గాలికొండ ఏరియా కమిటీ వాల్‌పోస్టర్లు అంటించి హడావుడిచేయడం వారి వ్యూహంలో భాగమని డీజీపీ సాంబశివరావు చెప్పారు.
గుంటూరులో విలేకరుల సమావేశంలో డీజీపీ సాంబశివరావు
సాక్షి, గుంటూరు: గాలికొండ ఏరియా కమిటీ వాల్‌పోస్టర్లు అంటించి హడావుడిచేయడం వారి వ్యూహంలో భాగమని డీజీపీ సాంబశివరావు చెప్పారు. గుంటూరు నగరంలోని పాతగుంటూరు, నగరంపాలెంలో నిర్మిస్తున్న నూతన మోడల్ పోలీసు స్టేషన్‌లను మంగళవారం ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మావోరుుస్టులు వారి క్యాడర్‌లో మనో ధైర్యం నింపేందుకు, ఉనికిని చాటిచెప్పుకునేందుకు ఈ చర్యలకు దిగుతున్నారని చెప్పారు.
పోలీసు శాఖ ఆప్రాంతంపై పూర్తి పట్టు సాధించిందని, ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ వారితోపాటు, మరికొందరు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సామాన్య ప్రజల శాంతికి భంగం కలుగకూడదనే తాము కూంబింగ్ చేయడం లేదని, మళ్లీ అవసరమైతే ఆప్రాంతంలోకి ప్రవేశిస్తామని చెప్పారు. పోలీసు శాఖలో 14వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, నిదానంగా వాటిని భర్తీ చేస్తామన్నారు. అర్బన్ జిల్లాను నిర్లక్ష్యం చేసే సమస్య లేదని, తుళ్లూరులోసైతం ఐపీఎస్ అధికారిని నియమించామని చెప్పారు. పాతపద్ధతుల్లో కాకుండా పోలీసులు ప్రజలతో మమేకమై స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మంచిగా మాట్లాడి వారి సమస్యలను తీర్చేందుకు ప్రయత్నించాలన్నారు.