హైదరాబాద్: మాజీ మంత్రి శంకర్రావు మౌనదీక్ష చేపట్టారు. తన తమ్ముడు దయానంద్ అరెస్టును నిరసిస్తూ శంకర్రావు మౌనదీక్షకు దిగారు. భూకబ్జా, నకిలీ డాక్యుమెంట్ సృష్టించటం,చీటింగ్ కేసుల్లో మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు తమ్ముడు దయానంద్‌ను ముషీరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి నాంపల్లికోర్టులో హాజరపర్చారు. దీనిని నిరసిస్తూ శంకర్రావు మంగళవారం మౌనదీక్షకు పూనుకున్నారు.
సీమాంధ్రలో ఇందిర, రాజీ వ్ విగ్రహాల ధ్వంసం చేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని శంకర్రావు తెలిపారు. ఆ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు ఎవర్నీ అరెస్ట్ చేయకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
నన్ను, నా కుటుంబసభ్యులను సీఎం, డీజీ పీ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తమ్ముడు, చెల్లెల్ని అక్రమంగా అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. గతంలో తన ఇంటిపై దాడి విషయంలో సభాహక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.
డీజీ పీ ఆస్తులు, సీఎం ఎర్రచందనం కేసులో సీబీఐ విచారణ చేయించాలన్నారు. తనపై సీబీఐ విచారణ కూడా సిద్ధంగా ఉన్నట్లు శంకర్రావు తెలిపారు.