేం నివాసం ఉంటున్న ప్రాంతాలకే వచ్చి వైద్య సేవలు అందిస్తే బాగుంటుంది.
అందుబాటులో అన్ని రకాల మందులు: డా.పి చెన్నకేశవరెడ్డి
బి. క్యాంప్‌లోని ఆసుపత్రిలో బీడీ కార్మికులకు అవసరమైన అన్ని రకాల మందులు ఉన్నాయి. ఇక్కడి ఎక్కువగా బీపీ, షుగర్, ఒళ్లు నొప్పులు,
ఆస్తమా వ్యాధులతో వస్తున్నారు. ప్రతి రోజు 30 నుంచి 50 మంది దాకా వైద్యసేవల కోసం ఆసుపత్రికి వస్తున్నారు. మొబైల్ వాహనం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పొగచూరిన బతుకులు
Published Thu, Feb 6 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
Advertisement
Advertisement