సమస్యల పరిష్కారం కోసం..
► గ్రీవెన్స్‌లో అర్జీలిచ్చిన ప్రజలు
నెల్లూరు(వేదాయపాళెం) : కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షణలు చేసినా సమస్యలు పరిష్కారం కావడంలేదంటూ పలు ప్రాంతాల ప్రజలు సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో అధికారుల వద్ద విన్నవించుకున్నారు. నగరంలోని నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కె.వెంకటేశ్వర్లు డివిజన్ పరిధిలోని మండలాల నుంచి వచ్చిన వారు ఇచ్చిన అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలపై అధికంగా అర్జీలు అందాయి.
రైల్వేలైన్ ఏర్పాటుతో భూములు కోల్పోయిన రాపూరు మండలంలోని పలు గ్రామాల వారు నష్టపరిహారం కోరుతూ వినతి సమర్పించారు. ఈ నెలాఖరుకు ఆర్డీఓ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు ఇదే చివరి గ్రీవెన్స్‌డేగా మారింది. దీంతో ఆయా సమస్యల పరిష్కారం విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. రెండు రోజుల్లో వెళ్లిపోయే నాకు స్వల్పకాలంలో సమస్యలను పరిష్కరించేందుకు వీలుకాదంటూ ఆయా సమస్యలను చెప్పుకోడానికి వచ్చిన వారితో బాహాటంగానే చెప్పారు.
తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నరసింహులు సెలవుపై వెళ్లడంంతో డిప్యూటీ తహసీల్దార్ మనోహర్, రూరల్ ఎంపీడీఓ వసుమతి, హౌసింగ్ ఏఈ మనోజ్‌కుమార్‌లు రూరల్ అర్బన్ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్బన్ ప్రాంతంలో శివారు ప్రాంతాల్లోని భూ ఆక్రమణలపై అర్జీలు అధికంగా అందాయి. నివేశన స్థలాలు, రేషన్‌కార్డులు మంజూరు చేయాలని వినతిపత్రాలు అందజేశారు. రూరల్ ప్రాంత గ్రామాల సమస్యలను ఎంపీడీఓకు వివరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.