హక్కుల్లేని రాష్ట్రమెందుకు?
సాక్షి, హైదరాబాద్: సర్వహక్కులు లేని తెలంగాణ రాష్ట్రం ఎందుకు? అని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, శాసనసభ్యుడు కె.తారక రామారావు, ఎంపీ జి.వివేక్ ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీ, కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్టుగా హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో సంపూర్ణ తెలంగాణ కావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌పై హక్కుల్లోనూ, 10 జిల్లాల సరిహద్దుల్లోనూ ఏం కొంచెం తక్కువైనా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు, నీళ్లు, నిధులు, కొలువులు వంటివాటిపై అధికారాల్లేకుంటే తెలంగాణ పునర్నిర్మాణం ఎలా సాధ్యమని కేకే ప్రశ్నించారు. హైదరాబాద్‌పై ఆంక్షలు పెడితే అది తెలంగాణ ప్రజలను కించపర్చినట్లేనని వ్యాఖ్యానించారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రానికే ఆంక్షలు, షరతులు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 10 ఏళ్ల తర్వాత వారే బాధపడతారని ఏఐసీసీ ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 60 ఏళ్లలో తెలంగాణకు జరిగిన అన్యాయం, ఆవేదనను ఇప్పటికే చాలాసార్లు దిగ్విజయ్ సింగ్‌కు వివరించామన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ఎంపీ జి.వివేక్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో సీమాంధ్రులు 6 లక్షలు మాత్రమే అని శ్రీకృష్ణ కమిటీ నివేదికలో చెప్పినా సీమాంధ్ర నేతలు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 7 యూనివర్సిటీలుంటే సీమాం ధ్రలో 12 ఉన్నాయన్నారు. ఉద్యోగుల సంఖ్యపై కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేసినట్టుగా సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు పేర్కొనటం అబద్ధమని కేటీఆర్ చెప్పారు. దీన్ని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని సవాల్ చేశారు. ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేని తెలంగాణకోసం కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
నేడు ఢిల్లీకి కేసీఆర్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, కె.కేశవరావు జీవోఎంతో సమావేశమయ్యేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ నిర్వహించే శిక్షణా శిబిరాల ఉపన్యాసకులతో ఉదయం 11 గంటలకు టీఆర్‌ఎస్ కార్యాలయంలో కేసీఆర్ సమావేశం కానున్నారు. శిక్షణా శిబిరాలకు దిశానిర్దేశం చేసిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.