
అద్దె బలం కోసం టీడీపీ ఆకర్ష్
చీరాలలో టీడీపీ అనైతిక రాజకీయాలకు పాల్పడుతోంది. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సొంత బలం లేకపోవడంతో అద్దె బలం కోసం వెంపర్లాడుతోంది.
చీరాలలో టీడీపీ అనైతిక రాజకీయాలకు పాల్పడుతోంది. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సొంత బలం లేకపోవడంతో అద్దె బలం కోసం వెంపర్లాడుతోంది. ప్రత్యర్థి పార్టీల నేతలతో మంచిగా నటిస్తూనే, ముంచేందుకు యత్నిస్తోంది. వివరాల్లోకెళ్తే... పురపాలక సంఘ ఎన్నికల్లో పట్టణ ప్రజలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మద్దతునిచ్చారు. మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులుండ గా వైఎస్‌ఆర్ సీపీకి 15 వార్డులు, టీడీపీకి 12, ఇండిపెండెంట్ ప్యానల్‌కు 6 వార్డులు దక్కాయి. అన్ని పార్టీలకంటే వైఎస్‌ఆర్ సీపీకే ఎక్కువ వార్డులు దక్కాయి. ఏ పార్టీకీ సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో చైర్మన్ పీఠంపై సందిగ్ధత నెలకొంది. ఆ పదవి దక్కించుకోవాలంటే కనీసం 17 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. ఈ లెక్క ప్రకారం వైఎస్‌ఆర్ సీపీకి ఇద్దరు, టీడీపీకి ఐదుగురు కౌన్సిలర్లు అవసరమవుతారు.
చీరాలలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్ సీపీతో కలసి చెరో రెండున్నరేళ్ల కాలం చైర్మన్ పదవిని పంచుకునేలా వైఎస్‌ఆర్ సీపీ నాయకులతో మంతనాలూ జరిపారు. ఇటువంటి పరిస్థితే చీరాల రూరల్ మండల ఎంపీపీ ఎన్నికలోనూ ఉంది. మండలంలో మొత్తం 24 ఎంపీటీసీలుండగా వైఎస్‌ఆర్ సీపీకి 12, టీడీపీకి 8, ఇండిపెండెంట్ ప్యానల్‌కు 3, బీఎస్పీకి 1 ఎంపీటీసీ స్థానం దక్కాయి. ఎంపీపీ పీఠం దక్కించుకోవాలంటే 13 మంది సభ్యుల మద్దతు అవసరం. వైఎస్‌ఆర్ సీపీకి మరొకటి ఉంటే సరిపోతుంది. ఎంపీపీ ఎంపికలో కూడా సహకరించుకోవాలనే విధంగా టీడీపీ నేతలు వైఎస్‌ఆర్ సీపీ నాయకులతో మంతనాలు జరిపారు. ఒకవైపు ఇలా నటిస్తూనే, మరోవైపు వైఎస్‌ఆర్ సీపీ కౌన్సిలర్లతో బేరసారాలకు దిగుతున్నారు. వైఎస్‌ఆర్ సీపీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లను కొనుగోలు చేసే విధంగా కొద్దిరోజులుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో కౌన్సిలర్‌కు రూ.10 నుంచి రూ.15 లక్షలు ఇస్తామంటూ కౌన్సిలర్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అడ్డదారిన చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు వైఎస్‌ఆర్ సీపీ కౌన్సిలర్లు కొందరిని ప్రలోభాలకు గురిచేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైఎస్‌ఆర్ సీపీ కౌన్సిలర్లలో చాలామంది టీడీపీకి మద్దతునిచ్చేందుకు అంగీకరించడం లేదని సమాచారం.
గీత దాటితే వేటే
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీచేసి గెలుపొందిన అభ్యర్థులు మరో పార్టీలోకి జంప్ అయితే ఎన్నికల నిబంధనలు మేరకు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటుపడే అవకాశం ఉంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల కమిషన్ గుర్తింపు పార్టీగా పేర్కొంది. అయినప్పటికీ టీడీపీ అనైతిక రాజకీయాలకు ప్రయత్నించడం గమనార్హం.