కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు
– డీసీఎల్ మహేశ్వర కుమార్
– 212 మందికి రూ.60,2400 మంజూరు చేయాలని ప్రతిపాదన
కర్నూలు (రాజ్‌విహార్): కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్, చైర్మన్ యు.మహేశ్వర కుమార్ ఆదేశించారు. మంగళవారం స్థానిక ధర్మపేటలోని కార్మిక శాఖ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ దరఖాస్తులపై ఏసీఎల్, ఏఎల్‌ఓ, కార్మిక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను కార్మికుల చెంతకు చేర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు ట్రేడ్ యూనియన్ల నాయకులు అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు.
ఈ క్రమంలో 212 పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కల్పించాలని కోరుతూ రూ.60,2400 మంజూరు చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు ప్రతిపాదనల పంపించారు. ఇందులో భవన నిర్మాణ కార్మిక కుటుంబాల్లో మెటర్నిటీ (కాన్పు) అలవెన్స్ కింద 154 మందికి రూ.20వేలు చొప్పున రూ.30.80లక్షలు కావాలని, పెళ్లిళ్లకు 33 మందికి రూ.10వేల చొప్పు రూ.3.30లక్షలు, ప్రమాదవశాత్తూ మరణానికి రూ.12.40లక్షలు (ముగ్గురికి), తాత్కాలిక వైకల్యం రూ.2400(ఒకరు), సహజ మరణానికి రూ.13.50లక్షలు(21 మంది) చొప్పున పంపించారు. కార్యక్రమంలో ఏసీఎల్ శేషగిరి రావు, ఏఎల్‌ఓలు కేషన్న, సుందరేష్, సుబ్బారెడ్డి, విల్సన్, హేమాచారి, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.